రజిత కాంతి ఉన్నంత వరకూ
నిశి గాఢతపై మనసవ్వని జీవితాన
వెలుగుని చదవాలంటే
చీకటి పుస్తకం తెరవాల్సిందేనన్న నిజం
ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్తేనేం
ఎలాంటి శబ్దాలని స్వీకరించని నాకు
కళ్ళ నిండా భ్రమలే చూపు చేసుకున్నాక
మెరుపుల మోహంలో రెప్ప విప్పితే
జీవితం ఏకవర్ణమవుతుందన్న సంగతి
వ్యక్తమయ్యింది
ఇప్పుడేమో
కోసుకోవటానికి వెన్నెల లేనంత సేపు
నింపాదిగా నడవాలని ఉంది ఒక రాత్రిలో
చీకటి సుమాలని ఆఘ్రాణిస్తూ !!
మరి దేని సమయాలు దానికైతేనే కదా
ప్రకృతి కవిత్వమై పోయి
నన్ను మనిషిగా విస్తరించేసేది







0 comments:
Post a Comment