Friday, 14 November 2014

నా నీకే...

నా నీకే...
నిన్ను నేనెప్పుడైనా అక్షరాలతో చదివానా? ఒక్కో తలపునీ తీరిగ్గా తిరగేస్తూ మనసుతో చదవటమే కదా నాకు వచ్చిన చదువు.
నీ పలకరింపెప్పుడూ చిత్రమే నాకు... బహు చిత్రమైన మన పరిచయంలా. ఎలా తారస పడితేనేం... ఏకాత్మలా ఒక్కటే సడి వినవస్తుందేమిటా అంటూ మన రెండు గుండెల సవ్వడిని ఒక్క చోట ఒక్క సారిగా విందామనే అందమైన స్వార్ధంతోనే నిన్ను పిలిచాను.
వెన్నెల జతులలో రాలిపడే సుమరేకుల పరిమళ ధ్వనులని ఒడిసి పడుతున్న జత ఎదల థిల్లానా ఆలకించే క్రమంలో నా పిలుపు అప్రియమయ్యిందేమో కానీ నా ప్రతి పలుకుని నీ పాదధ్వనుల చెంత ఆవాహన చేసుకుంటూ తిరిగే నువ్వు నా హృది లయలలో చేసే నవ్వుల నర్తనం నా పెదవుల్లో పరావర్తనం చెందుతుంది.
అచ్చ తెలుగు అందాన్ని పరికిణీలలో పోతపోసుకొచ్చిన పసిడి కాంతలా నువ్వు నా చెంత నయగారాలు పోతుంటే ఆకుపచ్చని వనాల నుండి నడిచొచ్చిన సెలపాట నా చెవుల్లో మృదు మధురంగా సడి చేస్తున్నట్లుగా ఉంది. 'నీ' 'నా' క్షణాలు కౌగలించుకుంటూ మన క్షణాలుగా మారుతున్న ప్రవాహంలో మన మైమరపులు ఈదులాడుతూ 'నీ నేనునో' నా నువ్వువో మనమైనాక కూడా అయోమయంలోకి జారిపడ్డాం.
మనంగా కలిసినా జారి పడింది మాత్రం ఎవరికి వారుగా అని అర్ధం అయ్యేలోపే కాలం రాసిన స్క్రీన్ ప్లే లో పెద్దల పంతాలతో చెరో పందిరిలో నిస్తేజపు నవ్వుల్లో చిక్కుబడిపోయాం. ఆ నవ్వులు పక్కన పెడితే ఆ పందిరికి కట్టిన గుంజలకి మనకీ తేడా ఉందని ఇన్నినాళ్ళ యాంత్రిక జీవితం లో నేను ఏనాడూ అనుకోలేదు.
భౌతికంగా నువ్వెక్కడో నేనెక్కడో... మన తలరాతకి ఏ సంబంధం లేకుండానే వాళ్ళ రాతల్ని మన జీవితాల్లో రాసుకున్న కొన్ని జీవితాల బంధాల్లో చిక్కుబడిపోయిన బతుకుల్ని ఈడ్చుతూ అప్పుడప్పుడూ అలనాటి స్మృతుల వనంలో కలల విహారాలు చేస్తూ కంటికి కాస్త తడి రుచి తెలిసేలా చేసుకుంటున్నాం.
ఏకాంతం దొరికిన ప్రతి క్షణంలోనూ నా కాంతవై నువ్వు... నీ రవికాంతుడినై నేను... మనసుల వారధిగా నెరపుకుంటున్న ప్రణయ ప్రబంధాల ఊసులని ఎవరి స్క్రీన్ ప్లే ఆపగలదు.?
భౌతికంగా ఒక్క చోటున ఉంటే మన ప్రేమ తీరు ఎలా ఉండేదో ఊహించలేను కానీ ఇప్పుడు ప్రతి క్షణం నీ సన్నిధిలో వాలిపోతున్న మనసు చెప్పే ఊసులని రాసులుగా పోస్తే ఆ క్షణాల కూడిక మేరు పర్వతాన్ని మించిపోదూ.
మనసుల ఆలింగనపు అమలిన శృంగారం ఇచ్చే ఆనందం యాంత్రికంగా స్పర్శించుకునే శరీరాల వేడిలోనుండి ఏనాడైనా పుడుతుందా...
అందుకే దూరంగా ఉన్న రెండు భౌతికాలలో ఒక్కటిగా మారిన ఏకాత్మలో మన ఆనందాన్ని పోత పోసేద్దాం...
నీ లోని
నీ నేను....

0 comments:

Post a Comment