లోలోపల నిర్మితమవుతూ వస్తున్న
ఆకాంక్షలన్నీ చిరస్మరణీయాలై
అలలు అలలుగా దేహపు అంచులను
అలా అలా తడుముతున్నంతసేపూ
దేహమే నా విలువకి గుణింతమని
విర్రవీగిన అహానికి సింహాసనమేసుకుంటూ
నాలోనే నేనింకా మిగిలి ఉన్నాననుకుంటున్న
ఒక అందమైన అబద్ధపు కథనే ఈ ‘నేను'
దేహమంటే మాంసఖండాల అమరిక అని
వర్ణాన్ని నిర్దేశించే చర్మమంటే
దానిపై కప్పిన తోలు అట్ట అని
ఆత్మ వసించినంతసేపు దేహం ఆత్మాలయం
తాను వదిలేశాక
ఈ గేహం ఒక శిథిలాలయం అన్న యథార్థవాదాన్ని
యథేచ్చగా దునుమాడిందీ ఈ ‘నేనే'
‘నేను’ని దేహానికి పరిమితం చేసుకున్న
అహంకారపు బాటలో నా యదార్థ అస్తిత్వాన్ని
అబద్ధంగా చదువుకున్న అంతేవాసిత్వాన్ని దాటేసాక
దేహాల దారుల్లో తప్పిపోయిన జీవితానికి
దప్పిక తీర్చే చలివేంద్రమేదో తెలిసే సరికే
మట్టి పుస్తకంలో శిథిలపుటగా
కర్బన రూపాన్నద్దుకునే భవిష్యత్తరపు
ఇంధనపు అస్తిత్వమే నేనని తెలుసుకున్న
యధార్థయానంలో రాసుకున్నాను
దేహం ఈ ‘నేను’ కి అశాశ్వత కేంద్రకమని
కాయానికి మోక్ష జాలమేసిన
ఆత్మవచనమే నేనని చెప్పడానికి
కాలం కథలో ఈ 'నేను'కి
చివరి అంకం రాయడానికి
లిపికారుడై మరో ‘నేను’ మొదలవ్వాల్సిందే