Monday, 11 August 2014

వెన్నెల కుసుమం - 16 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)


హనీ...

ఓ బ్రహ్మ మానస పుత్రికా...

అవును నువ్వు బ్రహ్మ మనసులో ఉద్భవించిన అద్భుత భావానికి రూపం నీవు. నీ ప్రేమను పొందే అదృష్టం నాకు మాత్రమే కల్పించిన ఆ సృష్టికర్త నిజంగా ఎంత మంచి వాడు?
తాను సృష్టించిన సరస్వతి దేవిని తానే వివాహ మాడిన ఆ బ్రహ్మ... నీ లాంటి అద్భుత సౌందర్యాన్ని మాత్రం సాధారణ మానవుడిని అయిన నాకు కానుకగా ఇచ్చాడంటే అది నా అదృష్టమా... బ్రహ్మ నాకిచ్చిన వరమా?

నీ అందాన్ని చూసి ఒక్కోసారి ఎంత భయం వేస్తుందో తెలుసా... ఎందుకంటావా.. ‘దేవతలు అసలే సౌందర్యారాధకులు. అలనాడు దమయంతిని పొందటానికి ఎన్ని ఎన్ని ఎత్తులు వేసారు... ఎన్ని పాట్లు పడ్డారు? అలాంటి వారు మళ్ళీ నిన్ను చూస్తే నీ కోసం అమరావతిని వదిలి అవని మీదకి వచ్చేసి నిన్ను పొందటానికి నన్ను అడ్డు తొలగించడానికి ఏ కుయుక్తులు పన్నుతారో అని...’

నాకేమవుతుందో అన్న భయం లేదు నాకు ఒక్క క్షణమైనా నీ ఎడబాటు భరించలేని నాకు నిన్ను ఎక్కడ దూరం చేస్తారేమో అనే భయం మాత్రమే... అంతలోనే ‘వాళ్ళు నన్ను ఏమి చెయ్యగలరులే’ అన్న ఆలోచన కూడా వచ్చేసిందిలే...

రాక్షసుల ధాటికి తట్టుకోలేక అస్తమాటికి విష్ణుమూర్తి పంచన చేరే పిరికి వారు కదా ఆ అనిమిషులు. అయినా మన ప్రేమ శక్తి ముందు అమరుల అద్భుత శక్తులన్నీ దిగదుడుపే కదూ. ప్రేమ శక్తితోనే కదా సత్యభామ కోరికపైనే కదా పారిజాత వనాన్నే భూమి పైకి తీసుకుని వచ్చాడు ఆ శ్రీకృష్ణుడు దేవేంద్రుడిని ఓడించి.

బ్రహ్మ అపురూప సౌందర్య లావణ్య రాశిగా నిన్ను సృష్టిస్తే... నిన్ను వర్ణించే అదృష్టాన్ని నాకు కల్పిస్తున్న కరుణా మూర్తి ఆ సరస్వతీ మాత. నిజం గా ఆ సరస్వతీ దేవిని నేను ఎంతో ఋణపడి ఉన్నాను. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద నిన్ను వర్ణించే అదృష్టం నాకు మాత్రమే కలిగించి ప్రతి అక్షరం లోనూ అమృతపు చినుకులని కురిపిస్తున్న ఆ మూర్తికి నేనేమి ఇవ్వగలను భక్తి పూర్వకంగా ఒక్క నమస్కారం తప్ప...

ముత్యాల రాశి నుండి ఉద్భవించిన ముద్దు గుమ్మవు కదూ... ఎంత మంది అమర మూర్తుల ఆశిస్సులు ఉన్నాయో కదా నీకు...

ఓ క్షణం... బ్రహ్మ మానస పుత్రికలా
మరో క్షణం... దేవ కన్యలా
ఇంకో క్షణం... గాంధర్వ బాలలా
సాగర కన్యలా
వెన్నెల రాణిలా 
జాబిల్లి తునకలా 
ప్రకృతి పడతిలా 
పసిడి బాలలా 
బాపు బొమ్మలా
నవలా నాయికలా

ఇలా ఎన్నో ఎన్నో రూపాలు... అన్నీ నీవే. అమ్మో ఇంకా రాయాలంటే చాలా ఉన్నాయి.

నీ హృదయపు శృతిలయలు నా మనసున సరిగమలు
నీ పరువపు పదనిసలు నా ఎదలో మధురిమలు
నా మదిలోని తలపులు నా హృదిలోని వలపులు
నా మనసంతా తపనలు అన్నీ నీ కొరకే ప్రియా

నా నువ్వే కదూ...

నీలిమేఘ పరదాలలో నీలిమవై 
నీలాల నింగి నీడల్లో అందాల ప్రతిమలా 
మాటలు నేర్వని నిశ్శబ్దమాలికవై 
చిరునవ్వుతో మతులు పోగొట్టే అందాల దీపికగా

నన్ను మురుపిస్తూ మైమరపిస్తూ నా కళ్ళల్లో శాశ్వత మెరుపువయ్యావ్....

నీ...
...రేష్

0 comments:

Post a Comment