Thursday, 31 July 2014

మృగాడినా... ఏమో మరి


ఓయ్ దేవుడా...

కొంచెం మా జాతిని అదే స్వామీ మగజాతిని అంతం చేసేయ్యవా... మగజాతి మొత్తాన్ని రాక్షససంతతిలా మగువలను మాత్రం ఎలాంటి పాపభావనలు లేని స్వచ్ఛమైన మానవత్వం పరిమళించే మనుష్యులుగా పుట్టించినట్లు ఉన్నావ్ కదా...

మా రాక్షస జాతి మొత్తం మగువలని కబళించక ముందే మమ్మల్ని అంతం చేసేస్తే నీ మీద కూడా నిందలు తగ్గుతాయి స్వామీ. నీ మీద నిందలు ఏముంటాయి అనుకుంటున్నావా ఏంటి స్వామీ.... నువ్వు మగవాడివేనట కదా... అందుకే మగ పక్షపాతివై ఉంటావని మా లోకంలో ఓ ఉవాచ...

అప్పుడెప్పుడో ఎవడో మనువు రాశాడట ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అని... నిజంగా ఆయన ఎవరో ఏమి రాసాడో తెలియదు కానీ యుగ యుగాలుగా మగవాళ్ళ ఆధిపత్యం కొనసాగిన మాట వాస్తవం. ఇప్పటికీ ఇంకా ఆ ఛాయలు ఉన్నమాట కూడా కఠోర సత్యం.

‘శతాబ్దాలుగా కనిపించని సంకెళ్ళేగా...అతివకు మనువేసిన అరదండాలు...!’

‘మృగవిన్యాసాలే మగతనం అనుకుంటూ కొన్ని మృగాలు_జనారణ్యం కదా మరి..!’

‘నువ్వెప్పుడూ నాకో శరీరానివే _ మనసుని చంపుకున్న మృ(మ)గాడిని కదా..!’

‘కాస్త నాలో అతివ మనసు ఒంపవూ _మద(గ) మృగాహంకారాలు మాయమవుతాయేమో..!’

అని రాసిన నేనే కొంచెం బాధ పడుతూ ఈ లేఖ రాస్తున్నాను అంటే మా ఆవేదన అర్ధం చేసుకోవాలి.

అవకాశం దొరికిన చాలా మంది మగవాళ్ళు మదగర్వంతో మృగాళ్ళుగా మారుతున్న మాట వాస్తవం... అంత మాత్రం చేత మగాళ్ళంతా మృగాళ్ళం కాదే...
నిజమే తరతరాలుగా మగవాడు స్త్రీ కంటే ఎక్కువ స్వాతంత్ర్యం, ఎక్కువ సౌఖ్యాలు... ఇంకా ఎన్నో ఎక్కువలు అనుభవిస్తున్నాడు. కాదని అనే వాడినే కాదు నేను.
కానీ భూమి మీద జరిగే ప్రతి అన్యాయమూ... ప్రతి అరాచకమూ మేమే చేస్తున్నామా...? 

ఒకనాడు అత్తలూ... ఇప్పుడు కోడళ్ళు... అత్తాకోడళ్ళ ఆధిపత్యం చేతులు మారుతూ... 

కానీ మారనిదల్లా ‘మగవాడి తలరాతే...’ ఇద్దరూ మమ్మల్నే అంటూ... కొడుకు మీద ప్రేమని చంపుకోలేక తల్లి... మొగుడు తనకే సొంతమనుకుని కోడలు మమ్మల్ని చవట దద్దమ్మలని చేస్తూ... ఇక్కడ కూడా నా కొడుకు సరైన వాడైతే... నా మగడు సరైన వాడైతే అంటూ మగవాడినే ఆడి పోసుకుంటూ.... అంతర్లీనంగా దీనిలోని అర్ధం ‘మా మగవాళ్ళం... అమ్మనో... భార్యనో ఏదో చెయ్యాలనే కదా’ మరి ఇందులో మగవాళ్ళ తప్పులు ఎంతవరకూ?

ఒక నిర్భయని అయిదుగురు మగవాళ్ళు అతి దారుణం గా మానభంగం చేసారు... కానీ అదే నిర్భయని రక్షించటానికి తను నగ్నం గా ఉన్నాడనే సంగతిని పట్టించుకోకుండా నిర్భయని రక్షించుకోవటానికి తాపత్రయపడిన ఆమె మిత్రుడు మగవాడే. వారి ప్రతి సమస్యనూ మేమూ సానుభూతితో చూస్తాం...

ప్రపంచంలో జరిగే ప్రతి ఆడ శిశువు భ్రూణహత్యకూ మగవాడే కారణం అనుకోవటం ఎంత పొరపాటు... ఇలాంటి విషయాల్లో మొత్తం కుటుంబాన్నే నిందించాలి కానీ కేవలం మగవాడిని కాదు. బిడ్డ విషయంలో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ప్రేమా అంతే గొప్పది... ఇందులో మరో మాటకు తావులేదు... నిజంగా భర్త ఆడపిల్ల వద్దు అన్నాడని బిడ్డను కడుపులోనే లేదా ఉయ్యాలలో పడగానే చంపుకుందంటే అది అమ్మ మనసు అని నేను ఎందుకు ఒప్పుకోవాలి... నిజమైన అమ్మ ప్రేమ భర్త ఆదరణ దక్కదేమో అన్న సంగతి ఆలోచించదు కూడా... మరి ఇందులో అర్ధం ఏమిటి... అక్కడ ఆ ఆడది భర్త ఆదరణ కోసం బిడ్డను చంపుకుని తన స్వార్ధం చూసుకుంది అనే కదా... మరి అందుకైనా తననీ నిందించాలి కదా...

ఒక రోజున ఒక తమ్ముడు ఒక అద్భుతమైన కవిత రాశాడు విఫలమైన ప్రేమ గురించి మగాడి దృక్కోణం నుండి ఆడదాన్ని నిందిస్తూ. అది నాకు చూపించి అడిగాడు ఎలా ఉందన్నా అని... ఇలాంటి కవితలకి ఏ ఒక్కరి కోణం నుండి రాయకుండా లింగ భేదం లేకుండా రాస్తే ఇంతకూ మించిన కవిత లేదు అని చెప్పాను.

అంటే ప్రపంచం లో అన్ని సమస్యలని లింగ భేదంతో చూడలేము... చూడ కూడదు కూడా... అలాగే చదువుతున్నారు కదా అని అన్ని సమస్యలని ఒకే కోణం లో ఒక్కళ్ళ మీదే నిప్పులు కక్కేలా ఉండకూడదు. అలా ఉంటే నాలాంటి సాధు’మృ’గాలని బాధిస్తాయ్...

ఒకటి చెప్పగలను ప్రపంచంలో కీచకులే కాదు శూర్పణఖలూ ఉన్నారు...
ఒక్క చేత్తో వెయ్యగలిగేది చిటికెలే... చప్పట్లు కొట్టలేం...

ఆడది మగాడిని మగాడు ఆడదాన్ని నిందించుకుంటూ ఎంతకాలం...? అన్ని తప్పులూ మగవాళ్లవేనా... మానభంగాలే కాదు అత్తింటి ఆరళ్ళు... భ్రుణ హత్యలూ కూడా మగాడి పుణ్యమే అనుకుంటూ...

ప్రతి మగాడిలో ఆడ మనస్సు, ప్రతి ఆడ దానిలో మగ మనస్సు సహజం... నేను మగాడిగా పుట్టి ఉంటే అనే ఆడవాళ్ళు ఎంతమంది లేరు..? అంటే పుట్టుక మారితే చాలు గానీ రాతలతో పని లేదు అనే అనుకుందామా?

మార్పు రావాల్సింది మగలోనే ఆడలోనో కాదు మనిషిలో... అమ్మ ప్రేమ కూడా కలుషితం అని వార్తలు వస్తున్న ఈ రోజుల్లో కూడా ప్రతి దానిలో మగవాడినే వేలెత్తి చూపిస్తూ ఉంటే సహజంగా మహిళా పక్షపాతులైన మగవారికి కూడా మనస్సు బాధించదా?

ఆడ మగా అనేది... నువ్వంటూ ఉండి ఉంటే నీ రాత... లేకుంటే ప్రకృతి లో ఓ భాగం... యుగాలుగా మగవాళ్ళ దాష్టీకం కొనసాగింది అనండి ఒప్పుకుంటాం... కానీ ఇప్పుడు కూడా ప్రతి దానికీ అకారణంగా నిందిస్తుంటే ఎందుకు ఊర్కోవాలి? ఎంత కోపం లో అయినా ఆడవాళ్ళతో పరుషంగా ఒక్క మాట అనలేని మా లాంటి మగవాళ్ళని నీలో కలిపేసుకో... మాటలు పడాల్సిన బాధ తప్పిపోతుంది.

ఇట్లు...


మగాడు (మృగాడినా... ఏమో మరి)

5 comments:

maa comment publish cheyatam ledu enduku sureshji

తప్పొప్పుల తరాజులో లింగ బేదాలుండకూడదు

లేఖలో చాలా సున్నితమైన విషయాలు రాసారు వాటి గురించి నేనేమీ చెప్పలేను కానీ ఎంచుకున్న ప్రెజెంటేషన్ మనుసుకు గుచ్చుకునేలా ఉంది.
లేఖలో మీ వాక్యాలు హైలైట్. చాలా రోజులైపోయినట్లుంది చదివి. మీ వాక్యాలన్నీ కూడా బ్లాగ్లో చదవగలిగే అవకాశం ఉంటే బావుంటుంది కదా!

Post a Comment