Saturday, 1 October 2016

నీకు నువ్వు దొరికే దారిలోనీ హృదయంలోనే
నువ్వు మరణించడం
మళ్ళీ జన్మించటం
ఒక వలయంగా కొనసాగుతున్నంతకాలం
నీకు నువ్వొక అపరిష్కృతానివిగా
మిగిలిపోతూనే ఉంటావ్

లోలోని జరామరణాల తకరారులో
కమ్ముకునేవన్నీ కారుమబ్బులే అయినప్పుడు
అక్కడో మెరుపు
ఇక్కడో చినుకు... అంతే
చిగుర్లుగా మొదలైన వాటిని వనంగా మార్చాల్సిన
ముసురు మాత్రం ఎన్నటికీ ఎండమావే

పొడిబారిన మేఘాలని తడి చెయ్యటం
పెద్ద కష్టమేమీ కాదులే
నీకు నువ్వు పరిచయమవ్వాలంతే
నువ్వు చిగురించే కొన్ని మాటలు మొదలవ్వాలి
నువ్వు పాదుగా మారిన నీ చోటునుండి

పిచ్చోడివేం అవ్వవులే
అప్పుడప్పుడూ నీడతో మాట్లాడుకుంటే
నీకు నువ్వు పహారా కాసుకోవటం
మొదలు పెట్టిన తొలి సమయాలే అవి

తప్పేమీ కాదు
నీకు నువ్వు దొరికే దారిలో
ఒక చిన్ని స్పర్శగా
కాస్తంత మౌనాన్ని రాసుకోవడమంటే
అది నువ్వొక భరోసాగా
ఆవిష్కృతమవుతున్న అనంత శబ్దమే


0 comments:

Post a Comment