Saturday, 12 December 2015

ఇంధనంహాయ్ కన్నా...

అమ్మపేగుతో నీ జీవబంధాన్ని ఎంతబాగా ముడి వేసుకున్నావ్ రా...!  అండం నుండి పిండంగా... ఆపై అమ్మ కడుపునే బ్రహ్మాండంగా భావిస్తూ ఎంతగా మురిసిపోతున్నావో కదా... అక్కడ ఉన్నన్నాళ్ళన్నా మురిసిపోరా… బయటకి వచ్చాక మురిసిపోతావో మరి ముగిసిపోతావో ఏదీ నీ చేతుల్లో లేదోయ్.

మరి బయటకి రావాలని ఎందుకురా తొందర? అమ్మకడుపు చెరసాల కాదురా… అవకాశం ఉంటే అక్కడే  ఉండిపో… ఒక్కటైతే చెప్పగలనురా… నువ్వు లోపలున్నా… బయటకి వచ్చినా అమ్మ ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైనదే.

నువ్వక్కడ చూస్తున్నది రక్త మాంసాల మైదానాలు, ఉమ్మనీటి సాగరాలు మాత్రమే. ఒక్కసారి లోకానికి వచ్చేసావా నీ విహార యాత్రలన్నీ కాలుష్య కాసారాలలోనే… కాలుష్యం అంటే గాలి కాలుష్యమో… నీటి కాలుష్యమో కాదురా చిన్నా… మానవ జాతి కాలుష్యం... మనిషితనపు కాలుష్యం…! ఇక్కడ పుడుతూనే నువ్వు ఏడవాలిరా… అది ఈ లోకపు నియమం. ఖర్మకాలి పుట్టగానే నువ్వు ఏడవ లేదా తొడపాశం పెట్టి మరీ ఏడిపిస్తుందిరా ఈ లోకం.

నువ్వే చూస్తున్నావ్ కదా ఇప్పటి నీలోకం… నువ్వే కాదు… నేను… ఇంకోడు మరొకడు అందరమూ చూసిన ప్రపంచం అదేరా… అక్కడ ఉన్నప్పుడు మనకి తేడాలేమీ తెలియదు. బయటకు వచ్చే సరికి నీ కోసం ఎన్ని గుర్తింపులు  సిద్ధంగా ఉంటాయో తెలుసా?

లోపల నువ్వు చూసిన ప్రపంచం చాలా చిన్నదిరా. లోపల నువ్వు చూసిన దానితో పోలిస్తే  బయట ఉన్నప్రపంచం అనంతం రా. ఇంతటి పృథ్విపై నువ్వు స్వేచ్ఛగా  మెసలటానికి లేకుండా నీకంటూ ఒక ప్రాంతం, ఆ ప్రాంతాన్ని బట్టి, నువ్వు పుట్టిన కడుపున బట్టి నీకంటూ ఒకవర్ణం, నీ అమ్మానాన్నల ఆచరణని బట్టి నీకంటూ ఒక మతం, దాన్ని ఇంకాస్త విస్తరిస్తే  మతాల్లోని శాఖలో… కులగోత్రాలో… ఇంకా… ఇంకా… ఎన్నిరా? చెప్తూ వెళితే  అంతే ఉండదు.

ఏదో చిన్నా.. కన్నా అంటున్నాను  కదా అని  ఇదంతా కేవలం మగశిశువుకి చెప్తున్నా మాటలు కాదురా… ఒక వేళ నువ్వు గనక ఆడ శిశువువి ఐతే  నువ్వసలు బయటకు వస్తావో… వచ్చినా బతుకుతావో.. లేదో , బతికినా అమ్మ వడిలో లాల పోసుకుంటావో... చెత్తకుప్పలో శిధిలమవుతావో ఆ దేవుడికీ ఎరుక అవ్వదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే  మా'నవ'జాతి తమలోని సగానికి ఇచ్చుకుంటున్న విలువరా అది. భూమికి భారం త్వరగా తగ్గిద్దామనే ప్రకృతి సేవలే అది అని చెప్పినా చెప్తారు మావాళ్ళు.

పుట్టకముందే మీకోసం… అంతే కాదురోయ్... మీ ఏడేడు  తరాల వారసుల కోసం రంగు కాగితాలనో, లోహ ధాతువులనో అలా అలా పేర్చుతూ  పోయేవారు కొందరైతే… గుక్కెడు పాలివ్వలేక… కంటికి ధారగా ఏడుస్తూ మిమ్మల్ని విడవలేక విడిచే వారు కొందరు. 

మరి ఇదొక రంగుల రాట్నం… మానవజాతి మాయాజాలం. అడుగు వేశావా వెనక్కి తీసుకోలేని మాయా చదరంగం. 
  
అప్పుడే అయిపోలేదు బంగారూ… ఎదిగేకొద్దీ పెరిగే సవాళ్ళూ… ఇప్పుడు నీకు తెలియటం లేదు కానీ, బయటి  లోకంలో   రూపంటూ ఆకలి  అనే రాకాసి ఒకటి  ఉంది. అది నిన్ను జీవితంలో ఏ తీరాలకి చేరుస్తుందో ఇప్పుడే చెప్పలేం. అదొక్కటి చాలు నీ కలలన్నిటినీ అస్తవ్యస్తం చెయ్యటానికి.

మీరు ఈ భూమ్మీదకి వచ్చాక అయినా, ఏ అజ్ఞానాన్నీ నేర్వకండి.  ఆనందానికి పనికిరాని అన్ని సిద్ధాంతాలనీ తెగనరకండి.  మనిషిని నుండి మనిషిని వేరు చేసే సమాజాన్ని చిధ్రం చెయ్యండి. భీరువుగా బతకొద్దురా ధీరుడివై ప్రకృతితో మిత్రత్వాన్ని కొనసాగించు. హక్కుల కోసం కాదురా ఆనందం కోసం పోరాడు.

ఇకపై విప్లవమంటే నెత్తుటి పోరాటం మాత్రమే కాదు మనిషిని మిగుల్చుకోవాలనే ఆరాటం కూడా. పవిత్ర యుద్ధాలు చెయ్యల్సింది మనుషుల్ని చంపుతూ కాదు... మనుసులోని  మమతలని  వెలికి తీస్తూ…

దిగంతాల్లో అనంతకాలం ప్రజ్వలిల్లాలి మీ తరమే  ‘ఇంధనమై’

ఇట్లు,

ఓ చేతకానివాడు

0 comments:

Post a Comment