Friday, 11 December 2015

శయనం


హాయ్ బంగారూ

గుండె ఉన్నదే కొట్టుకోవటానికి. కాదంటావా? జీవాన్నే  శాసించే సజీవలోలకం ఒకటి నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది నిన్ను మోస్తూనే అని తెలియటం కంటే జీవితంలో ఆనందపు మొదలు ఎక్కడ ఉంది. తడబాట్లూ, తలపులూ, తపనలూ, పారవశ్యాలూ  అన్నీ అన్నీ కూడా ఆ అనుభూతి తరువాతే. ఆపై అవన్నీ తన సహజాతలే.

నిన్ను తెగ చదివేద్దాం అని నేను అనుకున్నప్పుడల్లా అక్కడ పరావర్తనమైన నేనే కనిపిస్తున్నాను. ఇంతకూ నువ్వు నాకు దర్పణమా? నేను నీకు రూపాన్నా? Feeling Confused 

సవ్వడెంత ఎక్కువైతే సందడంత ఎక్కువేమో కదా? సవ్వడీ  సందడీ ఒక్కరే అయిన చోట మైదానాన్ని సిద్ధం చేసి ఉంచానన్న నిజం నిన్ను దాటిపోయిందా?  కోవెల్లో హారతి ధూపపు పారవశ్యపు బరువులా నా నిండా నువ్వు నిండిపోయిన వాస్తవం నీకు తెలీదూ? నన్ను లోకానికి నిరూపణ చెయ్యాలన్న నీ తాపత్రయంలో  లోలోన  ఎన్ని గుసగుసలో కదా

కోట్ల తారలు వేలాడుతూ ఉన్నాయి కదా అని ఆకాశం ఏమైనా బరువెక్కిందా ఏమి? మన విషయంలోనూ అంతేనోయ్.. అంతులేని తలపుల బరువుతో సహా   నాలో నిండుగా నిన్ను నింపుకున్నాకే నేను తేలికపడ్డానన్న నిజం నీకూ తెలుసుగా.  కొన్ని కొన్ని అంతే లోక విరుద్ధంగా జరిగిపోతుంటాయ్.  

ఒకరికొకరంగా ధ్యానబద్ధులమై ఉన్నచోట దివారాత్రాల అలికిడి చేరని అలౌకితగా మనం కొనసాగుతున్న మౌనవచనంలో అక్షరబద్ధం అయ్యే  ఒకే ఒక్క నిజం మనప్రేమ’ .

తుంటరి ఊసుల థిల్లానాలో వేడుక్కుతున్న వెన్నల రాత్రులకి ఏమి తెలుసు? వేల వేకువలు పొద్దుపొడిచినా ఆ ఊసుల ఊపిరాగదని !  ఒంటరిది కదా అని జాలిపడతాం గానీ ఇద్దరి మధ్య  రాయబారిగా ఆ కృష్ణభగవానుడిని మించిన మాయాజాలంతో   ఈ చిరుగాలి చేసే చమక్కుల చూస్తే తెలుస్తుంది తానెంతటిఅభిజ్ఞయో.

నిదురనద్దుకోనంటున్న రాత్రిళ్ళకి నీ కలలనజరానాఆశ చూపించేసరికినా కనురెప్పలపై ఎంతటి భారమైన ముద్రలేస్తున్నాయో చూడు. అదీ సంగతి... ఇవి కూడా ఇలాతొండిఆటలు మొదలు పెడితే  ఎలాగోయ్ బతకటం?

ఛ...ఛా పాపంలేరా రాత్రుళ్ళది తప్పేం లేదు  ఎన్ని ఒంటరిక్షణాల నిరీక్షణలని నీకర్పించానో బాగా తెలిసిన నీడలు కదా అవి నీ కలల స్మరణలో పునీతమైన నా కళ్ళకి నిన్ను శాశ్వతరూపంగా అందించాలనే సదుద్దేశ్యమేలే
చివరిగా నీకొకటి చెప్పనా
నా అనేకానేక అనుభూతులకి ఒక ఒక్క కారణం నువ్వు.
అనేకానేకంగా నాలోకి ప్రవహించిన నా ఏకైకఅహంనువ్వు.  
నాదెప్పటికీ ఒకే ఒక్క కోరికతీరుస్తూనే ఉంటావ్ కదూ...
నా అధరలాస్యాలపై  అనంత శయనానివై ఊపిరిల్లవూ!

నీ

..

0 comments:

Post a Comment