ఏయ్… మనిషీ,
పిల్లి...కుక్క...ఆవు… ఎద్దు…
గాడిద...గొర్రె… మేకా…
నీ పెంపుడు బానిసలే
మూగ జీవాల బానిసత్వంలో
నీదెప్పుడూ రాచరికమే ననుకుంటున్నావ్
కిరీటాన్ని పక్కన పెట్టి
అహాన్ని చిదిమేసి
ఇంకాస్త లోపలి వెళ్లి
నిన్ను చూసుకో
తెలిసింది కదా నిజం
పరివారానికో… పరిశ్రమకో
సంఘానికో… బంధానికో
కట్టుబానిసవు కదోయ్ నువ్వు
మరేమిటోయ్ నీ గొప్ప
ఎక్కడ దాగిందోయ్ నీ స్వేచ్ఛ
అడుగడుగునా కానరాని
సంకెళ్ళలో నడిచేస్తూ
స్వేచ్ఛావాసిలా నటనలెందుకోయ్
మనిషంటే మనీషన్న కథలెందుకోయ్
మానవజన్మ ఉత్తమమని కులుకెందుకోయ్
పామంటే...పులంటే భయం… చంపేస్తావ్
పిల్లిని చూస్తే అపశకునం… చించుకుంటావ్
ఈగంటే.. దోమంటే రోగం రోగం… నలిపేస్తావ్
మేకంటే... కోడంటే… మహా ప్రీతి… తినేస్తావ్
ఆవు పాలిస్తే పూజిస్తావ్ ఆపేస్తే కసాయికిస్తావ్…
ఇంకెక్కడోయ్ భూతదయ
మరి ఆపవోయ్ మనిషినన్న సొద
నీకు
నువ్వొక పంజరం
నువ్వొక నటనం
నువ్వొక పతనం
నువ్వొక శూన్యం
నువ్వొక మరణం
పృధ్విలో
నువ్వే అతి కౄరం
నీకు నువ్వే అంతెరగని స్వార్థం







0 comments:
Post a Comment