మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 9 January 2016

అప్పుడప్పుడూ ఒక చినుకు - 3


పువ్వులూ, చెట్లూ, పక్షులూ, జంతువులూ , రాళ్ళూ రప్పలూ ..
ఇవేవీ  ఇంకా దేవుణ్ణి కనిపెట్టలేదు.. 
కొండొకచో తామే దైవాలయ్యాయి గానీ. 

వీటన్నిటికీ ఆలోచనలు మొదలైతే ప్రకృతిని పరవశిస్తాయి గానీ  అవి దేవతలనో దేవదూతలనో  కనిపెట్టవు. కనీసం వాటికవి  పేర్లు కూడా పెట్టుకోవు.  ఏ వాంఛల్లో మునకలెయ్యవ్. వాటి ఆలింగనాలన్నీ ఈ ప్రపంచానికి ఆరోగ్యవంతమే. 

వాటన్నిటితో పోలిస్తే మనిషి ఎంతటి అవివేకి.. తన వివేకంతో సృష్టించున్న మతాలలోనే శలభంలా కొట్టుకుంటూ…!  

దేవుడి పేరుతో తమ జాతినే చంపుకునే ఏకైక జీవి కూడా మనిషే. కాదంటారా?

ఎప్పటికీ మనిషి ఒప్పుకోని నిజమొకటే..

మనిషంటే  మతమని..  మతమంటే మారణహోమమని.  మృత్యుహేల మొదలైతే  ఆపే ఆపద్భాందవుడంటూ ఎవడూ లేడని...

ఏదైతేనేం నాకర్ధం అయ్యిందొక్కటే.. ఆలోచన  పుట్టటమే  మనిషన్నవాడికి శాపంగా మారిందని, మస్తిష్కమే  మనిషికి  మరణ శాసనమయ్యిందని.  

ఓ గడ్డి పువ్వు ఆలోచించటం నేర్చుకుంటే 
ప్రకృతిలో తనకో బాధ్యత ఇవ్వబడిందని 
దానిని తను మాత్రమే నేర్చాలనే 
నిజాన్ని గ్రహిస్తుందేమోగానీ  
దేవుళ్లనో.. 
దైవకుమారులనో కనిపెట్టదనుకుంటా 

అనంత విశ్వాన 
దేవుడి ఉనికికి ఊపిరద్దింది 
మనిషి కాక మరెవరని 
మరే జీవికైనా 
దైవం గురించి ఏమి తెలుసని 

మనిషి తన విజ్ఞానంతో 
సృష్టించుకున్న అజ్ఞానపు అంధకారం  
మతం  
అదే కదా
తన నాగరికత అభిమతాలన్నిటికీ కేంద్రకం
తన జాతి విచ్చిన్నతకి ఆరంభం 
ఎంత విచిత్రమో కదా ఈ వినాశనం

Thursday, 7 January 2016

ఆ కొంచెం కాలం మళ్ళీ కావాలి



నాకు అక్కడే మిగిలిపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది
నిన్నటి  కాలం లోకి ప్రయాణం స్థిరం చేసుకుంటున్న క్షణాలు
ఇప్పుడు నన్ను తడుతున్నాయ్
అక్కడికి వెళ్ళాలో
మరి ఆ కాలం
ఇక్కడకి  వస్తుందని ఎదురు చూడాలో
తెలియని అయోమయం
నన్ను నాకు అస్పష్టంగా దృశ్యిస్తుంది
ఇప్పుడిక్కడ మిగలాలంటే నాక్కొన్ని మాటలు కావాలి
ఏవో కొన్ని మాటలు కాదు
నీ గొంతునుండి మనవైన మాటలు
నిన్నూ నన్నూ మనంగా మార్చిన ఆ కొన్ని మాటలు

మనకంటూ కొన్ని నిమిషాలని మోసుకురాలేని రోజులు
ఎంత ఘనంగా సాగిపోతేనేం
ఒకరికొకరిని మళ్ళీ మిగల్చగలవా అంటూ
ప్రశ్నించలేని ప్రేమ  ఒకటి అక్షరంగా  ఆక్రోశిస్తుంది
ఎంతగా సమాధానం చెప్పుకున్నా అప్పటి నువ్వు ఇప్పుడు లేవన్న నిజం
గుండెని మెలితిప్పుతున్న సత్యం ఎక్కడ దాచుకోవాలి?

ఇప్పుడు ఆ కొంచెం కాలం మళ్ళీ కావాలి
మనవైన క్షణాలని మోసుకుని నడచిన
ఆ కొన్ని వేళలనీ నింపుకున్న నిన్నటి కాలం
అనంతంగా చలించాలి ఈ నా చిన్ని గుండెలో


Wednesday, 6 January 2016

అప్పుడప్పుడూ ఒక చినుకు - 2




దేనికోసమో తపన పడుతూ 
తనకు తాను దూరం అవుతున్న ప్రయాణం చేస్తూ 
ఈ నాగరికత సాధించింది ఏమిటంటే 
ఒక ప్రపంచం నుండి మొదలెట్టి 
1460  కోట్ల  ప్రపంచాలుగా  విస్తరించడం 
మరి ఇప్పుడు
ప్రతి ‘నేనూ’ 
రెండు ప్రపంచాలు కదా
అంతా తానైన భ్రమల ప్రపంచమూ 
అణువణువూ తనదైన కలల ప్రపంచమూ

తుషార ధూపం



ఒక  హేమంతపు తుషార ధూపం 
గుండెని కాస్త తడిపి వెళ్ళిందనుకుంటా 
నిన్నటి వ్యధలన్నీ నిశ్శేషమయ్యాయి 
ఒక పరిచయాన్ని సశేషం చేస్తూ 

బహుశా అప్పుడేనేమో 
ఒక చిన్ని పువ్విక్కడ రాలిపడినట్లుంది  
ఇక్కడంటే ఇక్కడే 
ఈ పిడికిటంత హృదయంలో

అప్పుడొక నిశ్శబ్దాన్ని జాలువార్చుతూ 
పరిమళమొకటి పరవశంగా 
ప్రవహించటం మొదలయ్యింది 
నాకింకా పరిచయమవ్వని 
కొన్ని నవ్వులని వశీకరించుకుంటూ 
నీకు నన్ను వశం చేస్తూ 


Tuesday, 5 January 2016

నిశ్శబ్దపు పుట్టుక


నిన్ను కనుగొన్నచోటే 
నీలో కరిగిపోయిన నా ఊపిరికి చెప్తుంటాను 
నాకెప్పుడూ 
నువ్వొక విజాతి ధృవానివని
అందుకే నాకో అయస్కాంతకేంద్రమయ్యావని 

వద్దనుకుంటాను నిన్ను 
నిన్నే వెదికేసుకుంటూ 
అసలు నువ్వేంటో 
నీకు  నేనేంటో మరచిపోయిన  
కొన్ని కాలాలని చెరిపెయ్యాలని  ఉంది 

నువ్వు విరామంగా మారిన ఆరామంలోకి 
తొంగి చూస్తున్నప్పుడల్లా 
క్షణమొక కృష్ణబిలమై నా వేళల్ని అదృశ్యం 
చేస్తున్న దృశ్యాన్ని 
నీ అనుభూతిలోకి తేవాలని ఉంది 
నువ్వు విసిరేసిన జ్ఞాపకాలని అక్షరం చేస్తూ 

జ్ఞాపకాల జట్టులో మరో స్మృతి చేరబడినప్పుడల్లా 
గుండెకంటుకున్న తడి శ్వాస మోత బరువు  
కంటినిండా పరచుకుంటున్న సవ్వడి వింటూ 
కరిగిపోతున్న కాలంలోకి జారిపోతున్న క్షణాల రంగంలో 
మనసుల నగ్నత్వాల అలజడి ఉరకలెత్తేచోట 
ఒక ఖాళీతనంలోకి జారిపడుతున్న దేహాల అలికిడికి
అప్పుడప్పుడూ కొన్ని నిశ్చలతలు తప్ప 
పెద్దగా అవరోధాలేమీ ఉండవు 
లోకంతో పాటుగా ప్రవహించటానికి
ఒక నిశ్శబ్దపు పుట్టుకగా మనం మొదలవ్వటానికి

మార్మికం



తెరిచి ఉన్న కళ్ళల్లో
తెరలు తెరలుగా పేరుకున్న
భ్రమలన్నీ మార్మికాలని తెలిసాక
మూయని కన్నుల్లో
కలలు ఎంతకీ మొదలవవని తెలియని పసితనం లేదక్కడ

పడకేసిన నీడల్ని
అలికేసుకున్న తిమిరపు చావడిలో
తలగడనిండా వెతలు కురుస్తూ
రాత్రి ఎంతగా తడిసిపోతేనేం
ఏ ఖాళీతనమూ ఖాళీ అవ్వలేదక్కడ

మిణుగురు పూలవానలో
నానిపోతున్న రహదారికి
తెలిసిన నిజంలోకి
త్రుళ్ళిపడ్డాక తెలిసింది
అక్కడ వెలుగన్నదేదీ అద్దుకోలేదని   

చెకుముకి రాళ్ళ ఘర్షణలో
రాలిన నిప్పుతునకకేం తెలుసు
రగల్చటం మొదలు పెట్టింది తానేనని
ఇప్పుడిక రంగమంతా తనదేనని
ఇక భవిష్యత్తంతా భస్మ తాండవమేనని…

భగ్గుమంటున్న నిప్పుల్లో వెలుగుని సంగ్రహిస్తూ
ఒక పసితనాన్ని నింపుకునే  ఖాళీతనం కోసం
ఎడతెగని నిరీక్షణలో
నన్నద్దుకుంటున్న గాలిని సుడి తిప్పుతూ
మేఘాల్ని దాటని వానని కళ్ళల్లో నింపుకుంటూ
తళ తళ లాడే మెరుపులని ఊహలుగా నింపుకుని
నడిచేస్తున్నా అన్వేషినై మిథ్యా ప్రపంచాన

Saturday, 2 January 2016

పట్టా


ఏదైనా రాయాలిప్పుడు
అవును.. 
ఏదైనా సరే రాయాల్సిందే 

మనసు కదలకపోయినా 
చేతుల కదలికలు యాంత్రికమవ్వాలి 

జీవన పంజరంలో బతికేస్తూ 
పావురపు స్వేచ్ఛ గురించి 
అక్షరాలని రెక్కలకి కట్టి అలా అలా ఎగరవెయ్యాలి

నవ్వు మెదలక పోయినా
పెదాలు విడివడాలి 

తడి అద్దుకోకున్నా
కంటి చుక్క చెక్కిలి దాటాలి 

సంతోషాన్నెప్పుడూ 
దుఃఖంతో మచ్చిక చేసుకోవాలి 

మనసుకీ  మనసుకీ మధ్య 
ఎడారులు కొన్ని పరచుకోవాలి 

యుద్ధమే కాదు 
యుద్ధరంగమూ నీదై ఉండాలి

అస్థిత్వపు అర్ధాన్ని వ్యర్ధపరచుకుంటూ 
మేధావిగా మారి లోకానికి నీతులు నేర్పాలి 

ఎక్కడికక్కడ అప్పటికప్పుడే
కొనుగోలుదారునిగానో, అమ్మకందారునిగానో 
ద్విపాత్రాభినయం చెయ్యాలి

నీ రహితంగా నువ్వు బతకాలి లోకరీతిని కౌగిలిస్తూ
పట్టాపొందాలి నవమానవుడిగా పట్టాభిషిక్తుడవౌతూ.. ప్రకృతినిఆటకాయిస్తూ !

Friday, 1 January 2016

అప్పుడప్పుడూ ఒక చినుకు - 1



ఎప్పుడు మొదలయ్యానంటే ఏమి చెప్పను?

ఎలా మొదలయ్యనో నాకు మాత్రం ఏమి తెలుసనీ…!

మీకున్నట్టు నాకెవ్వరూ లేరు నా తొలిఅడుగుని స్మృతిపరచటానికి నాకు ముందుగానో...  నా తరువాతనో వచ్చే నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు.  

నాకు నేనే... ఇహాన్ని. 
నాకు నేనే... అహాన్ని. 

మీరనే అనాధత్వంలో బహుశా తొలి అనాధని నేనేనేమో!

నా తరపున వకాల్తా పుచ్చుకోవటానికి మరెవ్వరూ లేనంత ఈ ఏకాకి జీవితంలో ఈ లోకపు  జరామరణాల సత్యాన్వేషణలో నేనెప్పుడూ ప్రధాన ముద్దాయినే.

పరుగాపిన సందర్భమంటూ ఒక్కటి కూడా లేని పని రాక్షసినై నేనుంటే,  తానాగితే బాగుండు అని తమ జీవితంలో నా గురించి  ఒక్క సారైనా అనుకోని మనిషంటూ ఉన్నాడా?

ఎండానీడల్లో...యంత్రపరికరాల్లో…చక్రభ్రమణాల్లో  నా ఉనికిని భద్రపరిచామనుకుంటూ... నా ఊపిరిని మనసారా స్పర్శించలేని ఓ మనిషీ… విజ్ఞాన ఖనీ ( :p )

నీ
ఎడతెగని అన్వేషణకి సిసలైన నిర్వచనాన్ని నేను…
ఏయ్ మనిషీ... 
నిత్యాహంకారీ !   
ఏదీ నీకు చేతనైతే  నా ఆద్యంతం  కనిపెట్టు చూద్దాం…
ఇంతకూ నా పేరైతే నీకు తెలుసుగా...
తెలిస్తేనేంలే  మరోసారి చెబుతున్నా విను.
నా  పేరు 

‘కాలం’