నాకు అక్కడే మిగిలిపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది
నిన్నటి కాలం లోకి ప్రయాణం స్థిరం చేసుకుంటున్న క్షణాలు
ఇప్పుడు నన్ను తడుతున్నాయ్
అక్కడికి వెళ్ళాలో
మరి ఆ కాలం
ఇక్కడకి వస్తుందని ఎదురు చూడాలో
తెలియని అయోమయం
నన్ను నాకు అస్పష్టంగా దృశ్యిస్తుంది
ఇప్పుడిక్కడ మిగలాలంటే నాక్కొన్ని మాటలు కావాలి
ఏవో కొన్ని మాటలు కాదు
నీ గొంతునుండి మనవైన మాటలు
నిన్నూ నన్నూ మనంగా మార్చిన ఆ కొన్ని మాటలు
మనకంటూ కొన్ని నిమిషాలని మోసుకురాలేని రోజులు
ఎంత ఘనంగా సాగిపోతేనేం
ఒకరికొకరిని మళ్ళీ మిగల్చగలవా అంటూ
ప్రశ్నించలేని ప్రేమ ఒకటి అక్షరంగా ఆక్రోశిస్తుంది
ఎంతగా సమాధానం చెప్పుకున్నా అప్పటి నువ్వు ఇప్పుడు లేవన్న నిజం
గుండెని మెలితిప్పుతున్న సత్యం ఎక్కడ దాచుకోవాలి?
ఇప్పుడు ఆ కొంచెం కాలం మళ్ళీ కావాలి
మనవైన క్షణాలని మోసుకుని నడచిన
ఆ కొన్ని వేళలనీ నింపుకున్న నిన్నటి కాలం
అనంతంగా చలించాలి ఈ నా చిన్ని గుండెలో







0 comments:
Post a Comment