అమావాస్య చీకటంటే చిరాకు పడటంలో
అర్థం ఉందనుకుంటున్నావు నువ్వు
చీకట్లో చిగురేసిన నెలవంక
నిండు చంద్రుడై వెన్నెల కురుస్తున్న
రాత్రిలోకి నడచి చూడు
చీకటి సిగ ఉంటేనే
జాబిల్లి పువ్వు విరుస్తుందన్న
వివేకమొకటి మదిని తాకుతుంది
పువ్వెనుక ముళ్ళుని చూసి
సంకోచిస్తున్నావు నువ్వు
ముల్లు గుచ్చుకున్నప్పుడు నొప్పనిపిస్తేనేం
గులాబీ చేతికి అందిన అనుభూతికై
ఎన్ని ముళ్ళ గాయాలనైనా
ఆస్వాదించవచ్చనుకోవటం లేదూ
జీవితాన్నీ అలానే చూద్దాం రా
కష్టమొకటి తాకకపోతే
జీవితానికి విలువ కట్టుకోవటం ఎంత కష్టమో
తరచి చూడు నువ్వు దాటిన ప్రతి బాటనీ
కష్టాన్ని చిలికితే వచ్చిన సుఖం
ఇచ్చే ఆనందమెంత అందమో కదా

















