విశృంఖలంగా పెరిగిపోతున్న
మోహకారణాల వశీకరణ మొలకల
క్రీనీడల రహస్యాలు బట్టబయలై
నివురుకప్పని నిప్పుకణికల్లాంటి
వ్యక్తిత్వాల అస్తిత్వం ప్రతిధ్వనించే
వేళల రాక ఎప్పుడన్నది
ఎన్నటికీ అంతుబట్టని రహస్యమే
రహస్యమన్నదేదీ రహస్యంగా
కొనసాగ కూడదన్న మనిషి పంతంలో
ఇక్కడే వీడిపోవాలీ రహస్యం
అనుకున్నంత సేపూ
అక్కడే తచ్చాడే
మాయా జాలమే ఈ విశ్వరహస్యం
ఎక్కడికక్కడ గడియ వేసేసుకున్న
ఆలోచనలతో ప్రతి తానూ ఒక తనకి
రహస్యమేనన్న నిజం
లోకం ఎన్నటికీ ఒప్పుకోని
నగ్నసత్యమైతేనేం, నీకు నిన్ను
ఒక అందమైన అబద్ధంగా అట్టిపెట్టుకోవటం
ఎంతో ఇష్టమైన వ్యాపకం కదా
అయినా… నీలోపలికి ఎవ్వరినీ రానివ్వని నీకు
ఏ లోపల ఏముంటే ఎందుకోయ్
యుగాలుగా మట్టి ముద్ద రహస్యమే
అవగతమవ్వని నీకు
రహస్యాల రహస్యం ఎప్పుడూ
మార్మిక కాసారమే







0 comments:
Post a Comment