Tuesday, 11 November 2014

వెన్నెల కుసుమం - 26 (ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)

ఎన్ని సుమదళాల సుకుమారపు పారవశ్యమో నీ పెదవుల ప్రాంగణంలో చేరి వశీకరణ యజ్ఞం చేస్తున్నట్లుగా  నీ అధర కోవెలలో కొలువు దీరి లాలిత్యాల వన్నెలద్దుతూ లావణ్యాన్ని పోత పోస్తూ  నన్ను వివశుణ్ణి  చేస్తున్నాయి. 

ఎర్రెర్రని నీ పెదవుల అద్భుత నిధులు నావని తలచుకుంటూ సుమ గంధ విరాజితమైన నిన్ను అఘ్రాణిస్తూ  తాంబూలం లేకనే ఎర్రగా పండినట్లున్న నీ పెదవుల మృదుత్వంలో దాగిన హేమంత మేఘాల స్పర్శ నను తాకే మధుర క్షణాల కోసం నేనూ ఓ చకోరంలా ఎదురు చూస్తున్నాను.  నీ అధర సుధల్లో ఒదిగిన అనురాగం నులి వెచ్చని అల్లరిగా మారి ఒక మైమరపుగా నను స్పృశిస్తుంటే ఎన్ని జన్మల తపస్సు ఆ క్షణంలోకి రాలిపడిందో కదా అని అనిపిస్తుంది.

నీ అధరాల మెరపులలో చందమామ తన వెన్నెలకి మెరుగులు దిద్దుకుని లోక సంచారానికి బయలుదేరుతున్నాడు. నీ పెదవుల కాంతితో ఆ సూర్య భగవానుడు తన కిరణాల వెలుగుని రెట్టింపు చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో సప్త రథారూఢుడై  ఉషస్సులోకి పయనం కట్టాడు.
నీ పెదవులు తాకిన మల్లెలే కుంకుమ వర్ణ శోభితమై కొత్త అందాలతో అలరారుతూ దేవలోక పుష్పాల్లా అందరినీ భ్రమింప చేస్తున్నాయి. 

ఆకాశ మార్గాన షికార్లు చేసే దేవతా కన్యలూ, గంధర్వ బాలలూ, యక్షిణీ భామలు నీ అధర సౌందర్యం చూసి తాము కూడా అలాంటి పెదవులు కలిగి ఉంటే ఏంతో బాగుంటుందని భావిస్తున్నారట. వాళ్ళ బాధలో నుండి అసూయ జనించి నీ అధరాల సోయగాన్ని నాశనం చెయ్యమని ఓ గడసరి తేనెటీగని పంపినారు. 

కానీ తనకి నీ అధర సౌందర్యం బాగా నచ్చి అంతటి సౌందర్యాన్ని నాశనం చెయ్యలేక వెనుదిరిగి వెళ్ళిపోతూ నాతో ఏమని చెప్పిందో  తెలుసా...? 'ఈమె అద్భుతమైన అధర సుకుమారాన్ని నాశనం చెయ్యటానికి దేవతలు పంపగా వచ్చిన గడసరి తేనెటీగను నేను... కానీ ఈమె అమాయకత్వం... అపురూప సౌందర్యం చూసిన తరువాత అలాంటి పని చెయ్యలేక వెనుదిరిగి వెళ్ళిపోతున్నాను. కానీ ఆ దేవకన్యలు ఎంతకైనా తెగిస్తారు. నీ ప్రియురాలిని జాగ్రత్తగా కాపాడుకో' అని.

నిజం ప్రియా... నీ అపురూప సౌందర్యానికి ముగ్ధులవుతున్న వారు అంత మంది ఉన్నారో... దానికి రెండింతల మంది అసూయతో దహించుకుపోతూ  నీ అపురూపమైన నీ సౌందర్యాన్ని నాశనం చేయాలని కలలు కంటున్నారు. పాపం నేనంటూ  ఒకడిని ఉన్నాను అని నేను  నీతో ఉన్నంత వరకూ వారి కలలన్నీ  కల్లలేనని వారికి తెలియదు పాపం. 

ఇవన్నీ చూస్తుంటే ఎందుకైనా మంచిది దిష్టి తియ్యాలని అనిపిస్తుంది. మూడునాళ్ళ నా ఈ జీవితాన్ని బృందావనపు నవ్వులతో వికసింప చేస్తున్నావు. మోడువారి పోతుందనుకున్న నా బ్రతుకుని పునరుజ్జీవనం చేసి నీకై తపించేలా చేస్తున్నావు. నీకు నేను ఎంతగానో రుణపడ్డానో కదా ప్రియా... 

నీ పెదవులని తాకిన ఓ చిరుకుసుమం  'అమ్మో! నీ ప్రియురాలి అధరాలపై మధువు నా పుష్పజాతి మొత్తం కలిగి ఉన్న మాధుర్యం కంటే ఎక్కువ మాధుర్యంతో నిండి ఉంది. నీవెంత అదృష్టవంతుడివో కదా..." అని అంది.

తేనెలూరుతున్న నీ పెదవులు తమ సరస సరాగాలకి నన్ను ఆహ్వానిస్తున్నాయ్. నీ పెదవుల విరహ వేదనను నా అధరాలతో తీరుద్దామని ఉంది. మరి నా పెదవులకూ అదే విరహ వేదన కదా ప్రియా...

0 comments:

Post a Comment