మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 15 August 2014

ఒకనాడో అల్లూరి

భారత మాతా..

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవమట... నిజంగానే స్వాతంత్ర్యం వచ్చిందా? నేను అనుకునేది స్వాతంత్ర్యం వచ్చింది భారత భూభాగానికే కానీ భరతజాతికి వచ్చిందంటావా?

ఎక్కడ వచ్చిందమ్మా స్వాతంత్ర్యం. ఇష్టం వచ్చిన రాజకీయ నిర్ణయాలతో ఏ సరిహద్దు దేశంతోనూ సరిలేని సంబంధాలు. నిన్ను కాపాడుకోవటానికి జవానుల బలిదానాలు. దేశ సమగ్రత కన్నా తమ రాజకీయ భవితే పునాదిగా నీ రాజకీయ పుత్రులాడే వికృత క్రీడలో మాకెక్కడిదీ స్వాతంత్ర్యం? రాజకీయ ప్రయోజనాలలో రత్నాల్లాంటి వారూ క్రీనీడలవుతూ జాతిని అపహాస్యం చేస్తుంటే ఎక్కడిదమ్మా స్వతంత్ర్యం?

67 వత్సరాలు గడచినా ఆకలిని జయించలేక పోయాం జీవధాత్రిగా పేరొందిన ఈ గడ్డపై... మనిషి కనీసావరాలైన కూడు గూడు గుడ్డ కలలో కూడా దరికి రానట్లుగా దూరం జరిగిపోతున్నాయ్.

స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఇది ఎందరి త్యాగధనుల త్యాగ ఫలమో... కానీ దీనిని ఒక రోజు సెలవు దినం గా భావించే యువత తమలోని యువ శక్తిని పనికిమాలిన విషయాలపై నిర్వీర్యం చేసుకుంటుంది.

ఇక మన దేశ మహిళలకి ఉన్న రక్షణ ఎంత బాగో రోజురోజుకీ వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలే చేపుతున్నాయ్. ఆ గాంధి గారికి మనవాళ్ళ మీద నమ్మకం ఎక్కువ అయ్యి ఏదో ఒక రోజు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నిర్భయం గా తిరుగుతుందని కలగన్నాడు. కానీ పట్టపగలు స్వంత ఇంట్లోనే స్వతంత్రంగా బతకలేని పరిస్థితులు తన జాతికి వస్తాయని ఊహించలేక పోయాడు. 

వైద్య రంగంలో ఎంత పురోగతి అంటే నిర్భయకి మంచి చికిత్సకోసం మరో దేశం తరలించే అంత... ఇక విద్యారంగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది... ఇంజనీరింగ్ చదువుల్లోనూ వల్లె వేసే విధానాలేగా మరి... ఈ రెండు రంగాలు డబ్బు సంపాదనకి సులువైన మార్గాలయ్యాయి కానీ మామూలు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయ్.

వ్యవసాయాధారిత దేశం లో వ్యవసాయమే చెయ్యలేని పరిస్తితులు... ఒక వేళ రైతు బిడ్డ తన రక్తాన్ని స్వేదం గా మార్చి సేద్యం చేసినా తాను పండించిన పంటకి తాను ఖరీదు కట్టుకోలేని అతి గొప్పస్వాతంత్ర్యం మనది.

పారిశ్రామిక రంగం సరే సరి. ప్రభుత్వ పరిశ్రమలెన్నో మూతబడి... ఉన్న కొన్నీ కుంటుకుంటూ నడుస్తూ... ఇక చిన్న పరిశ్రమల శ్రమని గుర్తిద్దామా అంటే ఈ పూట కరెంట్ ఉంటుందో తెలియక ఉత్పత్తులు తగ్గిపోయి... నేడా రేపా అన్నట్లు ఉంది. మౌలిక వసతులూ సరిగాలేని దేశంలో ప్రజల ప్రాణాలకి భద్రత ఎక్కడ?

కుల పంజరాల్లో కొందరు, మత పంజరాల్లో కొందరు, వర్గ పంజరాల్లో కొందరు, వర్ణ పంజరాల్లో కొందరు, డబ్బు పంజరాల్లో కొందరు, అధికార పంజరాల్లో కొందరు, కీర్తి పంజరాల్లో కొందరు... ఇలా ఎటు చూస్తే అటు పంజరంలోని బతుకులేగా నవీన భారతావనిలో? ఇంకెక్కడి స్వాతంత్ర్యం? 

ఇది చూడు తల్లీ ప్రస్తుత నీ పరిస్థితిపై నా వేదన ఓ పాట రూపం లో...
పల్లవి:
ఒకనాడో అల్లూరి మరునాడో భగత్ సింగు
తరం మారి సుభాష్ చంద్ర బోస్
 
ఒక్కొక్క వీరుడు నేలకొరిగిపోతుంటే
 
భారతమాత గుండె పగిలి ఏడ్చింది
 
ప్రియపుత్రులే తనను వీడిపోతుంటే
 
జాతిమాత కన్నీరు కార్చింది ||ఒకనాడో||

చరణం:
ఆ కన్నీటి తడి ఆరమునుపే
 
ఆ కన్నీటి తడి ఆరమునుపే
 
తన తనువుని ముక్కలుగా చీల్చివేస్తే
 
ఆ మాత హృదయవేదన విన్నదెవ్వరు?
జాతిమాత కన్నీరు తుడిచిందెవ్వరు?
తన ప్రియ పుత్రిక కాశ్మీరం
 
కలలపంట పంజాబు రక్తసిక్తమై పోతుంటే
 
కాపాడే ధీరులెవరని కాలంలోకి చూస్తుంది
 
కాశ్మీరం సీమ నుండి కన్యాకుమారి వరకూ
 
కులం పేరిట కుత్తుకలు తెగుతుంటే
 
మతం పేరిట మారణహోమం నిత్యాగ్నిలా వెలుగుతుంటే
 
మన జాతిమాత గుండెకోత వినేదెవ్వరు? ||ఒకనాడో||

చరణం:
తెల్లదొరల తందనాలు తెల్లవారి పోయినా
నల్లదొరల ఘాతుకాలు నలుచెరగుల నర్తిస్తూ
 
భరతమాత గుండెలను చీల్చివేయ చూస్తున్నాయ్
 
మహనీయులే నడయాడిన పుణ్యభూమి
 
మానినికే మానరక్షణలేని పాపభూమిగా
 
అతివల పాలిట మహాస్మశానమే అవ్వగా
 
వీధి వీధికో వీరంగం
 
సందు సందుకో సంకులసమరం
 
మామూలైన మన మాతృభూమిలో
 
జాతిమాత హృదయవేదన వినేదెవ్వరు?
మన పుణ్యమాత కన్నీరు తుడిచేదెవ్వరు? ||ఒకనాడో||

ఇవీ ఆ తెల్ల దొరలూ వదిలి వెళ్ళిన భారత గడ్డ మీద నల్లదొరలు పండిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు... 

అయినా ఏదో ఆశ... అద్భుతాలు ఏవైనా జరిగి నిజమైన స్వాతంత్ర్యం రాకపోతుందా అని...

భారతీయుడు

Monday, 11 August 2014

వెన్నెల కుసుమం - 16 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)


హనీ...

ఓ బ్రహ్మ మానస పుత్రికా...

అవును నువ్వు బ్రహ్మ మనసులో ఉద్భవించిన అద్భుత భావానికి రూపం నీవు. నీ ప్రేమను పొందే అదృష్టం నాకు మాత్రమే కల్పించిన ఆ సృష్టికర్త నిజంగా ఎంత మంచి వాడు?
తాను సృష్టించిన సరస్వతి దేవిని తానే వివాహ మాడిన ఆ బ్రహ్మ... నీ లాంటి అద్భుత సౌందర్యాన్ని మాత్రం సాధారణ మానవుడిని అయిన నాకు కానుకగా ఇచ్చాడంటే అది నా అదృష్టమా... బ్రహ్మ నాకిచ్చిన వరమా?

నీ అందాన్ని చూసి ఒక్కోసారి ఎంత భయం వేస్తుందో తెలుసా... ఎందుకంటావా.. ‘దేవతలు అసలే సౌందర్యారాధకులు. అలనాడు దమయంతిని పొందటానికి ఎన్ని ఎన్ని ఎత్తులు వేసారు... ఎన్ని పాట్లు పడ్డారు? అలాంటి వారు మళ్ళీ నిన్ను చూస్తే నీ కోసం అమరావతిని వదిలి అవని మీదకి వచ్చేసి నిన్ను పొందటానికి నన్ను అడ్డు తొలగించడానికి ఏ కుయుక్తులు పన్నుతారో అని...’

నాకేమవుతుందో అన్న భయం లేదు నాకు ఒక్క క్షణమైనా నీ ఎడబాటు భరించలేని నాకు నిన్ను ఎక్కడ దూరం చేస్తారేమో అనే భయం మాత్రమే... అంతలోనే ‘వాళ్ళు నన్ను ఏమి చెయ్యగలరులే’ అన్న ఆలోచన కూడా వచ్చేసిందిలే...

రాక్షసుల ధాటికి తట్టుకోలేక అస్తమాటికి విష్ణుమూర్తి పంచన చేరే పిరికి వారు కదా ఆ అనిమిషులు. అయినా మన ప్రేమ శక్తి ముందు అమరుల అద్భుత శక్తులన్నీ దిగదుడుపే కదూ. ప్రేమ శక్తితోనే కదా సత్యభామ కోరికపైనే కదా పారిజాత వనాన్నే భూమి పైకి తీసుకుని వచ్చాడు ఆ శ్రీకృష్ణుడు దేవేంద్రుడిని ఓడించి.

బ్రహ్మ అపురూప సౌందర్య లావణ్య రాశిగా నిన్ను సృష్టిస్తే... నిన్ను వర్ణించే అదృష్టాన్ని నాకు కల్పిస్తున్న కరుణా మూర్తి ఆ సరస్వతీ మాత. నిజం గా ఆ సరస్వతీ దేవిని నేను ఎంతో ఋణపడి ఉన్నాను. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద నిన్ను వర్ణించే అదృష్టం నాకు మాత్రమే కలిగించి ప్రతి అక్షరం లోనూ అమృతపు చినుకులని కురిపిస్తున్న ఆ మూర్తికి నేనేమి ఇవ్వగలను భక్తి పూర్వకంగా ఒక్క నమస్కారం తప్ప...

ముత్యాల రాశి నుండి ఉద్భవించిన ముద్దు గుమ్మవు కదూ... ఎంత మంది అమర మూర్తుల ఆశిస్సులు ఉన్నాయో కదా నీకు...

ఓ క్షణం... బ్రహ్మ మానస పుత్రికలా
మరో క్షణం... దేవ కన్యలా
ఇంకో క్షణం... గాంధర్వ బాలలా
సాగర కన్యలా
వెన్నెల రాణిలా 
జాబిల్లి తునకలా 
ప్రకృతి పడతిలా 
పసిడి బాలలా 
బాపు బొమ్మలా
నవలా నాయికలా

ఇలా ఎన్నో ఎన్నో రూపాలు... అన్నీ నీవే. అమ్మో ఇంకా రాయాలంటే చాలా ఉన్నాయి.

నీ హృదయపు శృతిలయలు నా మనసున సరిగమలు
నీ పరువపు పదనిసలు నా ఎదలో మధురిమలు
నా మదిలోని తలపులు నా హృదిలోని వలపులు
నా మనసంతా తపనలు అన్నీ నీ కొరకే ప్రియా

నా నువ్వే కదూ...

నీలిమేఘ పరదాలలో నీలిమవై 
నీలాల నింగి నీడల్లో అందాల ప్రతిమలా 
మాటలు నేర్వని నిశ్శబ్దమాలికవై 
చిరునవ్వుతో మతులు పోగొట్టే అందాల దీపికగా

నన్ను మురుపిస్తూ మైమరపిస్తూ నా కళ్ళల్లో శాశ్వత మెరుపువయ్యావ్....

నీ...
...రేష్

Wednesday, 6 August 2014

నా నీకు... నీ నేను

ఏరా హనీ బాగున్నావా...

పక్కనే ఉన్నా బాగున్నావా అని అడిగే అంత దూరం మన మధ్య ఎప్పుడు వచ్చిందిరా? రోజూ చూసుకుంటున్నా ఒకరినొకరం చదవలేని శూన్యం ఎప్పటి నుండి మనలో...?

నీలోనుండి నన్ను... నాలోనుండి నిన్ను... ఒకరిని ఒకరం చూసుకోవటం ఎప్పుడు ఆపేశాం అంటావ్? అందుకే కదూ ఈ నిర్వేదం... 

నీతో కలిపి వెన్నెల్లో స్నానం చేసి ఎన్నాళ్ళయ్యింది? మనమిద్దరం కలసి మలయసమీరాలని స్పృశించి ఎన్నాళ్ళయ్యింది. 

నన్ను నిండుగా నీ నవ్వుల్లో తడిపి ఎన్ని రోజులు? నిను నేను మనసారా నా గుండెలకి హత్తుకుని ఎంత కాలమయ్యింది?

నీ నిశ్శబ్దాన్ని చూస్తూ నేను... నా మౌనాన్ని చదువుతూ నువ్వు ఎన్నాళ్ళిలా

రెప్పల గూట్లో దాచేసిన కలలన్నిటినీ నిజం చేసుకునే రోజుల కోసం నిరంతర ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ నీ కను రెప్పల వాకిట్లో నీటి చెలమలా మారుతున్నానని ఏనాడూ అనుకోలేదు.

ఒక్కోసారి కన్నీరు జీవితానికి ఎంత ధైర్యం ఇస్తుందో తెలుసా... జీవితంలో మనిషి తడి ఇంకా మిగిలి ఉందని గుర్తు చేస్తూ. నీ కన్నీటి తడి చాలురా... నా గుండెల్లో జడివాన కురియటానికి...

స్తబ్ధమయిపోయిన మనసుల్ని కరిగించే శ్లోకంలా  నీ అశృధార నను ముంచేస్తుంటే నా ప్రాణం నిలుస్తుందంటావా...?

పొడి పొడి మాటల పలకరింపుల్లో... హృదయంలో చెలమల చెమరింపులుంటాయని తెలుసుకోలేని వాడిని కాదు కదరా నేను.

అయినా నాలో ఉంది నువ్వురా... నేనెప్పటికీ నీ కళ్ళల్లో వెలుగులా ఒదిగిపోవాలి అనుకుంటాను కానీ నీ కంటి జలపాతాలలో ఈత కొట్టాలనే సరదా పడతానా?

నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాను అనిపిస్తే నన్ను నిలదియ్యకపోవటం నీ తప్పుకాదూ?  

అయినా గానీ ఈ తప్పుల గొడవ ఇప్పుడు వద్దులే... మనసుల్ని చదవటం ఆపేసి తప్పుల్ని చదువుకుంటూ వెళుతుంటే తగాదాలలో ముందుంటామేమో కానీ కోల్పోతున్న జీవిత మధుర్యాన్ని వెనక్కి తెచ్చుకోలేము కదా... 

ఎంచటాలకి మంగళం పాడేసి... పంచుకోవటం మొదలు పెడదాం మళ్ళీ మరింత కొత్తగా...

కళ్ళు చదివినది అర్ధం కాని చోట నిశ్శబ్దాలమౌదాం... నిరతమూ నిఘంటువుల్లా మనసు అర్థాలను చేరవేసుకుంటూ...   

నాలో నిన్ను ఒంపేసుకుని... నన్ను దాచేసుకుని నువ్వై కనిపించినప్పుడు నువ్వూ అలాగే చేస్తూ లోకానికి మనం దొరికి పోయిన ఆ తీయని రోజులని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రయాణం చేద్దామా... జ్ఞాపకాల వీధుల్లో కాదు సుమా... వర్తమానపు వలపు వాకిళ్ళలో... 

నువ్వు సడి చేస్తుంటే నేను సవ్వడినవుతా... నువ్వేసే అడుగులకి నే పాదరక్షని అవుతా...

నీ గోరు వెచ్చని అధరాల స్పర్శతో నా ఉదయం మొదలైతే మన రోజంతా మధురం కాదా?

సుప్రభాత వేళల్లో సువాసనలు చిందించే పొగలు గక్కే కాఫీని ఒకే కప్పులో నువ్వో గుటక నేనే గుటక వేసుకుంటూ కళ్ళతో ఊసులాడుకుంటూ... ఓహ్ తలచుకుంటే నీకు ఆ ప్రభాత వేళని స్పర్శించాలని అనిపించటం లేదూ...?

వాడిన నీ పెదవి పూలూ వికసిస్తాయి నా ప్రతి క్షణాన్ని నీలో లీనం చేస్తుంటే...

నా నిండు జాబిలిని నిర్లక్ష్యం చేసుకుని అమావాస్య లాంటి జీవితగమ్యం కోసం గమనం చేస్తున్న నా ప్రయాణాన్ని అర్ధంతరం గా రద్దు చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాగా... నీ మదిలో నవ్వుల పువ్వులు  విరబూస్తాయని చెప్పూ... మన మధ్య దూరం నాలుగడుగులు ఐతే ఆ నాలుగు అడుగులూ నేనే వేస్తా...

ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడు... నీ జీవితానికి నమ్మకాన్ని అవుతా...

ఎప్పటికీ

నీ

...రేష్  

Monday, 4 August 2014

వెన్నెల కుసుమం - 15 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)

హనీ...
చిరుగాలుల సవ్వడిలో వినిపిస్తున్న కోయిల గానం నీ కంఠ మాధుర్యం కన్నీ ఏమంత బాగుంటుంది అంటావ్? తొలకరి చిరు జల్లుల సందడిలో నాట్యమాడే మయూరము నిన్ను చూసి తాను నేర్వని నృత్య భంగిమలు నేర్చుకోవాలని అంటున్నది.
ఓ వెన్నల కన్యా... నీ నెలరాజుని నేనేలే..!
పృథ్విలోని పసిడికి అమరావతి నగరపు అమరులు తాగే అమృతాన్ని కలిపి పార్థసారధి శ్రీకృష్ణుడు ఇచ్చిన పారిజాత పుష్ప పరిమళాలు రంగరించి భూమాతకే వరమైన ప్రకృతిని నీలో ఒంపుసొంపులుగా మార్చి గులాబీల సున్నితత్వంతో మందారాల మృదుత్వంతో నీకు ప్రాణ ప్రతిష్ఠ ఈ ఆవని పైకి కానుకగా పంపాడు కదా ఆ బ్రహ్మ...
గ్రీకుల అందాల దేవత వీనస్, హిందువుల అందాల దేవత రతి నిన్ను చూసిన తరువాత తాము అసలు అందాల దేవతలమేనా అని ప్రశ్నించుకుంటారేమో...!
ఓ ప్రియతమా...
ఏమని చెప్పను నా మనసు చెప్పుతున్న మౌన సందేశం.? ఎలా తెలపను నా హృదయం చిత్రిస్తున్న రూపం నీదని. నా మది నీకోసం పదే పదే పలవరిస్తుంది.
ప్రాయం వాడినా ప్రేమ వాడదు అని భావించే నా మనసు నీ ప్రేమ కోసం ఎన్ని జన్మలకైనా ఎదురు చూస్తుంది.
ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే కదూ... ప్రపంచం లో ప్రతి మనిషికీ మనసు ఒకటి ఉంది అని గుర్తుకు వచ్చే సందర్భం ప్రేమతోనే కదూ...
అక్షర జ్ఞానం లేని వాడు కూడా నిర్వచనం ఇవ్వగలిగేది ప్రేమనే... సకళ కళా పండితోత్తముడైనా నిర్వచించలేనిది కూడా ఆ ప్రేమనే...
నా ప్రాణాలనైనా ఇస్తాను కానీ ప్రేమను మాత్రం విడవను. అంత పరితపించ పోవడానికి ప్రేమలో ఏముందో! ఏమో మరి..!
దేవదాసు పార్వతికి ఏమని చెప్పినాడో... రోమియో జూలియట్లు ఏమని సంభాషించుకున్నరో... లైలా మజ్ను, సేలం అనార్కలిల ప్రేమలు ఎలా అజరామమయ్యాయో... వారిని అడిగి కనుక్కుందామంటే వారు సజీవులు కాదే... ముంతాజ్ కు ప్రేమ చిహ్నం గా షాజహాన్ సమర్పించుకున్న తాజ్ మహల్ గుండె నడిగితే తెలుస్తుందేమో ప్రేమంటే...!
ప్రేమంటే ఒక తపస్సు... ఒక ఉషస్సు... ప్రేమకు జగమంతా ఆశిస్సు...
ప్రేమకు పల్లవి ప్రేమ
ప్రేమకు చరణం ప్రేమ 
ప్రేమకు రాగం ప్రేమ 
హృదయసరాగం ప్రేమ
మనసుగీతం ప్రేమ 
మరువ లేనిది మరువ రానిది ప్రేమ...
మనసుని మనసు స్పృశిస్తే పుట్టేది ప్రేమ... గుండెను గుండె తాకితే కలిగే భావం ప్రేమ...

ఓ ప్రియురాలా...
నీకు ప్రేమ గొప్పతనం తెలుసా... లేని మనిషిని కూడా అనుక్షణం కలల్లో చూపించే శక్తి దేనికైనా ఉంది అంటే అది ప్రేమకే... నీవు లేనప్పుడు కూడా అనుక్షణం నీ ఊహలలో జీవిస్తున్నాను అంటే అందుకు కారణం నీపై నా ప్రేమే కదూ...
ప్రేమలో పడిన వారే కాదు ప్రేమంటే ఇష్టం లేని వారు కూడా అనుక్షణం తలచుకునేది కూడా ప్రేమనే... ఏంతో చిత్రం కదూ...
దేవుడు ప్రేమ అనే వరాన్ని మనిషికి ఇవ్వటం మానవ జాతి చేసుకున్న పుణ్యం కదూ... అసలు ప్రేమలో ఉన్న మాధుర్యం చవి చూపతానికే మానవ జాతిని సృష్టించి ఉంటాడు ఆ బ్రహ్మ...
అలల వడిలో ఆకాశమే కదలాడుతూ ఉంటుంది మరి మనసు కరగదా ఏమిటి ప్రేమ తడితో...!
వసివాడని ప్రేమ తలపులలో మూతపడవెప్పుడూ మనసు తలుపులు...!
అక్షరం మత్తిల్లుతోంది ప్రేమని గురించి రాస్తుంటే ఎంత చిత్రమో కదూ...
అనిర్వచనీయమే ప్రేమ... మదిమదికో నిర్వచనంతో...!
నా ప్రేమతపస్సులో ఏకమంత్రం నువ్వు...!

నీ...
...రేష్

Thursday, 31 July 2014

మృగాడినా... ఏమో మరి


ఓయ్ దేవుడా...

కొంచెం మా జాతిని అదే స్వామీ మగజాతిని అంతం చేసేయ్యవా... మగజాతి మొత్తాన్ని రాక్షససంతతిలా మగువలను మాత్రం ఎలాంటి పాపభావనలు లేని స్వచ్ఛమైన మానవత్వం పరిమళించే మనుష్యులుగా పుట్టించినట్లు ఉన్నావ్ కదా...

మా రాక్షస జాతి మొత్తం మగువలని కబళించక ముందే మమ్మల్ని అంతం చేసేస్తే నీ మీద కూడా నిందలు తగ్గుతాయి స్వామీ. నీ మీద నిందలు ఏముంటాయి అనుకుంటున్నావా ఏంటి స్వామీ.... నువ్వు మగవాడివేనట కదా... అందుకే మగ పక్షపాతివై ఉంటావని మా లోకంలో ఓ ఉవాచ...

అప్పుడెప్పుడో ఎవడో మనువు రాశాడట ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అని... నిజంగా ఆయన ఎవరో ఏమి రాసాడో తెలియదు కానీ యుగ యుగాలుగా మగవాళ్ళ ఆధిపత్యం కొనసాగిన మాట వాస్తవం. ఇప్పటికీ ఇంకా ఆ ఛాయలు ఉన్నమాట కూడా కఠోర సత్యం.

‘శతాబ్దాలుగా కనిపించని సంకెళ్ళేగా...అతివకు మనువేసిన అరదండాలు...!’

‘మృగవిన్యాసాలే మగతనం అనుకుంటూ కొన్ని మృగాలు_జనారణ్యం కదా మరి..!’

‘నువ్వెప్పుడూ నాకో శరీరానివే _ మనసుని చంపుకున్న మృ(మ)గాడిని కదా..!’

‘కాస్త నాలో అతివ మనసు ఒంపవూ _మద(గ) మృగాహంకారాలు మాయమవుతాయేమో..!’

అని రాసిన నేనే కొంచెం బాధ పడుతూ ఈ లేఖ రాస్తున్నాను అంటే మా ఆవేదన అర్ధం చేసుకోవాలి.

అవకాశం దొరికిన చాలా మంది మగవాళ్ళు మదగర్వంతో మృగాళ్ళుగా మారుతున్న మాట వాస్తవం... అంత మాత్రం చేత మగాళ్ళంతా మృగాళ్ళం కాదే...
నిజమే తరతరాలుగా మగవాడు స్త్రీ కంటే ఎక్కువ స్వాతంత్ర్యం, ఎక్కువ సౌఖ్యాలు... ఇంకా ఎన్నో ఎక్కువలు అనుభవిస్తున్నాడు. కాదని అనే వాడినే కాదు నేను.
కానీ భూమి మీద జరిగే ప్రతి అన్యాయమూ... ప్రతి అరాచకమూ మేమే చేస్తున్నామా...? 

ఒకనాడు అత్తలూ... ఇప్పుడు కోడళ్ళు... అత్తాకోడళ్ళ ఆధిపత్యం చేతులు మారుతూ... 

కానీ మారనిదల్లా ‘మగవాడి తలరాతే...’ ఇద్దరూ మమ్మల్నే అంటూ... కొడుకు మీద ప్రేమని చంపుకోలేక తల్లి... మొగుడు తనకే సొంతమనుకుని కోడలు మమ్మల్ని చవట దద్దమ్మలని చేస్తూ... ఇక్కడ కూడా నా కొడుకు సరైన వాడైతే... నా మగడు సరైన వాడైతే అంటూ మగవాడినే ఆడి పోసుకుంటూ.... అంతర్లీనంగా దీనిలోని అర్ధం ‘మా మగవాళ్ళం... అమ్మనో... భార్యనో ఏదో చెయ్యాలనే కదా’ మరి ఇందులో మగవాళ్ళ తప్పులు ఎంతవరకూ?

ఒక నిర్భయని అయిదుగురు మగవాళ్ళు అతి దారుణం గా మానభంగం చేసారు... కానీ అదే నిర్భయని రక్షించటానికి తను నగ్నం గా ఉన్నాడనే సంగతిని పట్టించుకోకుండా నిర్భయని రక్షించుకోవటానికి తాపత్రయపడిన ఆమె మిత్రుడు మగవాడే. వారి ప్రతి సమస్యనూ మేమూ సానుభూతితో చూస్తాం...

ప్రపంచంలో జరిగే ప్రతి ఆడ శిశువు భ్రూణహత్యకూ మగవాడే కారణం అనుకోవటం ఎంత పొరపాటు... ఇలాంటి విషయాల్లో మొత్తం కుటుంబాన్నే నిందించాలి కానీ కేవలం మగవాడిని కాదు. బిడ్డ విషయంలో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ప్రేమా అంతే గొప్పది... ఇందులో మరో మాటకు తావులేదు... నిజంగా భర్త ఆడపిల్ల వద్దు అన్నాడని బిడ్డను కడుపులోనే లేదా ఉయ్యాలలో పడగానే చంపుకుందంటే అది అమ్మ మనసు అని నేను ఎందుకు ఒప్పుకోవాలి... నిజమైన అమ్మ ప్రేమ భర్త ఆదరణ దక్కదేమో అన్న సంగతి ఆలోచించదు కూడా... మరి ఇందులో అర్ధం ఏమిటి... అక్కడ ఆ ఆడది భర్త ఆదరణ కోసం బిడ్డను చంపుకుని తన స్వార్ధం చూసుకుంది అనే కదా... మరి అందుకైనా తననీ నిందించాలి కదా...

ఒక రోజున ఒక తమ్ముడు ఒక అద్భుతమైన కవిత రాశాడు విఫలమైన ప్రేమ గురించి మగాడి దృక్కోణం నుండి ఆడదాన్ని నిందిస్తూ. అది నాకు చూపించి అడిగాడు ఎలా ఉందన్నా అని... ఇలాంటి కవితలకి ఏ ఒక్కరి కోణం నుండి రాయకుండా లింగ భేదం లేకుండా రాస్తే ఇంతకూ మించిన కవిత లేదు అని చెప్పాను.

అంటే ప్రపంచం లో అన్ని సమస్యలని లింగ భేదంతో చూడలేము... చూడ కూడదు కూడా... అలాగే చదువుతున్నారు కదా అని అన్ని సమస్యలని ఒకే కోణం లో ఒక్కళ్ళ మీదే నిప్పులు కక్కేలా ఉండకూడదు. అలా ఉంటే నాలాంటి సాధు’మృ’గాలని బాధిస్తాయ్...

ఒకటి చెప్పగలను ప్రపంచంలో కీచకులే కాదు శూర్పణఖలూ ఉన్నారు...
ఒక్క చేత్తో వెయ్యగలిగేది చిటికెలే... చప్పట్లు కొట్టలేం...

ఆడది మగాడిని మగాడు ఆడదాన్ని నిందించుకుంటూ ఎంతకాలం...? అన్ని తప్పులూ మగవాళ్లవేనా... మానభంగాలే కాదు అత్తింటి ఆరళ్ళు... భ్రుణ హత్యలూ కూడా మగాడి పుణ్యమే అనుకుంటూ...

ప్రతి మగాడిలో ఆడ మనస్సు, ప్రతి ఆడ దానిలో మగ మనస్సు సహజం... నేను మగాడిగా పుట్టి ఉంటే అనే ఆడవాళ్ళు ఎంతమంది లేరు..? అంటే పుట్టుక మారితే చాలు గానీ రాతలతో పని లేదు అనే అనుకుందామా?

మార్పు రావాల్సింది మగలోనే ఆడలోనో కాదు మనిషిలో... అమ్మ ప్రేమ కూడా కలుషితం అని వార్తలు వస్తున్న ఈ రోజుల్లో కూడా ప్రతి దానిలో మగవాడినే వేలెత్తి చూపిస్తూ ఉంటే సహజంగా మహిళా పక్షపాతులైన మగవారికి కూడా మనస్సు బాధించదా?

ఆడ మగా అనేది... నువ్వంటూ ఉండి ఉంటే నీ రాత... లేకుంటే ప్రకృతి లో ఓ భాగం... యుగాలుగా మగవాళ్ళ దాష్టీకం కొనసాగింది అనండి ఒప్పుకుంటాం... కానీ ఇప్పుడు కూడా ప్రతి దానికీ అకారణంగా నిందిస్తుంటే ఎందుకు ఊర్కోవాలి? ఎంత కోపం లో అయినా ఆడవాళ్ళతో పరుషంగా ఒక్క మాట అనలేని మా లాంటి మగవాళ్ళని నీలో కలిపేసుకో... మాటలు పడాల్సిన బాధ తప్పిపోతుంది.

ఇట్లు...


మగాడు (మృగాడినా... ఏమో మరి)

Tuesday, 29 July 2014

వెన్నెల కుసుమం - 14 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)

హనీ...
అందం, ఆనందం, ఆప్యాయత, ఆత్మీయత, అనుబంధం, అభిమానం, సౌహార్ద్రం, సౌశీల్యం, కరుణ, జాలి, ప్రేమ... ఇలా మరెన్నో మంచి గుణాలు కలబోసుకుని ఉన్నా కలహంస లాంటి కన్నెపిల్లవు నీవు.
తెలివి, విద్య, విజ్ఞానం, వినయం, వివేకం, తగుపాళ్ళలో కలసి కూర్చిన సజీవ జ్ఞాన శిల్పం నీ రూపం.
నీ దేహకాంతితో విశ్వమంతా వెలుగు కిరణాలే... కాంతిమయమైన నీయొక్క దేహపు వెలుగులో నాలోని తిమిర భావాలు మటుమాయం.
నీ పయనం.... రూపులేని గాలిలో అయినా... ఆకృతి లేని నీటిలో అయినా... మండుతున్న అగ్ని లోనైనా... అనతమైన గగనంలోనైనా... ఎల్లలు లేని ఈ పృథ్వి పైనైనా... తోడుగా నేనే నీ నీడనై నేనే...
పదునాలుగు లోకాల్లో ఎనలేని అందం నీదైనప్పుడు విశ్వంలో నీ శత్రువులు ఎంతమందో కదా... వారందరి నుండి నీ రక్షణ భాధ్యత నిన్ను చూసిన మొదటి క్షణం లోనే నీ అనుమతి కూడా లేకుండా తీసేసుకున్నా...
మన ప్రణయం...పల్లవించే పాటలా సాగటానికి నా ఊపిరిని నీలో తీసుకుంటా... వికసించిన గులాబీ లాంటి మన ప్రేమకోసం నా హృదయాన్ని నీ పరం చేసేసాగా...
జాబిల్లి జాలువార్చిన వెన్నెలనే నీ పయ్యెదగా చుట్టుకుని భారంగా నీవు నా పక్కన తిరుగుతుంటే నా మదిలో వాంఛలు రేగవా...
నీలి పరదాలపై ప్రతిఫలించే వెన్నెల కాంతి నీలి వెన్నెల సముద్రంలా అలలు అలలుగా పొంగుతుంటే నీ అద్భుతసోయగాల సంపద నాది కాదా...!
చందమామ కురిపించే వెన్నెల కిరణాలన్నీ కలసి కన్నెపిల్లగా మారితే ఎలా ఉంటుందో అచ్చు అలా... సజీవ వెన్నెల శిల్పంలా ఉన్నావు కదా ప్రియతమా...
చందమామ వెన్నెలకి తోడు ఎర్రచందనం అరువిచ్చిన పరిమళాలు... కస్తూరినడిగి తెచ్చిన సువాసన కలిపి ఒక అద్భుతమైన సౌందర్యరాశిగా నీకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆ బ్రహ్మ... ఓహ్... ఎంతటి మేధావి...!
నీ పరిమళాన్నే ఆస్వాదిస్తూ నిన్ను నా వెన్నెలకుసుమాలతో అలంకరిస్తూ...
నీ...
...రేష్

Monday, 28 July 2014

మామా చందమామా....


మామా చందమామా....

కుశలమా... నువ్వు కుశలంగా లేకుండా ఎలా ఉంటావ్ లే. 

కవులేమో నీ మీదే కావ్యాలు రాస్తారు. ప్రణయ జంటలేమో నీ వెన్నెల్లో కలిపోవాలన్నంతగా మురసిపోతారు. సముద్రుడు నిన్ను చూడగానే నిన్ను తాకుదామన్నట్లు ఎగసి పడుతుంటాడు. ఇలా లోకమంతా నీకోసం అర్రులు చాస్తుంది కదా... అందుకే నీకు బాగా పొగరు.

నెలకోకో రోజు పున్నమి అంటూ వస్తావ్. ఒక్క రోజు నీ మాయతో మమ్మల్ని మురిపిస్తావ్. మర్నాటి నుండి నీ చూపు మరలుస్తావ్. పక్షానికల్లా కంట కనపడవు. ఇదేమైనా న్యాయంగా ఉందా? 

నీ వెన్నెలంతా అరువు తెచ్చుకున్న ఆడంబరమే అని తెలిసినా నీకోసమే చూస్తున్నాం చూడు... అందుకు మమ్మల్ని మేమనుకోవాలి. 

అయినా నీకంత పొగరు పనికి రాదు... ఎందుకో తెలుసా...

కవులు కావ్యాలు నువ్వు లేకపోయినా రాసేస్తారు. ఇక మనుషులు అంటావా? వాళ్లంత స్వార్ధపరులు వేరే వాళ్ళు ఉండరు. వాళ్ళకి వెన్నెలే అవసరం లేదు నియాన్ లైట్ల వెలుతురు చాలు. ఇక సముద్రుడు అంటావా... ఆయనవన్నీ పై పై ఉరకలే... లేస్తూ పడుతూ ఉంటాడు. అది కూడా బయటే... లోపలికెళ్ళి చూసామా ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు.

ఇలాంటి వాళ్ళని నమ్ముకుని నీ పొగరు చూపిద్దామనుకుంటే నీ పని అంతే స్వామీ... 

ఓయ్... మరీ ముఖం అంత చిన్నబుచ్చుకోకు... వాళ్ళంటే స్వార్ధపరులు... కేవలం నీకోసమే ఎదురు చూసి నువ్వొచ్చినప్పుడే వికసిస్తూ నేనంటూ ఒకదాన్ని ఉన్నాను నీకు... జీవితమంతా నీళ్ళల్లో తడుస్తూ నువ్వెప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తూ, నేను ఉన్న కొలనులో నా పక్కనే నీ ప్రతిబింబం కోసం కొంచెం జాగా కబ్జా చేస్తున్నా...

రోజూ పున్నమి ఐతే ఎంత బాగుండు... నిన్ను రోజూ చూసుకోవచ్చు...

నీ కోసమే తపించే

నీ

కలువ బాల 

P.S. : నువ్వు ఉన్నంత సేపు కాస్త ఆ మేఘుడిని పక్కకి జరగమని చెప్పు, లేకపోతే నిన్ను తనివి తీరా చూసుకోవటం కుదరదు.



Friday, 25 July 2014

మహారాజశ్రీ పాలకుల్లారా...

మహారాజశ్రీ పాలకుల్లారా...
అంతా క్షేమమే కదా... ఏదో అడగాలని అడుగుతున్నాం కానీ మీరెప్పుడూ క్షేమమే లెండి... మాలాంటి అభాగ్యులే క్షణ క్షణం బతుకుతో పోరాటం చేస్తూ మిమ్మల్ని అందలాలు ఎక్కిస్తూ మాకు ఏదైనా అవసరం వస్తే మీ గుమ్మం దగ్గర కాపాలా కుక్కల్లా పడిగాపులు కాస్తూ మీ దయగల చూపులు మా దరిద్రజీవితాల మీద ఎప్పుడు ప్రసరిస్తాయా అని ఎదురు చూసే అభాగ్యులం.
అయినా ఇప్పుడా గొడవంతా ఎందుకులే గానీ అసలు విషయం లోకి వస్తున్నా...
పాపం ముక్కుపచ్చలారని చిన్నారులు కేరింతలు కొడుతూ బడికి వెళుతుంటే వాళ్లకి బతుకు గేటు మూసేసి చావు పల్లకీ ఎక్కించిన పుణ్యాత్ములు కదూ మీరు? పాప పంకిలమైన ఈ లోకంలో అభం శుభం తెలియని చిన్నారులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని వాళ్ళని త్వరగా స్వర్గలోక వాకిళ్ళలో నిలిపిన ఘనులు మీరు.
కాపలా లేని క్రాసింగ్ అనేది రైల్వే వాళ్ళ తప్పు అని రాష్ట్ర పాలకులు... మేము కూత బాగా పెట్టుకుంటూ వస్తున్నాం ఆ బస్సు డ్రైవర్దే తప్పు అని కేంద్ర రైల్వేమాత్యులు... రోజూ వచ్చే డ్రైవరూ కాదూ రోజూ వెళ్ళే దారీ కాదు అని ఇంకొకరు... ఇలా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు నెపం వేసేస్తుంటే ఒక దారుణానికి ఇన్ని నిజాలు ఇన్ని ఇజాలు ఉంటాయా అని నిర్ఘాంత పోవటం మాలాంటి సామాన్యుల వంతు అయింది. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి సమస్యలోనూ అంతే.
మాలాంటి సామాన్యులు మసిలే పల్లెల్లో వాడల్లో ఉండే సమస్యలు కూడా మాలాగే అతి సామాన్యమైనవే... కానీ ఈ మాత్రం సామాన్యమైన సమస్యలు తీర్చే నాథుడు కూడా లేక చిన్న చిన్న సమస్యలే దీర్ఘకాలంలో అతిపెద్ద సమస్యలుగా మమ్మల్ని కబళించే పాలిత ప్రాంతాల్లో వసిస్తున్నాం మేము.  
చెప్పుకోవటానికి ప్రజాస్వామ్యమే... మా గల్లీల్లో తిరిగే వార్డు మెంబరు నుండి మీ ఢిల్లీ లో తిరిగే కేంద్రమంత్రుల వరకూ స్థాయీ భేదాలు వేరేమో కానీ మనస్తత్వాలు మాత్రం ఒక్కటే. కుర్చీలో కూర్చున్నంత కాలం మనమెలా బాగుబడదాం అని చూసుకోవటమే కానీ మనం సేవకులుగా చెప్పుకుని గద్దె ఎక్కాం మనల్ని నమ్మిన జనాలకి కొంచెం అయినా మంచి చెయ్యాలి అనుకుంటే దేశవ్యాప్తం గా ఉన్న కాపాల్ లేని రైల్వే క్రాసింగ్ లాంటి సమస్యలు పరిష్కరించటానికి  సర్పంచ్, MPTC, ZPTC లాంటి చిన్న స్థాయి నాయకులే చాలు... కానీ చొరవ ఏదీ? తమ వర్గ ప్రయోజనాలు చూసుకోవటానికి వారి కోసం పైరవీలు చెయ్యటానికే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది.
ఎక్కడి ప్రాంతీయ సమస్యని అక్కడి ప్రాంతీయ నాయకులే చొరవతీసుకుని రాగద్వేషాలకి అతీతంగా భావించి చూస్తే స్థానిక సమస్యల పరిష్కారాలు ఎంత సేపు?
మీకు తోడుగా ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే మీడియా మరో వైపు. పేజీలకి పేజీలు  గంటలకి గంటలు ఒకే వార్తను అనేక రకాల విస్లేషణలతో మనకి అందించే మీడియా సంస్థలు వత్సరాలుగా పరిష్కంపబడని చిన్న సమస్యలని పట్టించుకుని కొద్దిగా చొరవ తీసుకుంటే ఇలాంటి సమస్యల పరిష్కారం ఎంత సేపు?
నిన్న జరిగిన ప్రమాదం ఒక్కటి చాలు పాలకులు వత్సరాలుగా ఎంత దారుణంగా పాలిస్తున్నారో చెప్పటానికి... ఎలాగంటారా?
అసలు ఆ చిన్నారులు బతుకు సాగుతున్న పల్లెని వీడి మండల కేంద్రాల్లో ఉన్న కార్పోరేట్ పాఠశాలలకి వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది సర్కారు పాఠశాలల పనితీరు బాగుంటే... తన బిడ్డల భవిష్యత్ కోసం రెక్కల కష్టంచేసే కూలీ సైతం  ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలని చదివిస్తున్నారంటే విద్యారంగంలో మీ పాలకుల నిర్లక్ష్యం కనిపించటం లేదూ...?
సర్కారు పాఠశాలల పనితీరు బాగుండి ఉంటే ఉన్న ఊళ్లోనే చదువుకుంటూ ఉండేవారే కానీ... ఇలా పక్క ఊళ్ళో చదవటానికి బస్సెక్కి వెళుతూ రైలు బండి బారిన పడే వారు కాదు కదా ఆ చిన్నారులు.
ఇలా తవ్వుకుంటూ పోతే ఎక్కడెక్కడ జరిగే ప్రతి ప్రమాదం లో / ఉత్పాతంలో  పాలకుల నిర్లక్ష్యం... పాలితుల నిర్వేదం కలగలిపి నేటి నవీన భారత సమాజం...
ఇకనైనా కొంచెం మారతారని ఆశిస్తూ

పాలితుడు