Saturday, 12 December 2015

నీడఓ అభిజ్ఞా...

ఈ పిలుపేంటి పిలగాడా అని మాత్రం అనుకోకేం.  నీడ నీడతో ఇలాగే మాట్లాడాలి. నిజం చెప్పు! నీకు నా  దగ్గరి తనపు  స్పర్శ  తెలియటం లేదూ.  నీ మనసులో గోరువెచ్చని మమతల్లో దాగున్న నన్ను దూరంగా ఉన్నానంటూ ఆక్షేపించటం నీకు మాత్రమే చెల్లింది. నీకు నాతో జగడాలు ఆడటం ఇష్టమని తెలుసు కానీ ఇన్ని అభాంఢాలా? అన్యాయం కదా. ఒక్కసారి లో లోపల తడుముకుని చూడు. ఆ మనసు పరిమళంలో అదే స్వచ్ఛత అదే సువాసన అదే పరవశం  మరి అది నేను కానా.

నువ్వంటున్నావే విసిరిన మాటలు అని… అవి విసిరిన మాటలు కాదోయ్... అరవిరిసిన హృదయ సుమాలు! కాబట్టే మౌనం కోటి రకాలుగా  మాటలాడుతుంది. నా నిశ్శబ్దపు హోరూ, నీ మౌనాల జోరూ… ఈ రెండూ మనల్ని  ఇంకా ఇంకా దగ్గరే చేస్తాయి కానీ  ఎప్పటికీ దూరాన్ని పెంచలేవులే. నీ ఏకాంతం నీకెలా ఉంటుందనుకున్నావ్ నన్ను ఊహలకి వెళ్లాడదీసాక?

ఎందుకీ విరామాలంటూ వగపులేల? కొన్ని విరామాలు… వరాల ఆరామాలు ! విరామంలో వరమేంటి అంటే ఏమని చెప్పను నేను? సమయం మొత్తాన్ని తలపులకి అల్లేసిన సడిలో మామూలుగా కన్నా ఇంకా దగ్గరైనతనం చెప్పటం లేదూ అదెంత వరమో..!

నువ్వనుకున్నట్లు మౌనమెప్పుడూ అందమైన  గాజు పువ్వు మాత్రమే కాదురా… అది ఘనీభవించిన సజీవ పరిమళం. స్థితి ఏదైతేనేం దాని అలజడి తీరు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది. నీకు తెలియనిది కాదనుకో… అయినా  సరే మరో సారి చదివి చూడు మౌనం రాస్తున్న మనఃప్రతిని. నల్లని నీడలో… రంగు రంగుల వర్ణాలో…  ఎలా అనిపించినా అవి పరిచయించేది  మాత్రం నిన్నుగా రాసుకున్న నా ఊసుల లిపినే.

నీడగా ఉండటం అంటే నిన్ను కాచుకోవటం అన్న మాటేగా… సమయాన్ని బట్టి తగ్గుతూ పెరుగుతూ రూపుని దాటేసిన రక్షా కవచమది. నీ  హృదయ స్పందనలు  వినిపించనంత  దూరం అంటే నాకు తెలిసింది ఒక్కటే… అదే  మరణం.

ఏదేదో ఊహించు కుంటున్నావ్ గానీ నిజంగా నీకు తెలియదా చెప్పు?  నిన్ను తలుచుకుంటే నా గుండె నిండుగా పరిమళించే తొలకరి చినుకు చీల్చే మట్టి వాసన, నీ  పిలుపు వింటే చాలు పిల్లగాలిపై మనసు పడ్డ  పైరులా పరవశం… ఒక్కొక్క అనుభూతీ ఒక్కోలా నిన్ను నాలో నింపేసాక  నాకు నేను అతిధినయ్యానని !

గెలిపించేదీ నువ్వే... ఓడించేది నువ్వే... దిగులు పెట్టించేది నువ్వు… ధైర్యమిచ్చేది నువ్వే… బెదిరించేది నువ్వే... ఆదరించేది నువ్వే...

ఎప్పటికీ నా నీడగా నన్నంటి ఉన్న నా తోడుగా నీకు నేనున్నానని తెలుపుకునే తలపుల తాయిలమిది.

అనుకోకుండా తారసపడ్డా… నిశ్శబ్దంగా చేరువైనా… జత కలసిన అడుగులు ఒకటికి ఒకటి రెండుగా… రెండిటి తపమూ ఒకటిగా...  బంధం అల్లుకుపోయాక జతలంటూ  ఏమీ ఉండవు ఏకమైన మనో శబ్దం తప్ప.

నీ
“తోడూ నీడ”

1 comments:

మీ లేఖలు ఇప్పుడు చదువుతుంటే అనిపిస్తుంది ఎన్నాళ్ళుగా మిస్సయ్యానివన్నీ అని...

Post a Comment