మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Monday, 26 December 2016

ఆనందం



విడగొట్టబడ్డామని తెలీదనుకుంటా
అక్కడ ఉంటేనే జీవితమని
ఆ పువ్వులు మొక్కని వెదుక్కుంటున్నాయి
***
వాడిపోతామని తెలుసనుకుంటా
పరిమళాన్ని శాశ్వతం చేద్దామని
ఆ పువ్వులు తలలు తెగ్గోసుకుంటున్నాయి
***
ఒకటి హత్య
మరొక్కటి అర్పణ
తేడా


‘ఆనందం’

Saturday, 24 December 2016

దివ్యత్వం

అరుదుగా వస్తుంటుందో క్షణం
అడవి గాలి మీదుగానో
సముద్రపు తేమ మీదుగానో
ఇప్పుడెక్కడా పరిచయమవ్వని
ఇంకా చిత్రించబడని అలలపై తేలియాడుతూ
ఒక మహా నిశ్శబ్దాన్ని దాటుకుంటూ
చిన్న చిన్న గొంతుకల్ని పట్టి తెస్తూ
చెదిరిపోతున్న మట్టి తునకలపై మందుపూతలా
రంగునద్దుకున్న నీటి బిందువులకి వడకట్టు మంత్రంలా
గాలి రెక్కలలో ఒదిగిన కలుషితాన్నిఆవిరి చేసే తెమ్మెరలా
అవిశ్రాంతపు కాంతిస్రావాన్ని అడ్డుకుంటున్న శ్యామికలా
తన సవ్వడిని మెల్ల మెల్లగా స్థిమితపరుస్తూ
సీతాకోకచిలుక రెక్కల స్పర్శలోని స్వేచ్ఛని
మళ్ళీ నాకు పరిచయిస్తూ
మృదువుగా మనసుని తాకుతుందా క్షణం
నా కాలానికీ ఓ అందమైన విలువ కడుతూ
ఆ క్షణం చుట్టూతా
దివ్యత్వమై నా ‘తను’

రెప్పల్లో రహస్యంగా...!


నువ్వంతేరా ! రెప్పల్లో రహస్యంగా కొన్ని నవ్వులుంచి వెళ్లిపోతావ్. అదేమంటే పెదవులకి మోమాటమెక్కువై తమ నవ్వుల స్వచ్చతని పలుచన చేసుకుంటూ ఉంటాయ్ అందుకే నవ్వులెప్పుడూ కళ్ళల్లోకి నడిస్తేనే బహు స్వచ్చం అంటావ్. సవ్వడి చెయ్యకుండా సందడి చెయ్యటం వాటికే బాగా తెలుసు అంటావ్.
ఇంతకీ నువ్వెళ్ళిపోయాక కళ్ళు ఈ నవ్వులని ఎలా దాపెట్టుకుంటున్నాయో అర్థం కావటం లేదు రా అంటే… ఏమన్నావ్? నిన్ను నువ్వొక్క సారి వచనం చేసి చదువుకోవోయ్ అని కదూ. అప్పుడేగా మరి తెలిసింది నువ్వు వెళ్ళింది ఎక్కడికో కాదనీ... ప్రతి కణానికీ ఓ నవ్వును రాస్తూ, ప్రతి అణువుపై ఆనందపు అనుభూతిని అనువదిస్తూ… ప్రేమసారివై నాలోనే నిత్య సంచారం చేస్తున్నావని. అసలు నువ్వన్నట్లుగా లోలోన లోకం ఎంత విస్తరించినా ఇరుకవ్వని పుష్పకాలు కదా కళ్ళు.

ఎక్కడెక్కడో రాయబడ్డ కలలన్నీ రంగుల దృశ్యాలై అప్పుడప్పుడూ అదాటుగా దిగంతాలనీ తమలో చప్పుడు చేస్తుంటే రెప్పల పరదాలు కప్పేసి, నేను చేజిక్కించుకోవాల్సిన రేపటిని మనసుకు అవగతమయ్యేలా వడకడుతూ ఒక గమ్యాన్ని నేను రాసుకునేలా కొట్టుకలాడతాయి చూడూ… అప్పుడు తెలుస్తుంది… కళ్ళూ ప్రాణ నేస్తాలనీ.
‘తెరిచినప్పుడు చూపు మేరానే తమ దృశ్య విస్తీర్ణం. అదే మూసి చూస్తే బ్రహ్మాండపు విస్తీర్ణమూ ఆ రెండంగుళాల జాగాలోనే ఆటస్థలమవుతుంది కదోయ్. మరి అక్కడ ఉంచిన నవ్వులని ఆ బ్రహ్మాండానికే అంటుకట్టెయ్యవోయ్...లోకం నవ్వటం నేర్చుకుంటుంది ’ అంటూ లోపల నుండి అల్లరి చేస్తూ నువ్వంటున్న మాటలు ఒక జీవితమంత శబ్దం చేస్తున్నాయ్.
ఇప్పుడైతే నేను నేర్చుకున్న పాఠం ఏమిటో చెప్పనా?

కళ్ళంటే...
"మూసినప్పుడు చీకటినీ... తెరిచినప్పుడు వేకువనీ... వెలిగించే జంట దీపాలని"

Friday, 23 December 2016

నివేదన



కరడు గట్టిన కాఠిన్యం వెనక
గుండె చెమరింపుల
తడి స్పర్శ తడిమేదేవరని
పొడిబారిన చర్మం చాటున
కరిగిన కండల
లెక్కలు ఎవరికి అవసరమని
పరిష్కరింపబడని
బతుకు గణితంలోకి జారిపోయి
రుద్రంలో మగ్గిన మనసుపై
యుద్ధమొక ఆయుధమైన ప్రతీకారం
కుబుసమంటి ఛాయగా కప్పబడే ఉన్న చోట
నాకు నేను ప్రత్యర్థిని అని తెలుసుకున్నాక
నన్ను నేను ఓడించుకోవడమే
జీవిత గమ్యంగా రాసుకున్నాక
గెలుపు దారి కళ్ళబడింది

ప్రాణరూపమైన పాశంతో
నన్ను వశం చేసుకోవచ్చిన
అడవి ఒకటి
ఆత్రంగా నన్ను కమ్ముకుపోతుంది
ఒక పచ్చ పూల చెట్టుగా నన్ను వసంతిస్తూ
నిన్నటి యుద్ధాన్ని ప్రకృతిగా దహనం చేస్తూ

మరిప్పుడు నాలో నాకు దొరికిన
అవ్యక్తమైన తత్త్వమొకటి
ఆనందపు విలువని చెప్పింది
జీవితానికి మకుటమేదో తెలిసేలా
ఒక మనఃకృతిని అంతరాత్మకి నివేదిస్తూ

ప్రవాహం


అంత వరకూ విశిష్ట సాన్నిధ్యాన్ని
ప్రతి ధ్వనించిన కాల తరువులో
పత్తికాయలా చిట్లినట్లున్న ఓ కరుకైన క్షణాన
అర్థ సహితమైన అస్తిత్వాల జ్వలనాలలో
ఎండి పోయిన మౌన జ్ఞానపు పరిమళానికి
ఎడారి సమీరపు ఛాయలా తోడవుతుందో ఒంటరి తనం
ఏకాంతంలా భ్రమ పెడుతూ

కళ్ళనే ఆవాసం చేసుకున్న నీటి పాయలోనే
ముఖాన్ని వెచ్చగా తడుపుకుంటున్న వేళ
పొందికైన నవ్వుల్లో ఇమడలేని జీవితాన్ని చూసి
మనసంతా వర్షంగా మారిపోయిన చోట
హృదయం నెమ్మదిగా
రాయిగా రూపు మార్చుకుంటుంది

మనుగడ మృగ్యమైన పంచభూతరూపాన్నై
ఒక శూన్యాన్ని మది గోడలపైన చిత్రించుకున్నాక
తేమని రాయని వచనంగా మారిపోయిన కళ్ళకి
తామరాకే కొత్త జ్ఞానాన్నిచ్చిన గురువయ్యింది
తనపై రాలిన నీటి బొట్టుతో తన బంధమెంతో చూపిస్తూ

ఇప్పుడొక నదీ ప్రవాహం...
నాలోనుండి ప్రవహించే తడినీ… పొడినీ
జీవితానికి ఆచమనం చేస్తూ


Tuesday, 13 December 2016

విశ్వ మోహనం

అంతర్వ్యాప్తమైన పవిత్ర ఏకాంతంలో
పూర్ణ దివ్య చేతనపు కలగలుపులో
అవ్యక్తమైన నిశ్శబ్దపు స్వరమేళన
ఒక్క మౌనం కరిగేంత
తృష్ణావర్షాన్నిపల్లవిస్తున్నప్పుడు
గడ్డకట్టిన మంచుముద్దలో
విద్యుత్తొక్కటి అంతర్లీనమై
నా ఊపిరి గతులన్నీ శిల్పిత్వమై
నిన్ను రూపించుకుంటున్న సవ్వడి
అనంత ప్రణయ నాదమై ప్రజ్వరిల్లుతుంది

చినిగిన మొగలి రేకుపై రాసుకున్న పరిమళపత్రం
స్థానభ్రంశాన్ని పొంది గాలి రేణువులపై చల్లని కావ్యంలా
అసంకల్పితంగా ఊపిరద్దుకున్న వర్షఋతువై
నులి వెచ్చని శ్వాసల తొలకరి తాకిడితో
కుంకుమద్దుకున్న చెక్కిళ్ళ పరికంపన
నిరంతరం రసరూపించే సౌదామినిల థిల్లానాగా
నన్నొక నిషాపత్రంపై ఒలికిస్తున్న తన్మయత్యం
మృషా కాదని నన్ను ఆవరించిన నీ అలికిడే చెబుతుంది

నీ అడుగుల సవ్వడితో మొదలైన వాయులీనాల రాచరికంలో
నేనొక మకుటధారిగా నిర్వచనమవుతున్న సార్వభౌమత్వమంతా
ఇప్పుడిలా కలగలసిన మన ఏక శ్వాసకు పాదాక్రాంతమై
నైసర్గిక వాసంతపు రహస్యమైంది విశ్వమోహనాన్నిశిల్పించుతూ


స్పర్శ

శూన్యాన్ని తాగిన ఆకాశం
మత్తుగా నిదరోతున్నట్లుంది
చుక్కల్ని లోకం మీదకి వదిలేసి

రావి ఆకుపై పరుచుకున్న
వసంతపు పరిమళం
ప్రకృతిని మెత్తగా తడుముతుంది

వాన చినుకుల్లాంటి రంగులలో
దాగిన నిశ్శబ్ద వర్ణమొకటి
నాలో ప్రతి ధ్వనిస్తుంది నీలా

అప్పుడప్పుడూ
అవిశ్రాంతపు ప్రశాంతత కూడా
తెలియని ఉన్మత్తాన్ని రేపుతుందనుకుంటా

ప్రాణస్పర్శవైన నిన్ను కంటకాల బాటకి నెట్టేస్తూ
ఒక అలజడిని వడివడిగా ఆహ్వానించుకుంటూ
మృత్యుస్పర్శని కావలించుకుంటున్నా


Monday, 12 December 2016

సందిగ్ధం

కాటుకని పెనవేసుకున్న కంటకపు రాత్రిలో
కంటి చివర వేలాడుతుందో సందిగ్ధం
ఏకాంతానికీ ఒంటరితనానికీ మధ్య
పొడిబారిన క్షణమై
పోకచెక్కలా వేళ్ళాడుతూ

అప్పుడే వస్తావు నువ్వు
కొన్ని మేఘాల్ని నాకోసమే వర్షించేలా తోలుకొస్తూ
ఇంకాసిని కాంతి చుక్కలని జల్లుకుంటూ
నీ ఏకాంతపు తోటలో
నన్నొక చల్లగాలిగా పండిస్తూ

నువ్వంటూ వచ్చేశాక
నిన్నటి సోమరి మబ్బులనిండా
ఎంతటి చురుకుదనం పెనవేసుకుని ఉందో తెలిసింది
నీ సామీప్యమే ఉత్ప్రేరకమైన అహంలో
లోలోని మేలిమితనమంతా
వెల్లువెత్తటం సహజాతిసహజలక్షణమని
కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు

నిన్ను తెలుసుకున్న ప్రతి హృదయానికీ
చేరువగా కదలాడే నిత్య సత్యమది