Wednesday, 6 August 2014

నా నీకు... నీ నేను

ఏరా హనీ బాగున్నావా...

పక్కనే ఉన్నా బాగున్నావా అని అడిగే అంత దూరం మన మధ్య ఎప్పుడు వచ్చిందిరా? రోజూ చూసుకుంటున్నా ఒకరినొకరం చదవలేని శూన్యం ఎప్పటి నుండి మనలో...?

నీలోనుండి నన్ను... నాలోనుండి నిన్ను... ఒకరిని ఒకరం చూసుకోవటం ఎప్పుడు ఆపేశాం అంటావ్? అందుకే కదూ ఈ నిర్వేదం... 

నీతో కలిపి వెన్నెల్లో స్నానం చేసి ఎన్నాళ్ళయ్యింది? మనమిద్దరం కలసి మలయసమీరాలని స్పృశించి ఎన్నాళ్ళయ్యింది. 

నన్ను నిండుగా నీ నవ్వుల్లో తడిపి ఎన్ని రోజులు? నిను నేను మనసారా నా గుండెలకి హత్తుకుని ఎంత కాలమయ్యింది?

నీ నిశ్శబ్దాన్ని చూస్తూ నేను... నా మౌనాన్ని చదువుతూ నువ్వు ఎన్నాళ్ళిలా

రెప్పల గూట్లో దాచేసిన కలలన్నిటినీ నిజం చేసుకునే రోజుల కోసం నిరంతర ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ నీ కను రెప్పల వాకిట్లో నీటి చెలమలా మారుతున్నానని ఏనాడూ అనుకోలేదు.

ఒక్కోసారి కన్నీరు జీవితానికి ఎంత ధైర్యం ఇస్తుందో తెలుసా... జీవితంలో మనిషి తడి ఇంకా మిగిలి ఉందని గుర్తు చేస్తూ. నీ కన్నీటి తడి చాలురా... నా గుండెల్లో జడివాన కురియటానికి...

స్తబ్ధమయిపోయిన మనసుల్ని కరిగించే శ్లోకంలా  నీ అశృధార నను ముంచేస్తుంటే నా ప్రాణం నిలుస్తుందంటావా...?

పొడి పొడి మాటల పలకరింపుల్లో... హృదయంలో చెలమల చెమరింపులుంటాయని తెలుసుకోలేని వాడిని కాదు కదరా నేను.

అయినా నాలో ఉంది నువ్వురా... నేనెప్పటికీ నీ కళ్ళల్లో వెలుగులా ఒదిగిపోవాలి అనుకుంటాను కానీ నీ కంటి జలపాతాలలో ఈత కొట్టాలనే సరదా పడతానా?

నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాను అనిపిస్తే నన్ను నిలదియ్యకపోవటం నీ తప్పుకాదూ?  

అయినా గానీ ఈ తప్పుల గొడవ ఇప్పుడు వద్దులే... మనసుల్ని చదవటం ఆపేసి తప్పుల్ని చదువుకుంటూ వెళుతుంటే తగాదాలలో ముందుంటామేమో కానీ కోల్పోతున్న జీవిత మధుర్యాన్ని వెనక్కి తెచ్చుకోలేము కదా... 

ఎంచటాలకి మంగళం పాడేసి... పంచుకోవటం మొదలు పెడదాం మళ్ళీ మరింత కొత్తగా...

కళ్ళు చదివినది అర్ధం కాని చోట నిశ్శబ్దాలమౌదాం... నిరతమూ నిఘంటువుల్లా మనసు అర్థాలను చేరవేసుకుంటూ...   

నాలో నిన్ను ఒంపేసుకుని... నన్ను దాచేసుకుని నువ్వై కనిపించినప్పుడు నువ్వూ అలాగే చేస్తూ లోకానికి మనం దొరికి పోయిన ఆ తీయని రోజులని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రయాణం చేద్దామా... జ్ఞాపకాల వీధుల్లో కాదు సుమా... వర్తమానపు వలపు వాకిళ్ళలో... 

నువ్వు సడి చేస్తుంటే నేను సవ్వడినవుతా... నువ్వేసే అడుగులకి నే పాదరక్షని అవుతా...

నీ గోరు వెచ్చని అధరాల స్పర్శతో నా ఉదయం మొదలైతే మన రోజంతా మధురం కాదా?

సుప్రభాత వేళల్లో సువాసనలు చిందించే పొగలు గక్కే కాఫీని ఒకే కప్పులో నువ్వో గుటక నేనే గుటక వేసుకుంటూ కళ్ళతో ఊసులాడుకుంటూ... ఓహ్ తలచుకుంటే నీకు ఆ ప్రభాత వేళని స్పర్శించాలని అనిపించటం లేదూ...?

వాడిన నీ పెదవి పూలూ వికసిస్తాయి నా ప్రతి క్షణాన్ని నీలో లీనం చేస్తుంటే...

నా నిండు జాబిలిని నిర్లక్ష్యం చేసుకుని అమావాస్య లాంటి జీవితగమ్యం కోసం గమనం చేస్తున్న నా ప్రయాణాన్ని అర్ధంతరం గా రద్దు చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాగా... నీ మదిలో నవ్వుల పువ్వులు  విరబూస్తాయని చెప్పూ... మన మధ్య దూరం నాలుగడుగులు ఐతే ఆ నాలుగు అడుగులూ నేనే వేస్తా...

ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడు... నీ జీవితానికి నమ్మకాన్ని అవుతా...

ఎప్పటికీ

నీ

...రేష్  

3 comments:

నాలుగడుగులు కాదు దూరం ఏడడుగులు అనుకుంటా,
ఎంత వెనక్కి వచ్చినా....,వెనుకున్న బంధాలు ముందుకొస్తాయి.
పురుష స్వార్దం కనిపిస్తుంది.(కామెంట్ పబ్లిష్ చెయ్య్యొద్దు )

(ఈ వాఖ్య పంపిచిన వారు వారి కామెంట్ ని పబ్లిష్ చెయ్యవద్దు అన్నారు కాబట్టి.. వారిని అజ్ఞాతం లో ఉంచి కామెంట్ ని మాత్రం పబ్లిష్ చేస్తున్నా... నెగటివ్ కామెంట్ కాబట్టి పబ్లిష్ చెయ్యలేదు అనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వటం నాకు ఇష్టం లేదు )

ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడు, నీ జీవితానికి నమ్మాకాన్నవుతా..,
పై వాఖ్యలు మనస్సుని కదిలిస్తాయి, కానీ అవకాశం ఇస్తే రాదు, అది మన రాతలో ఉండాలి, చేజారిన క్షణాలే అపురూపంగా ఉంటాయి.

సురేష్ గారూ, మానసిక సంఘర్షణ చాలా అద్భుతంగా రాశారు.

Post a Comment