మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 10 September 2016

లిపి



నన్ను నేను చదువుకుంటున్నప్పుడు
ఆ కాగితాల నిండా
పగిలిన అద్దం ముక్కలే
ఏమి దర్పణాలో ఇవి
అంతా మాయగా...
ఒక్క నాలో
ఎన్ని' నువ్వు'లో
ఒక్కొక్క ముక్కలో ఒక్కోలా

నువ్వున్న ముక్కని చదువుకుందువురా
అర్ధం కాదని భయపడకు
ప్రతిలిపిలో విధిగా
నీకు నచ్చినట్లుగా నిన్ను రాసానులే

నిజాన్ని చదవటం కన్నా
నచ్చింది చదవటమే ఇష్టమైన చోట
రాయబడే అక్షరాలన్నీ
జీవితానికి యమపాశాలేయని తెలిసే వరకూ
నువ్వొక ఉత్తమ చదువరివే మరి

లిపిగా నచ్చకుంటేనేం
కొన్ని సంఘర్షణలు
గుండెని నులిమేసే క్షణాలు
నీపై రాయబడినప్పుడు
నువ్వొక ముగింపులేని భీతుడివే

ఒక కంచెలేని తోటగా
లోకాన్నిమృదువుగా స్పర్శింటం
అనుభూతి కావటానికి
ప్రతి లిపిలో పచ్చని నిజాన్ని చదివి చూడు
ఇకప్రతి లిప్తలో ధైర్యం పతాకమై ఎగస్తుంది

అభయముద్ర



పొగబారి మసకేసిన అస్తిత్వాన్ని
సంస్కరించజాలని బద్ధకపు సమయాల సడిలో
నేటి ఉనికి
చరిత్ర గర్భంలో శైథిల్యమవుతుందే గానీ
ఏ రాతి పుటల శాసనమవ్వదు

నీ సమయాలన్నిటినీ
ఎవరి బందీఖానాలో ఖైదు చేసుకున్నప్పుడు
పంజరమొకటి పరిపూర్ణమై
కరడు గట్టిన శూన్యం స్వేచ్ఛగా
మనసు నిండా విషాద లేఖనమవుతుంది

విషాదమే నిషాదమైన సమయంలో
ఏకాంతపు తర్కమే నికషమై
దుఃఖమాలిన్యాలన్నిటినీ అశ్రువులుగా
తర్పణం వదులుతున్న చోట
మరింత కొత్తగా మొదలవ్వటమంటే
నీకు నువ్వు శతపత్రాల కలువపు సౌందర్యమవ్వటమే

పురాణ పురుషులెవ్వరూ రక్షకి రాని తరుణాన
ఇతిహాస కథలేవీ వాస్తవమవ్వని జీవన గమనాన
నీకు నువ్వే అభయముద్రవన్న నిజంలోకి
నడవటమే నీ జీవన వికాస సూత్రం

Friday, 9 September 2016

ధూప హారతి



నిశ్శబ్దంలో కలుసుకున్న చూపులు
మౌనాన్ని ముచ్చట్లాడుకుంటున్న సవ్వడిలో
చెక్కిలికంటిన సిగ్గు పారాణి
జీవిత కాలపు పండుగలా
పరావర్తనమవుతున్న నేపథ్యంలో
ఏకత్వానుభూతి జేగంటగా మారి
ఒక అనంత గర్వాన్ని శబ్దిస్తుంటే
యుగాల కన్నీరు అవనతమై
పన్నీరే పతాకమై
పరవశాన్ని రెపరెపలాడిస్తున్న వేళ
ఒక ఏకాంతపు దైవత్వపు సమీరం
జగత్తుకి ఒక్క శ్వాసగా మారి
మెరుపెనుక మెరుపుగా
మనపై చుట్టుకోవడమంటే
దివికే ధూప హారతిగా
మనం పరిమళించడమే కదూ...

Wednesday, 7 September 2016

ఎక్కడ దిగి పోవాలి



ఎక్కడ దిగి పోవాలో తెలిసుండాలి
గౌరవపు వీడ్కోలు కావాలంటే
పయనంపై మోహంతో
గమ్యపు కొలత తప్పిందా
కాలమే ఎక్కడో తోసేస్తుంది

సగం రాయబడిన క్షణాలంటూ
ఏమీ లేని సమయాన
సంసిద్ధంగా ఉండాలి అనుక్షణం
కాలం మరో సారి
నిన్ను పలుచన చెయ్యకుండా

నిన్ను నువ్వు రద్దు చేసుకోవటం
నేర్చుకోనంత వరకూ
ఈ పరిమిత గాలి గోళంలో
ఎవరికీ అనుభవమవ్వని మిథ్యాదృశ్యానివై
గిరికీలు కొడుతూనే ఉంటావ్

హేతువుకందని అస్తిత్వాల వెదుకులాటలో
ఆశలకందిన కలలతో  భ్రమల పెనుగులాటలో
ప్రతి నువ్వూ ప్రతి నేనూ
ఒక అవాస్తవికతగా ఘనీభవించటం
చరిత్ర లిఖించని చైతన్య స్వరూపమే

నువ్వొక నిరాపేక్షగా రూపాంతరమైన వేళ
నిర్వ్యాపకపు సమయాలన్నిటికీ
నువ్వే చిరునామా అవ్వటముంది చూశావూ…
బంధాల బంధనాలన్నిటినీ

తెంచుకున్న స్వేఛ్చాతత్వమది

Tuesday, 6 September 2016

ఒంటరి పరదా



ఆశలెన్నో చిక్కుబడిపోయి
నడకలన్నీ బంధనాలై
పాదాలు మౌనం దాల్చిన చోట
కంటికందే గమ్యమొకటి
చేతికి చిక్కక ఒంటరిగా కన్నీరవుతుంది

అమరత్వానికై అర్రులు చాస్తున్న క్షణాల మోహంలో
అనుభవానికొచ్చే నవ్వులన్నీ
విమలం కాదని తెలిసే సరికే
కరిగి పోయిన సాంధ్య వర్ణమంతా
శ్యామిక పాదానికి పారాణిగా మారింది

నిద్రనివ్వాల్సిన రాత్రి
ఎడతెగని కృత్రిమ వెలుగులోకి దూకేస్తూ
తన అస్తిత్వాన్ని కోల్పోయిన చోట
కళ్ళతో కలబడిపోయిన ఆకాశపు నీలమొకటి
కన్నీటి వత్తిడితో మరింత నలుపద్దుకుని
గుండె లోతుల్లోకి దూకినట్లుంది

ఆలోచనలు మృగ్యమైన మనసు
శాశ్వతంగా ఘనీభవించింది
నిన్నటి ఏకాంతాలపై
కొన్ని ఒంటరి పరదాలని కప్పుకుంటూ

Monday, 5 September 2016

ఈసారికిలా



అలలుఅలలుగా
నువ్వు తడిమిన ప్రతి క్షణం
పరాభవించబడ్డ పాత సందిగ్ధాలన్నీ
పురాతనపు పాతరలోకి ప్రవహించేసాయ్

ఓ అరచేతి స్పర్శగానో
వైద్యం తెలిసిన మాటగానో
నీ సవ్వడి మొత్తం మనసుకి తాకుతుంటే
చీకటంతా ఎక్కడికో అశాంతిగా పయనం కట్టింది

నువ్వు పరిచయమయ్యాకే తెలిసింది
గుండెలోనూ కొన్ని కపోతాలు ఉన్నాయని
నన్ను శాంతింపచేసే ఉపశాంతి కోసం అవి
ఎర్రగా తడుస్తూ వేచి ఉన్నాయని

నువ్వూ నేనూ కలివిడిగా
నిలువెత్తు నడకలమై
లోకం దారుల్లో ఓ జీవితాన్ని
ఈసారికిలా లాగించేద్దాం ధైర్యమా…


Sunday, 4 September 2016

చీకటి సమయం



రజిత కాంతి ఉన్నంత వరకూ
నిశి గాఢతపై మనసవ్వని జీవితాన
వెలుగుని చదవాలంటే
చీకటి పుస్తకం తెరవాల్సిందేనన్న నిజం
ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్తేనేం
ఎలాంటి శబ్దాలని స్వీకరించని నాకు
కళ్ళ నిండా భ్రమలే చూపు చేసుకున్నాక
మెరుపుల మోహంలో రెప్ప విప్పితే
జీవితం ఏకవర్ణమవుతుందన్న సంగతి
వ్యక్తమయ్యింది

ఇప్పుడేమో
కోసుకోవటానికి వెన్నెల లేనంత సేపు
నింపాదిగా నడవాలని ఉంది ఒక రాత్రిలో
చీకటి సుమాలని ఆఘ్రాణిస్తూ !!

మరి దేని సమయాలు దానికైతేనే కదా
ప్రకృతి కవిత్వమై పోయి
నన్ను మనిషిగా విస్తరించేసేది

Saturday, 3 September 2016

దీపం



మౌనంతో ముచ్చట్లాడుకుంటూ
కొత్త నిర్వచనాల్లోకి ఒదిగిపోతున్న ప్రతిసారీ
ఒకే పుట్టుకలో అనేక జీవిత స్పర్శలుగా
జీవితం వెనుక జీవితం…
మళ్ళీ మళ్ళీ మరో జీవితం… ఇంకో జీవితం.. కొత్తగా
నన్ను అలజడి లోకి నెడుతుంటే
పునర్జన్మలంటే మరణాంతరపు మార్మికాలు కావని
తప్పు తెలుసుకున్న ప్రతిసారీ
ఒకే జీవగమనపు బాట ప్రక్కన
విరిసే పువ్వులే అవి అని పరిచయిస్తూ
నాకు నేనే దీపంగా కొనసాగాలన్న
అభిలాషని జల్లుగా కురుస్తూ
అలవిమాలిన చీకటిపై
కాంతి పరదాగా నన్ను కప్పేస్తూ
మనసు విశ్వరూపమొకటి అనుభూతిలోకి వస్తూ
చాలా విశ్రాంతిని తెచ్చేసింది