Monday, 8 May 2017

మన రాతలకి మనమే...

మనమొక వార్తగా మారాలంటే ఈ రోజు ప్రధానవార్తని మన హస్తగతం చేసుకోవాలి. అభినందనో… విమర్శో అతి తీవ్రంగా ఉండాలి. అది వ్యక్తిత్వ సరిహద్దుల్ని దాటిపోవాలి.

ఇదే కదా నేటి సమాజ పోకడ.

ఈ సమాజంలో భాగస్వాములుగా ప్రతి విషయం మీద ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉండాలి. మన అభిప్రాయాలని మనం వెలిబుచ్చే హక్కు మనకు ఉంది. అవును నిజమే. మనకి హక్కులున్నాయ్. ఉండాలి కూడా. మన రాతలకి మనమే సంపాదకులం . అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే లేనిపోని అసమానతలకి దారి తీసిన వారిమే అవుతాం. ఉన్న సమస్యలకి తో కొత్త సమస్యలు సృష్టించిన వారిమే అవుతాం.

నేటి తాజా వార్త కోసం  లేని కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నట్లుగా కొందరు… వాటిని పీకటానికి సిద్ధంగా మరికొందరు.  అందుకోసం ప్రపంచంలోని ప్రతి సమస్య మీద మనకు  సంపూర్ణ అవగాహన ఉన్నట్లుగానే నటించేస్తూ ఉండాలి. లేదంటే మన మేథావితనం పలచబడిపోతుంది.

నిజానికి ప్రతి  వార్తాసంస్థ నుండి వచ్చేది  ఏదో ఒక పక్షం తీసుకుని వండి వార్చే వార్తలే… వాళ్ళ దృక్కోణం నుండి వాళ్ళు చేసే వాఖ్యానాలే మనం రాసే చాలా రాతలకి ఇన్ పుట్స్. సౌర్స్ లోనే లేని నిజాయితీ,  వాటి మీద   మనమెంత నిజాయితీగా మన వ్యాఖ్యానం సిద్ధం చేసినా విలువ సంతరించుకుంటుందా?  

సమర్ధింపో… విమర్శో విషయమేదైనా సరే ఆవు వ్యాసంలా..;  ఆ విషయంలోకి మనకి నచ్చిన వాడినో/ నచ్చని వాడినో తీసుకుని రావాల్సిందే. లేదంటే చెప్పాలనుకున్నది సరిగ్గా పండినట్లుగా అనిపించదు.

పనిగట్టుకుని చేసే పొగడ్త అయినా విమర్శ అయినా అది మనకి తెలియకుండానే యథార్థవాదానికి చాలా దూరంగా జరిగిపోతూ ఉంటుంది. మనుషుల్ని వ్యక్తిగత పొరపొచ్చాల వైపు నడపటం తప్ప వీటి వలన ఉపయోగం ఏమీ ఉండదు. నిజానికి ఏ విషయం పైన అయినా సమీక్ష జరగాలి. ఆ సమీక్ష లోనే ఆ విషయంలోని బలాలు, బలహీనతలు చెప్పబడాలి. అప్పుడే పొగడ్త… విమర్శ రెండూ ఒకే చోట ఇమిడి ఒక ఆరోగ్యవంతమైన చర్చకు దారితీస్తుంది. లేదంటే మనకి తెలియకుండానే (తెలిసి కూడాను) కొత్త వివాదాలకి దారి తీస్తుంది.

మనసులో నమ్మక పోయినా, మనకి ఇష్టం లేని వాడు చెప్పేవన్నీ పస లేని వని, మనకిష్టమైన వారు చెప్పేవన్నీ చాలా చక్కనివని ఒక ప్రచారంలోకి దిగిపోతున్నాం.  మనం నమ్మినదాన్ని నమ్మని వాడిని మనకి అయిష్టుడిగా, సమర్ధించిన వాడిని ఆప్తుడిగా మార్చుకుంటున్నాం.

బాధాకరమైన విషయం ఏమిటంటే…

ఇలాంటి వాటికే ఒక అనుచరగణం తయారవుతుంది. చాలా చోట్ల ఏ విషయంలోనూ లోతుపాతులు అసలు తెలియకుండానే ఏదో ఒక పక్షం లో చేరిపోయి అప్పుడప్పుడే రాజుకుంటున్న నిప్పును మరింత ఎగదోస్తూ ఉంటారు.  ఎవరి పక్షం ఎవరో తేల్చేది కులమో, మతమో, ప్రాంతమో, వర్గమో… మనం నమ్మే రాజకీయ పక్షమో తప్ప మనం నమ్మే సిద్ధాంత భావజాలం కాదు.

ఇన్నాళ్ళుగా నేర్చుకున్న విజ్ఞానమంతా పక్కకుపోయి, అప్రధానమైన  విషయాలకోసం ఒక రణరంగాన్నే సిద్ధం చేసుకుంటున్నాం. పిచ్చి పిచ్చి విషయాల మీద మనం చేసుకునే వాగ్యుద్ధంలో మనం కోల్పోయేది మాత్రం మనమంటూ మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేని విలువ కట్టలేని సమయమే.

సిద్ధాంత వైరుధ్యాల మీద చర్చ జరగాలి కానీ వ్యక్తిగత లోపాల మీద కాదు. ఎప్పుడైతే చర్చ వ్యక్తిగతమవుతుందో, రెండు సిద్ధాంత వైరుధ్యాల  గురించిన్ చర్చలో బయటకి వచ్చే ఎన్నో అమూల్యమైన వ్యక్తీకరణలు మృగ్యమవుతాయ్.


చివరకి చూసుకుంటే వ్యక్తిగత వైషమ్యాలు కొనసాగుతూ ఉంటాయ్. కొనసాగుతూనే ఉంటాయ్.


1 comments:

నలుగురికీ వినబడాలని మనసుని దాటి మాట్లాడే వారెందరో. సోషల్ మీడియా పుణ్యమా(?) అని ఇంకా దగ్గరగా ఇవన్నీ చూడగలుగుతున్నాం. బుర్రనీ గుండెనీ పక్కనబెట్టేసి ఏదో ఓ పక్షంలో చేరిపోవాలి లేదా మీరన్నట్లు వేస్ట్ అయిన టైమ్ తప్ప ఏమీమిగలదు. సమగ్రంగా విశ్లేషించారు అన్ని వైపుల నుండీ.

Post a Comment