Friday, 25 July 2014

మహారాజశ్రీ పాలకుల్లారా...

మహారాజశ్రీ పాలకుల్లారా...
అంతా క్షేమమే కదా... ఏదో అడగాలని అడుగుతున్నాం కానీ మీరెప్పుడూ క్షేమమే లెండి... మాలాంటి అభాగ్యులే క్షణ క్షణం బతుకుతో పోరాటం చేస్తూ మిమ్మల్ని అందలాలు ఎక్కిస్తూ మాకు ఏదైనా అవసరం వస్తే మీ గుమ్మం దగ్గర కాపాలా కుక్కల్లా పడిగాపులు కాస్తూ మీ దయగల చూపులు మా దరిద్రజీవితాల మీద ఎప్పుడు ప్రసరిస్తాయా అని ఎదురు చూసే అభాగ్యులం.
అయినా ఇప్పుడా గొడవంతా ఎందుకులే గానీ అసలు విషయం లోకి వస్తున్నా...
పాపం ముక్కుపచ్చలారని చిన్నారులు కేరింతలు కొడుతూ బడికి వెళుతుంటే వాళ్లకి బతుకు గేటు మూసేసి చావు పల్లకీ ఎక్కించిన పుణ్యాత్ములు కదూ మీరు? పాప పంకిలమైన ఈ లోకంలో అభం శుభం తెలియని చిన్నారులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని వాళ్ళని త్వరగా స్వర్గలోక వాకిళ్ళలో నిలిపిన ఘనులు మీరు.
కాపలా లేని క్రాసింగ్ అనేది రైల్వే వాళ్ళ తప్పు అని రాష్ట్ర పాలకులు... మేము కూత బాగా పెట్టుకుంటూ వస్తున్నాం ఆ బస్సు డ్రైవర్దే తప్పు అని కేంద్ర రైల్వేమాత్యులు... రోజూ వచ్చే డ్రైవరూ కాదూ రోజూ వెళ్ళే దారీ కాదు అని ఇంకొకరు... ఇలా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు నెపం వేసేస్తుంటే ఒక దారుణానికి ఇన్ని నిజాలు ఇన్ని ఇజాలు ఉంటాయా అని నిర్ఘాంత పోవటం మాలాంటి సామాన్యుల వంతు అయింది. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి సమస్యలోనూ అంతే.
మాలాంటి సామాన్యులు మసిలే పల్లెల్లో వాడల్లో ఉండే సమస్యలు కూడా మాలాగే అతి సామాన్యమైనవే... కానీ ఈ మాత్రం సామాన్యమైన సమస్యలు తీర్చే నాథుడు కూడా లేక చిన్న చిన్న సమస్యలే దీర్ఘకాలంలో అతిపెద్ద సమస్యలుగా మమ్మల్ని కబళించే పాలిత ప్రాంతాల్లో వసిస్తున్నాం మేము.  
చెప్పుకోవటానికి ప్రజాస్వామ్యమే... మా గల్లీల్లో తిరిగే వార్డు మెంబరు నుండి మీ ఢిల్లీ లో తిరిగే కేంద్రమంత్రుల వరకూ స్థాయీ భేదాలు వేరేమో కానీ మనస్తత్వాలు మాత్రం ఒక్కటే. కుర్చీలో కూర్చున్నంత కాలం మనమెలా బాగుబడదాం అని చూసుకోవటమే కానీ మనం సేవకులుగా చెప్పుకుని గద్దె ఎక్కాం మనల్ని నమ్మిన జనాలకి కొంచెం అయినా మంచి చెయ్యాలి అనుకుంటే దేశవ్యాప్తం గా ఉన్న కాపాల్ లేని రైల్వే క్రాసింగ్ లాంటి సమస్యలు పరిష్కరించటానికి  సర్పంచ్, MPTC, ZPTC లాంటి చిన్న స్థాయి నాయకులే చాలు... కానీ చొరవ ఏదీ? తమ వర్గ ప్రయోజనాలు చూసుకోవటానికి వారి కోసం పైరవీలు చెయ్యటానికే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది.
ఎక్కడి ప్రాంతీయ సమస్యని అక్కడి ప్రాంతీయ నాయకులే చొరవతీసుకుని రాగద్వేషాలకి అతీతంగా భావించి చూస్తే స్థానిక సమస్యల పరిష్కారాలు ఎంత సేపు?
మీకు తోడుగా ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే మీడియా మరో వైపు. పేజీలకి పేజీలు  గంటలకి గంటలు ఒకే వార్తను అనేక రకాల విస్లేషణలతో మనకి అందించే మీడియా సంస్థలు వత్సరాలుగా పరిష్కంపబడని చిన్న సమస్యలని పట్టించుకుని కొద్దిగా చొరవ తీసుకుంటే ఇలాంటి సమస్యల పరిష్కారం ఎంత సేపు?
నిన్న జరిగిన ప్రమాదం ఒక్కటి చాలు పాలకులు వత్సరాలుగా ఎంత దారుణంగా పాలిస్తున్నారో చెప్పటానికి... ఎలాగంటారా?
అసలు ఆ చిన్నారులు బతుకు సాగుతున్న పల్లెని వీడి మండల కేంద్రాల్లో ఉన్న కార్పోరేట్ పాఠశాలలకి వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది సర్కారు పాఠశాలల పనితీరు బాగుంటే... తన బిడ్డల భవిష్యత్ కోసం రెక్కల కష్టంచేసే కూలీ సైతం  ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలని చదివిస్తున్నారంటే విద్యారంగంలో మీ పాలకుల నిర్లక్ష్యం కనిపించటం లేదూ...?
సర్కారు పాఠశాలల పనితీరు బాగుండి ఉంటే ఉన్న ఊళ్లోనే చదువుకుంటూ ఉండేవారే కానీ... ఇలా పక్క ఊళ్ళో చదవటానికి బస్సెక్కి వెళుతూ రైలు బండి బారిన పడే వారు కాదు కదా ఆ చిన్నారులు.
ఇలా తవ్వుకుంటూ పోతే ఎక్కడెక్కడ జరిగే ప్రతి ప్రమాదం లో / ఉత్పాతంలో  పాలకుల నిర్లక్ష్యం... పాలితుల నిర్వేదం కలగలిపి నేటి నవీన భారత సమాజం...
ఇకనైనా కొంచెం మారతారని ఆశిస్తూ

పాలితుడు 

0 comments:

Post a Comment