Monday, 4 August 2014

వెన్నెల కుసుమం - 15 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)

హనీ...
చిరుగాలుల సవ్వడిలో వినిపిస్తున్న కోయిల గానం నీ కంఠ మాధుర్యం కన్నీ ఏమంత బాగుంటుంది అంటావ్? తొలకరి చిరు జల్లుల సందడిలో నాట్యమాడే మయూరము నిన్ను చూసి తాను నేర్వని నృత్య భంగిమలు నేర్చుకోవాలని అంటున్నది.
ఓ వెన్నల కన్యా... నీ నెలరాజుని నేనేలే..!
పృథ్విలోని పసిడికి అమరావతి నగరపు అమరులు తాగే అమృతాన్ని కలిపి పార్థసారధి శ్రీకృష్ణుడు ఇచ్చిన పారిజాత పుష్ప పరిమళాలు రంగరించి భూమాతకే వరమైన ప్రకృతిని నీలో ఒంపుసొంపులుగా మార్చి గులాబీల సున్నితత్వంతో మందారాల మృదుత్వంతో నీకు ప్రాణ ప్రతిష్ఠ ఈ ఆవని పైకి కానుకగా పంపాడు కదా ఆ బ్రహ్మ...
గ్రీకుల అందాల దేవత వీనస్, హిందువుల అందాల దేవత రతి నిన్ను చూసిన తరువాత తాము అసలు అందాల దేవతలమేనా అని ప్రశ్నించుకుంటారేమో...!
ఓ ప్రియతమా...
ఏమని చెప్పను నా మనసు చెప్పుతున్న మౌన సందేశం.? ఎలా తెలపను నా హృదయం చిత్రిస్తున్న రూపం నీదని. నా మది నీకోసం పదే పదే పలవరిస్తుంది.
ప్రాయం వాడినా ప్రేమ వాడదు అని భావించే నా మనసు నీ ప్రేమ కోసం ఎన్ని జన్మలకైనా ఎదురు చూస్తుంది.
ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే కదూ... ప్రపంచం లో ప్రతి మనిషికీ మనసు ఒకటి ఉంది అని గుర్తుకు వచ్చే సందర్భం ప్రేమతోనే కదూ...
అక్షర జ్ఞానం లేని వాడు కూడా నిర్వచనం ఇవ్వగలిగేది ప్రేమనే... సకళ కళా పండితోత్తముడైనా నిర్వచించలేనిది కూడా ఆ ప్రేమనే...
నా ప్రాణాలనైనా ఇస్తాను కానీ ప్రేమను మాత్రం విడవను. అంత పరితపించ పోవడానికి ప్రేమలో ఏముందో! ఏమో మరి..!
దేవదాసు పార్వతికి ఏమని చెప్పినాడో... రోమియో జూలియట్లు ఏమని సంభాషించుకున్నరో... లైలా మజ్ను, సేలం అనార్కలిల ప్రేమలు ఎలా అజరామమయ్యాయో... వారిని అడిగి కనుక్కుందామంటే వారు సజీవులు కాదే... ముంతాజ్ కు ప్రేమ చిహ్నం గా షాజహాన్ సమర్పించుకున్న తాజ్ మహల్ గుండె నడిగితే తెలుస్తుందేమో ప్రేమంటే...!
ప్రేమంటే ఒక తపస్సు... ఒక ఉషస్సు... ప్రేమకు జగమంతా ఆశిస్సు...
ప్రేమకు పల్లవి ప్రేమ
ప్రేమకు చరణం ప్రేమ 
ప్రేమకు రాగం ప్రేమ 
హృదయసరాగం ప్రేమ
మనసుగీతం ప్రేమ 
మరువ లేనిది మరువ రానిది ప్రేమ...
మనసుని మనసు స్పృశిస్తే పుట్టేది ప్రేమ... గుండెను గుండె తాకితే కలిగే భావం ప్రేమ...

ఓ ప్రియురాలా...
నీకు ప్రేమ గొప్పతనం తెలుసా... లేని మనిషిని కూడా అనుక్షణం కలల్లో చూపించే శక్తి దేనికైనా ఉంది అంటే అది ప్రేమకే... నీవు లేనప్పుడు కూడా అనుక్షణం నీ ఊహలలో జీవిస్తున్నాను అంటే అందుకు కారణం నీపై నా ప్రేమే కదూ...
ప్రేమలో పడిన వారే కాదు ప్రేమంటే ఇష్టం లేని వారు కూడా అనుక్షణం తలచుకునేది కూడా ప్రేమనే... ఏంతో చిత్రం కదూ...
దేవుడు ప్రేమ అనే వరాన్ని మనిషికి ఇవ్వటం మానవ జాతి చేసుకున్న పుణ్యం కదూ... అసలు ప్రేమలో ఉన్న మాధుర్యం చవి చూపతానికే మానవ జాతిని సృష్టించి ఉంటాడు ఆ బ్రహ్మ...
అలల వడిలో ఆకాశమే కదలాడుతూ ఉంటుంది మరి మనసు కరగదా ఏమిటి ప్రేమ తడితో...!
వసివాడని ప్రేమ తలపులలో మూతపడవెప్పుడూ మనసు తలుపులు...!
అక్షరం మత్తిల్లుతోంది ప్రేమని గురించి రాస్తుంటే ఎంత చిత్రమో కదూ...
అనిర్వచనీయమే ప్రేమ... మదిమదికో నిర్వచనంతో...!
నా ప్రేమతపస్సులో ఏకమంత్రం నువ్వు...!

నీ...
...రేష్

0 comments:

Post a Comment