మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 12 March 2016

పొడి నీరు



పరాకుగా జీవితాన్ని నడిచేస్తున్నట్లు 
ఒక కలని కంట్లో దాచుకుని 
ఎండమావుల తేమలో 
అలవోకగా దేహాన్ని పరచుకుంటూ 
పొడి నీటితో 
గొంతు తడుపుకున్నప్పుడల్లా
దాహం తీరిందో లేదో 
తెలియని అయోమయంలో 
నిన్ను పొడిబార్చుకుంటూ
తడి భ్రమలని ప్రతిబింబిస్తూ 
గాలి అలలలో  ఈత నేర్చుకోవటానికి 
రోజంతా ప్రయాస పడుతూనే ఉంటావు
ఎందుకంటే 
నువ్వు 
ఇప్పటికింకా 
అడుగు నేర్వని గమనానివి
నీకు దొరకని గమ్యానివి

Friday, 11 March 2016

యుద్ధం



ఎంగిలి కాబడని కలలంటూ కానరాని  స్వప్న మైదానాల్లో 
ఎంత సేపని తచ్చట్లాడతావు మిత్రమా
నేలదిగి నడిస్తే 
కనీసం గ్రాసం కోసం పోరాటం మొదలెట్టవచ్చు 

తప్పులకి తప్పులే సమాధానమవ్వుతున్నచోట 
ఎంతసేపని తారాడుతూ ఉంటావ్ నేస్తమా 
నీకు నచ్చకపోయినా తప్పులోకే జారిపో 
లేదంటే నువ్వు తప్పుడోడివైపోతావ్ 

కాస్తంత మందుకే  కమనీయ కవిత్వం పుట్టేచోట 
నాగరికాలకి పై పూతగా అరణ్యాలని అద్దుకునే చోట 
వాక్యాల నుండి జీవితాన్ని చూడకు స్నేహితుడా 
మళ్ళీ లేవకుండా మట్టిగొట్టుకుపోతావ్

మనసెంత్రమయ్యాక మనిషి గురించి తలవని చోట 
తన చేతితో తాను తినటం అనాగరికమైన వేళ 
పసి దేహాలూ కామ దాహల్లో కాలిపోతున్న చోట 
నిన్ను నువ్వు క్షమించుకోకు నేస్తమా 
నీలో నువ్వు కాలిపోతావ్ 

రక్తాన్ని అద్దుకోని ఒక చరిత్ర కోసం 
స్వార్థం కప్పుకోని ఒక ఇతిహాసం కోసం 
కామాన్ని దాటి రాలేని కాలం కోసం 
యుగాలన్నీ అన్వేషించాక తెలిసిన నిజమొక్కటే
మనిషి కోసమంటూ ఇంతవరకూ 
ఒక చెంచాడు దుఃఖం కూడా ఎవరిచేతా కార్చబడలేదని 
మనిషి జాతంటేనే ప్రళయానికి పర్యాయపదమని 

మనిషెక్కడ అన్న ప్రశ్నకు సమాధానం ఉంది 
ఎక్కడో కాదు... 
నీలోనే… నాలోనే… మనలోనే  
చేరే మార్గమే అస్పష్టం 
ప్రశ్న అడగటమే కాదు 
సమాధానం సాధించటంలోనే బయట పడుతుంది సమర్ధత

మనిషిగా మారే సంకల్పానికై యుద్ధం చెయ్యాలి 
నీకు నువ్వే ఒక యుద్ధ క్షేత్రం కావాలి 
నువ్వంటేనే యుద్దానికి ఒక నిర్వచనం కావాలి 
ఆ యుద్ధ రంగాన మనిషితనమే విజయఫలం...

Wednesday, 9 March 2016

నిష్క్రమణ



రెక్కలు తెగిన మాటకి
ఏ నిశ్శబ్దమూ ఆశ్రయమివ్వదు
మౌనంగా మథనపడటం తప్ప
ఆకతాయి శబ్దాలు వినవచ్చినప్పుడల్లా
ఊపిరి బిగబట్టుకుని నడుస్తున్న ఆడపిల్లలా
మాటని అదిమిపెట్టిన మౌనమొకటి
మాట భారాన్ని మొయ్యలేక అలసిపోతుది

నిన్నటి కలల పహారాలో
నిశ్శబ్దతిమిరపు తెరరూపం
కదలాడుతుంటే
చెమ్మగిల్లిన కళ్ళు
చెప్పిన కొన్ని కథలు
ఎన్నటికీ అర్థం కావు
మరెన్నటికీ కంచికి చేరవు

రాత్రి నుంచి కొల్లగొట్టుగొచ్చిన అనంత నిశ్శబ్దానికి
కనుపాప నల్లదనాన్ని కలగలపి
కారు నల్లని చీకటిని లిఖిస్తున్న సమయాలు
ఇక్కడేం కొత్తకాదులే

నిజం కనుగొన్నవాడికి
నిశ్శబ్దమూ చీకటి ఒక్కలాంటివే
బయటకేవీ స్పష్టంగా చూపించవు
అంతఃచక్షువులకి అన్నీ సుస్పష్టమే

తడింకిన నయన ద్వీపంలో
మొలిచేవన్నీ వంచనా శకలాలే అయ్యాక
సడిచేస్తున్న నిశ్శబ్దంలోకి దూకి ఆత్మహత్యించుకుంటున్న
సమయాలకే తెలుసు
కొన్ని సార్లు నిష్క్రమణలెంత ఆనందమిస్తాయో

ఖాళీ పంజరం


కనుదోయి అంచులకంటిన కాటుకలా నల్లగా పరిమళిస్తూ
కోట్ల హృదయాలని కొల్లగొట్టిన ఆనందంతో
కమ్మగా నవ్వుకుంటున్నట్లుంది ఎక్కడెక్కడి చీకటి

వెలుతురు కప్పుకున్నామనుకున్న శరీరాలకి
లోలోన నిలువెత్తుగా పేరుకుపోయిన
తిమిరపు శేవధులు గోచరించవు
జీవితాన్ని తల్లకిందులు చేసే వరకూ

నువ్వు శ్వాసించిన క్షణాలన్నీ శిధిలాలుగా
చరిత్రను విప్పి చెబుతుంటే
ఈ మట్టి చూసిన ప్రతి మరణ శాసనం
నీ లిఖితమేనన్న చిహ్నం
నీలో ఇంకా పదిలంగా ఉంచుకున్నావ్ చూడూ…
ఓ మనిషీ
శతాబ్దాలుగా మనసులన్నిటినీ
మభ్యపెడుతున్న ఇంద్రజాలికుడివి నువ్వు

ఏయ్… మనిషీ
నువ్వెంతటి మాయావివైనా సరే
కొన్ని స్వచ్ఛతా చూపులు వెంటాడినప్పుడు
నీలో నుండి నువ్వు నిర్దోషిగా బయటకి రాలేవు

నవ్వొస్తేనే నవ్వేంత
ఏడుపొస్తేనే ఏడ్చేంత స్వచ్ఛత ఆవరించినప్పుడు
ఏడవగలిగినంత దుఃఖం
నవ్వగలిగినంత సంతోషం కన్నా
జీవితానికి పెద్ద కోరికల భారమేమీ లేనప్పుడు
పంజరం ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది
అనంతంగా స్వేచ్ఛను పాడుకుంటూ

Sunday, 6 March 2016

కొన్నింతే



1.
ఊపిరెంత సవ్వడి చేస్తుందో
నిశ్శబ్దం ఒకటి అనర్గళంగా మాట్లాడేస్తున్నప్పుడు తెలుస్తుంది
నువ్వెప్పుడు మొదలయ్యావ్ అంటే చెప్పటానికి ఏమీ లేదిక్కడ
వలస పోయిన నిద్రని తలచుకుంటూ గాయపడిన రాత్రి తప్ప

2.
మరణం వెనకాలా ప్రేమని దాచుకున్న గుండె సవ్వడొక్కటి
ఆఖరి శబ్దం చేసినప్పుడు తెలిసింది
వేదనలు కొన్ని ఆకాశంలో కట్టివేయబడి ఉంటాయని
మింటిధారలంటే నిర్వచనం చెప్తాయని

3.
ఖాళీ అయిన పంజరంలో ఎవరిని నింపుదామా అనుకున్నంత సేపూ
నువ్వొక స్వార్ధంలో బందీ అయిన విషయం తలపుకు రాకపోవటం
‘బావిలో కప్ప’ సామెతకేమీ తీసి పోదనుకుంటా
నువ్వూ... నీ పంజరమూ ఎప్పటికీ తనను కాపు కాచుకోవాల్సిందే
తను మాత్రం స్వేచ్ఛనే గానవించుకుంటుంది

4.
కాంతి సంద్రాన్నే పొదుపుకున్న నిండైనతనం తన సొంతమైనా
రేయంతా చీకటిలో సేద తీరేంత నిరాడంబరత్వమద్దుకున్న సూరీడు చీకటోడేనా?
నిజానికీ నీడలకీ మధ్య లోలకంలా తిరుగుతున్న
రహస్య క్షణాల చీకటిని ప్రేమించటం మొదలు పెట్టాకే
వెలుగొకటి ప్రభవిస్తుందన్న నిజం తీరాలన్నిటినీ చుట్టి వస్తుంది

తెలు'గోడు'


తెలుగోడా
నువ్వు
ఆరంభ శూరత్వానికి
ఆద్యుడివి
నాయకుల అడుగుల ముద్రలలో
గమ్యాన్ని వెదుక్కుంటూ
ప్రతీసారీ...
ప్రతీసారీ
మొదటి అడుగులోనే
పగటి కలల నిద్దురని ఆవాహన చేసుకుంటావు
తట్టలో మట్టి చెంబులో నీళ్ళు చాలు
మనసు మీద కళ్ళాపి చల్లుకుని
పంచవర్ష ప్రణాళికల్లో అభివృద్ధిని
భ్రమలు భ్రమలుగా మాటలకద్దుకుంటూ
నీకు నువ్వే భజంత్రీలు వాయించుకుంటావ్
బానిసత్వం వారసత్వమైన మనసుతో
నాయకుల నెత్తిమీద పాలాభిషేకాలు చేస్తూ
నీ నెత్తి మీద వాళ్ళకి ఆసనాలు వేస్తూ
నీకు నువ్వు లిఖించుకుంటున్న మరణశాసనం
విధి లిఖితమేమీ కాదు
అది నీ స్వంత దస్తూరీ
అన్ని పక్షాలూ అధోపక్షమైన రాజకీయంలో నువ్వొక పిపీలికం
ఈసారి... ఇంకోసారి... మరోసారి… గడచి పోతూనే ఉంటాయ్
ఎదురు చూడు... ఎదురు చూడు... ఎదురు చూస్తూనే ఉండు
వచ్చి పడేదేమీ ఉండదు అయిదేళ్ళ తరువాత ఓట్లాటలు తప్ప
అరచేతుల్లో కమలాలు తారుమారవుతాయేమోకానీ
నీ కలల కొనసాగింపుకి మాత్రం
ఆకాశాన్ని నేలతో ముడివేసే చోటువరకూ అడ్డేలేదు
నాయకుల కేసుల చదరంగంలో ఆది పావువి నువ్వేనన్న నిజం
నువ్వెన్నటికీ పట్టించుకోవన్న సంగతి
కులంగానో, మతంగానో, ప్రాంతంగానో నువ్వొక స్వార్ధమైన నాడే రూడీ అయ్యింది

నిరంతరం నిన్ను నువ్వు కోల్పోతున్న జాడ
నమ్ముకున్న నాయకత్వం నిన్ను నిషేధిస్తున్న తీరు
పర్యాయాలుగా పదిలంగా దాచుకుంటూ వస్తున్న బానిసత్వం
ప్రతి విషయాన్నీ తీలికగా తీసుకునే నీ తత్వం
వేలకోట్ల లక్ష్యాలకి లక్షల విదిలింపులు చాటిచెప్పే సంగతొక్కటే
నిన్నో భిక్షకుడిగా చీదరించుకుంటున్న అహంకారం
ఒక్కసారి బయటకి చూడు
వత్సరాలుగా నువ్వు నమ్ముకున్న
నాయకులని దాటుతూ
పత్రికల్ని మడతబెట్టేస్తూ
నిన్ను నువ్వు తెలుసుకుంటావు
వాగ్ధానాలన్నీ
వాగాడాంబరాలనీ
నువ్వెప్పుడూ
నిన్ను ఆత్మహత్యించుకునే శలభానివని
మెత్తని రాజ్య హింసలో నువ్వెప్పుడూ క్షతగాత్రుడివే
ఇప్పుడు నువ్వొక శిధిలానివి
చిగురు తొడిగాల్సిన పోరాటాన్ని
ఆరాటంగా మార్చుకోవాల్సిన రణరంగానివి

ఎంత ఇష్టమైతేనేం
నిన్ను పట్టించుకోని నాయకమన్యుల మోహంలో నిన్ను కట్టేసుకున్నంత సేపూ
నీదొక అస్తిత్వం లేని బతుకన్న నిజం లోకం సమస్తం విదితం
నీ అస్తిత్వానికి విలువ తెచ్చుకునే వ్యక్తిత్వం నీ సొంతం చేసుకుని చూడు
ప్రతీసారీ నువ్వే గెలుస్తావ్
ఆత్మగౌరమంటూ కావాలనుకున్నాక
ఢిల్లీ నీ కాళ్ళ బేరానికి రావాలి కానీ
నువ్వు కన్నీటి చుక్కగా కురవటం కాదు
కళ్ళల్లో నిప్పులూ... మాటల్లో పిడుగులూ కురియాలి సోదరా
విరామ చిహ్నాల్లో నువ్వు దాచుకున్న యుద్ధతంత్రాలని
అవిశ్రాంత పోరాటాలతో మెరుగు పరచుకో
ఒక నువ్వూ... ఒక నేనూ... ఒక తనూ...
చేయీ చేయీ కలిపితే
నరం నరం రగిలితే నెత్తుటి జ్వలనం రేగదా
గల్లీగల్లీలో గళాలన్నీ ఏకమైతే ఢిల్లీ కర్ణభేరి పగలదా
ఈ సమాజానికి నువ్వే ఇరుసువి
నువ్వంటూ విరిగిపోతే జాతి గౌరవానికి సమాధే
గద్దె నెక్కించటమే కాదు
నిలదీసి కడిగెయ్యటమూ నీ భాధ్యతే
అందుకే
ఒక్క సారి మళ్ళీ ఒక్కసారి
అన్నగారి ఆత్మగౌరవ నినాదం చెయ్యి

Wednesday, 2 March 2016

తడి దస్తూరి


సాగరాన్ని చూస్తూ ఉన్నాను...
చూస్తూనే ఉన్నాను.. చూస్తూనే ఉంటాను  

బాలభానుడికి స్నానం చేయిస్తూ
బంగరువర్ణాన్ని లిఖించుకుంటూ
బడబాగ్నులని గర్భంలో అదిమేసి
మలినాలన్నిటినీ బయటకి వెలివేస్తూ
నిరంతరం తరం తరం
అలలు అలలుగా తీరానికి
తను అద్దుతున్న తడిదనాన్ని
పొదవి పట్టుకుంటూ
హద్దుగా పరచిన తన నురగల హారాన్ని దాటి
గుజ్జనగూళ్ళు కట్టుకుని నిండారా తడసిపోవానిపిస్తుంది

కళ్ళకద్దుకున్న కలలన్నిటినీ
కార్చేసుకోవటానికి
మనసు పెడుతున్న వెఱ్ఱి ఘోషని
నిశ్శబ్దించుకోవడానికి
మట్టి కబుర్లు మోసుకొచ్చిన ప్రవాహాలన్నీ
పరవశంగా ప్రణమిల్లుతున్న చప్పుడు వింటూ
అలల జడిలో
నా అలజడులని పోల్చుకుంటున్నాను

విశ్రాంతి నిర్వచనాలని
నిషిద్ధం చేసిన చోట
యుగాల సడులన్నీ కెరటాలుగా ప్రణవిస్తుంటే
ప్రాణంగా అక్కడే లీనమవ్వాలనిపిస్తుంది
ప్రేమగా తను విసిరే వలలో
శాశ్వతంగా చిక్కుకుపోవాలని ఉంది

ఆటుపోట్ల నిర్వచనాన్ని
స్వీయ కష్టాల గుంభనాన్ని
పడిలేచే స్థైర్యాన్ని
నిబద్ధతా హోరుని
నిలకడైన స్వేఛ్చనీ
ఎన్నిటినో..
సముద్రం నాకెన్నో ఇచ్చింది
నా జీవితానికి
తానెప్పుడూ ఓ తడి దస్తూరి
నన్నెప్పుడూ పొడిబారనీకుండా

నేతి నైవేద్యాలు


దేవుడున్నాడన్న నమ్మకమే భూషణమై
గుళ్ళో భోషాణాలు నింపుతూ ఆస్తికులు
లేడన్న నమ్మకమే పునాదిగా
రుజువు చూపితే కోట్లు ఇస్తామంటూ నాస్తికులు

రాతి బొమ్మలకి రంగురాళ్ళ ఉంగరాల నజరానాలు
నిశ్చల విగ్రహాలకి నేతి పరమానన్నపు నైవేద్యాలు
భావజాలపు నమ్మకాలకి జేజేలు
రుజువు చూపితే చాలట నోట్లకట్టలు

నమ్మిన భావం నిప్పులపై నడిపిస్తే
నమ్మని తనం సభలూ, సమావేశాలు
నమ్మకాల బజారులో అందరిదీ వ్యాపారమే
ప్రాణాల లెక్కల తకరారుతో
తమకొరిగేదేదీ లేనప్పుడు
వారికి మాటలే ముద్దవుతూ ఉంటాయ్
చేతలెందుకు చెత్త అనిపిస్తూ

మనిషి ఉన్నాడనేది జగమెరిగిన సత్యమే కావచ్చు
మరి మనిషికి మనిషి ఉన్నాడన్నది మిథ్యేకదా
ఓ వంతు ఎండిన డొక్కలతో
రెండొంతులు అర్ధాకలితో ఉంటున్న జగానికి
రంగురాళ్ళ ఉంగరాల అవసరం లేదు
తిన్నా అరగని ఆ నేతి నైవేద్యాలు వారికొద్దు
మనఃశాంతి పోగొట్టే నోట్ల కట్టలసలే వద్దు
నోట్లో కి నాలుగు వేళ్ళు వెళ్ళే సాయమే ముద్దు

ఎండిన డొక్కల సాక్షిగా
కుప్పతొట్టెల సాక్షిగా
ఆకలి సాక్షిగా
ఒక్క ముద్ద
ఒక్క ముద్ద చాలు.
ఒకే ఒక ముద్ద సాయం చాలు
అదే దైవత్వం…
నిజమైన మనిషితత్వం