Wednesday, 19 April 2017
అవ్యక్తపు కొలత
Wednesday, 5 April 2017
నరకానికి వేళయ్యింది
Friday, 31 March 2017
ఆకు దాచిన చినుకు
నాకు తెలుసు నువ్వు అలసిపోయావని
ఇప్పుడు ఇదే మార్గం
రా మరి…
ఒక నిశ్శబ్దం ఆక్రమించుకున్న ఈ తోటలో
ఆత్మైక్యమై సేద తీర
ఏటి కడుపులో దాగున్న పాటలాఒక మౌనపు అలజడిని హత్తుకుంటూ
నిశ్శబ్దపు లోతుల్లో శ్వాస తీసుకుంటూ
చెప్పలేని భావాలకు ఆకారం ఇస్తూ
అతి దగ్గరగా నిలిచిన క్షణం ఇదని
మాటలకంటే ముందే మనసును గుర్తిస్తూ
దాచుకోలేనంత దగ్గరితనముందిక్కడ
ఏకాంతపు వ్యాకరణాన్ని
కంటి మెరుపులుగా రాయగలిగే
హృదయ లేఖినీ ఉంది
వెలుతురుని తాగిన చెట్టు కొమ్మపై
ఆకు దొన్నెలా మారి దాచుకున్న
ఒక గోరు వెచ్చని చినుకులో
లేచివురాకు మెత్తని వెన్నెల కాంతి
ప్రతిఫలిస్తున్న తేజస్సు మీదుగా
గాలి రాసుకొస్తుందే ఒక చిరు పరవశం
తన దారినే మరిచిపోయినట్టుగా
నిన్ను తాకుతూ కరిగిపోతుంది
ఆకాశపు అందాన్ని
నీలంగా తాగేస్తున్న సంద్రపు అంశలా
ఒక పువ్వు నుండి నీలోకి
నిశ్శబ్దంగా ప్రవహించే అనుభూతి ఉందే
హృదయాన్ని తాకడం దానికి తెలుసు
దివారాత్రాల ప్రతి స్వరమూ
నీ ఊపిరి స్పర్శకై విరహపడుతున్న
ప్రణయస్వామ్యంలో
రెక్కలు విప్పుకుంటూ ఎగిరిపోతుందీ అలసట
కంటి రెప్పలకి తేనె చెమరింతలని పరిచయిస్తూ
Thursday, 30 March 2017
మరీచిక
Tuesday, 28 March 2017
భృత్యుడు
మరణం ఎప్పుడో
రాయబడి ఉన్న పాత శాసనం.
పుట్టిన క్షణం నుంచే నా గడప ప్రక్కన నిలబడి,
నా శ్వాసల తాళపత్రాలని లెక్కపెడుతూ నడిచే
ఒక నిశ్శబ్ద సహచరి అయి ఉంటుందేమో.
లోపల ఎక్కడో
మరణం ముందుగానే అంగీకరించిన
ఒక నెమ్మదైన వెలుగేదో దాగి ఉన్నట్లుంది
ఏ విపత్తులూ
మనసుని
నిజంగా
బంధించలేకుండా ఉన్నాయి
రానీ
మృత్యువుని
నేనెరుగని
మృత్యువా తను
తొలి శ్వాస నుండీ నాతోనడుస్తున్న ఏకైక నేస్తం తాను
తనకు
తెలిసిందల్లా దేహాన్ని మౌనంలోకి నెట్టడమే
అవును...దాన్ని
మాత్రమేగొని పోగలదు తను
అయితే మనసుని?
కాలాన్ని?
నన్ను నేను తెలుసుకుంటున్నంత సేపూ
తను ఏలా తాకగలడు?
ఆ లోకానికి చేరే
దారి తనకు తెలియదు
చేరినా అక్కడ తను నా భృత్యుడు మాత్రమే
నిజం…
అసలైన నడక
తెలిసాకే అర్థమవుతుంది
ఆనందమంటే పది
క్షణాలు పెదవులపై మెరిసే నవ్వు కాదు
అది మన లోపల
వెలిగే నిగర్వ స్వభావం.
విజయం అనేది
శ్రమకి దూరంగా దొరికే కిరీటం కాదు
చెమటను సారం
చేసుకున్న ప్రయాణం.
మృత్యువంటే
దేహం నిర్జీవమైన చావు కాదు
ప్రకృతికి
తిరిగి అర్పణ అయ్యే స్వేఛ్చా ఏలిక
ఈ తత్త్వం
గ్రహించిన జీవితం
జరామరణాల గడియారాన్ని
దాటేసి
గుండె నిండా
నవ్వుని నింపుకుంటుంది
అప్పుడు
కాలమే
నన్ను తన అక్షరాలతో రాయడం మొదలుపెడుతుంది.
Wednesday, 22 March 2017
యంత్రుడివే !
Tuesday, 21 March 2017
Sunday, 1 January 2017
చీకటి
ఓ చీకటీ !
నీవు నా నేస్తానివి. నిత్యం నా చుట్టూ ఆవరించుకోవాలనే నీ తపన ఉంది చూశావూ… ఓహ్! ఎంత ముద్దుగొలుపుతుందో తెలుసా అది. నిజం నువ్వు నా చుట్టూ పరుచుకున్నప్పుడే నిన్ను ఛేదించుకోవాలనే కోరికలో నాకు నేను చేరువవ్వటం మొదలవుతుంది. ఆ చేరికలోనే ఒక వెలుగు కిరణం ప్రభవిస్తుంది. ఎప్పుడైనా ఒకటి గమనించావా… నీలోకి చేరగానే అంధకారమయమే అనిపిస్తుంది… కాస్తంత అలవాటు పడ్డామా ఒక్కొక్కటిగా ప్రతిదీ కనులకి విపులంగా విశదమవుతుంది.
ఏదో అనుకుంటాం కానీ వెలుగు చుట్టూ కప్పబడే కవచమై నువ్వున్నప్పుడే దానికి మరింత రాణింపు. ఆ నిజం తెలిసిన ఎవరికైనా నువ్వు నేస్తానివే. మనసులో చీకటి లేని మనిషంటూ ఒక్కరైనా ఉంటారా? కష్టం కదూ. ఎంతటి ఉన్నత వ్యక్తిత్వానికైనా రెండవ పార్శ్వంగా ఉండటం అన్నది సహజాతి సహజం. నిజం పగటికి రేయి, సుఖానికి కష్టం, వెలుగుకి చీకటి మరో పార్శ్వంగా లేకపోతే ఈ లోకం ఎన్నటికీ నచ్చదు కూడా.
నీవు కేవలం రాత్రి పొర మాత్రమే కాదు, మౌనాన్ని మాలగా ధరించిన మాతృమూర్తివి కూడా. నీ ఒడిలో చేరినప్పుడే కదా... ఈ లోకం సృష్టించే శబ్దాలన్నీ నెమ్మదించి, నా హృదయ స్పందన నాకు స్పష్టంగా వినిపించేదీ, నా ఆలోచనల అల్లరి కాస్తంత అణిగి, సమాధానాల రూపం దాల్చడం మొదలయ్యేదీ. ఆధ్యాత్మిక అన్వేషణలో ప్రతి ప్రయాణీకుడు ముందుగా దాటవలసిన రహస్యం నువ్వే.
నీవు లేకపోతే స్వప్నాలకి రూపమెక్కడిది? నీ ముఖమల్ తెరల వెనుకే కదా... నిన్నటి జ్ఞాపకాలు, రేపటి ఆశలు రంగుల ప్రపంచాన్ని సృష్టించుకునేది. కనులు మూసుకుంటే చాలు, నువ్వు నా అంతరంగమంతా ఆకాశంలా విస్తరించి, నా ఊహల విహంగానికి ఇంధనమవుతావు. పగటి వెలుగులో దాచిన ప్రతి నిజమూ, నీ సమక్షంలో నా ఏకాంతంలో నివురు రాల్చుకుని నిప్పులుగక్కుతుంది.
ఒక సంగతి చెప్పనా…
ఆరుబయట మంచం మీద వెల్లకిలా పడుకుని నక్షత్రాలు లెక్కబెట్టుకునే పసితనంలో ఏమో గానీ, ఇప్పుడు వాటిని అలా చూస్తుంటే అర్ధమయ్యేది ఒకటే… ఎంతోటి నక్షత్రం చుట్టూ అయినా నిశి పరుచుకునే ఉంటుందని, ఆ నిశి ఉండబట్టే వేల కోట్ల కాంతి దూరాలలో ఉన్న నక్షత్రాలూ నా ఈ కన్నులకి కన్పిస్తున్నాయని.
మరి నిశీ నువ్వూ వేరు వేరు కాదుగా…
అందుకే, వెలుగును తాకడానికి ఎంతటి ధైర్యం అవసరమో, నిన్ను కౌగలించుకోవడానికి అంతే విశ్వాసం కావాలి. నువ్వు ఆశ్రయం కల్పించేంత విలువ పొందాలీ అంటే నన్ను నేను పూర్తిగా నీకు అర్పించు కోవాలి. నన్ను నేను శూన్యం చేసుకునే చోటూ... నన్ను నేను నింపుకునే చోటూ నువ్వే. మరి అంతే కదా! శూన్యం నుండే కదా ప్రతి సృష్టి మొదలయ్యేది! నిన్ను తిరస్కరించేవారు వెలుగు విలువను మాత్రమే చూస్తారు కానీ, దాని పుట్టుకకు మూలమైన నిన్నూ, నీ నిశ్శబ్దాన్ని, నీ ఏకాంతాన్ని గుర్తించలేరు.
నేల గర్భంలో విత్తనానికి, అమ్మ గర్భంలో శిశువుకీ మొదటి నేస్తానివి నువ్వే... అంటే నా మొదటి నేస్తానివి నువ్వే. నాకు మాత్రమేనా... ప్రతి ఒక్కరికీ అంతేగా! కన్నులకు కనిపించని నీవు, కనిపించే ప్రతిదానికీ ఆధారంగా ఉన్నావు. పగలు పరుగులో మరచిపోయిన ఓర్పును... ఓదార్పునూ, రాత్రి వేళ నీవు తిరిగి నేర్పుతావు. గాఢాంధకారాన్ని అనుభవించిన తరువాతే కదా, ఉషోదయం వర్ణరంజితమై మధురంగా ఆహ్వానం పలుకుతుంది. నీవు పుటం వంటిదానివి. నిన్ను దాటిన ఆత్మ మాత్రమే నిజమైన మెరుపుతో ప్రకాశించగలదు. నిన్ను రాస్తూ ఉంటే కలానికీ, కాలానికి అలుపు రాదు... కాగితానికి చివరెక్కడో చిక్కదు.
ఏదైతేనేం ఈ జీవితం నీ గురించి నాకు నేర్పిన పాఠం ఒక్క వాక్యంలో చెప్పనా
‘చీకటంటే మరేమీ లేదు చిక్కగా కమ్ముకునే నల్లని వెలుగే'


















