Monday, 7 December 2015

హేమంత స్పర్శ - 15ఏమిటోయ్ నేస్తం! 

నీ ఈ మాయా జాలం. 

సమాధానాలన్నీ  మృగ్యమైన ప్రశ్నలకే  పూయబడ్డట్లున్న ఈ  బ్రతుకులో, కాస్త ఆలస్యంగానైతేనేం  నాకు రావాల్సిన ఒకే  ఒక్క ప్రత్యుత్తరమై  నువ్వు...  తోడే కొద్దీ స్వచ్ఛతనే  అందించే  ఇసుక అడుగున దాగిన చెమ్మలా హృదయం నిండా పరచుకున్నావ్.

ఒక్క ఖాళీ గదీ లేని గుండెలో ఒక వేకువని శాశ్వతం చేసిన ప్రాణమా!  

నువ్వు నడచిన నీరెండల దూరాలని మట్టి పొరల కింద నుండి ఆర్ద్రంగా అనుభూతించాలని  వేచి ఉన్న నా గతమంతా నిరీక్షణకి నిజమైన నిర్వచనమంటే కాదన గలవా?  లేదు కదూ! నిద్రని వలస పంపేసిన ప్రతి ఎదురు చూపూ నిన్నటి రాత్రుళ్ళకి చేసిన గాయపు మరకలని యిట్టే అదృశ్యం చేసిన నీ సహజ స్వాభావికం అలలు అలలుగా నన్ను తడుముతున్న ఈనాటి ఒరవడిలో నిశ్శబ్దాన్ని  శబ్దించే ఒకానొక అభిరుతం.

అప్పుడెప్పుడో నా నిరీక్షణవైన నువ్వు ఇప్పుడు మాత్రం నా అహానివి. మామూలుగా ఐతే ఏమో కానీ ఇలాంటి అహం ఉన్నప్పుడు దాన్ని వదులుకోవటం నేనైతే చెయ్యలేనురా. నిజానికి మనిషి మనిషికి ఇలాంటి అహమొకటి వ్యక్తిగతమైతే… ఆ అహాన్ని శాశ్వతం చేసుకునే దిశగా మనిషి మనసుతో మాట్లాడటం మొదలు పెడితే...   అది చాలదూ సమస్తమూ ఆనందంగా మారిన ప్రకృతిని హాయిగా అనుభూతించడానికి? 

క్షణం విరామమొస్తే చాలు, నువ్వో ఆలోచనల ఆరామంగా మారిపోయి ‘రావి’ చెట్టు కింద మొదలైన చల్లని గాలి లా నను చుట్టేసిన ప్రపంచమైపోతావ్. అప్పుడే కదా అర్ధం అయ్యేది ‘ప్రాణ’వాయువు అంటే మరేం కాదనీ నా వసంతంగా  నువ్వు చిగురించే ‘ఊపిరి' సుమాల పవనవాసమని. 

మనుషుల మధ్య  ఓ కర్పూరపు కాలువ పారటం ఎవరికైనా అనుభవమయ్యిందో లేదో కానీ, నువ్వు మాట్లాడినప్పుడల్లా  అది నా మనసుపై ప్రవహిస్తూ  హేమంతపు ధూపమెయ్యటం నాకెప్పుడూ విస్మయం కాదు. నాకు తెలుసు మరి నువ్వో పరిమళ సాగరానివని. 

నీ నవ్వులు రాలినప్పుడల్లా  చక చకా ఏరుకుంటానా, వాటికేం మాయలు వచ్చో కానీ లోపలెక్కడో వెన్నెలగింతలుగా మనసుని చిలికేస్తుంటాయ్. నీ ప్రతి నవ్వు నిన్ను నాలోనే కట్టిపడేస్తున్న ఒకానొక విడుదల… విడుదల కట్టిపడేయటమేమిటంటే ఏమి చెప్పనూ ఎలా చెప్పనూ? పంజరాన ఉన్న చిలుకకి స్వేచ్ఛ నిచ్చాక  అది నెమ్మదిగా మన భుజం మీదే వాలుతున్న సడి లాంటి విడుదల అని

నువ్వు వెలిగించిన ఒక ప్రభాతాన్ని తెరలు తెరలుగా శ్వాసిస్తున్నప్పుడు, నెమ్మదైన పూల బాటని సున్నితంగా అద్దుకుంటున్న  పాదరక్షలని చూస్తుంటే వాటి గురుత్వం ఒకటి నాకు తెలిపిన అద్భుతమైన పాఠం ఒకటి తెలుసా…  ‘ప్రపంచంలో కొన్ని జంటగానే పనికి వస్తాయనీ… ఒంటిగా వాటి విలువ శూన్యమని.’  మనమే అందుకు ఉదాహరణ కదూ… నువ్వైనా...  నేనైనా… ఒంటిగా శూన్యం. జంటగా  అనంతం.

నీ,

సు'రేష్'

0 comments:

Post a Comment