Sunday, 6 March 2016

తెలు'గోడు'


తెలుగోడా
నువ్వు
ఆరంభ శూరత్వానికి
ఆద్యుడివి
నాయకుల అడుగుల ముద్రలలో
గమ్యాన్ని వెదుక్కుంటూ
ప్రతీసారీ...
ప్రతీసారీ
మొదటి అడుగులోనే
పగటి కలల నిద్దురని ఆవాహన చేసుకుంటావు

తట్టలో మట్టి చెంబులో నీళ్ళు చాలు
మనసు మీద కళ్ళాపి చల్లుకుని
పంచవర్ష ప్రణాళికల్లో అభివృద్ధిని
భ్రమలు భ్రమలుగా మాటలకద్దుకుంటూ
నీకు నువ్వే భజంత్రీలు వాయించుకుంటావ్

బానిసత్వం వారసత్వమైన మనసుతో
నాయకుల నెత్తిమీద పాలాభిషేకాలు చేస్తూ
నీ నెత్తి మీద వాళ్ళకి ఆసనాలు వేస్తూ
నీకు నువ్వు లిఖించుకుంటున్న మరణశాసనం
విధి లిఖితమేమీ కాదు
అది నీ స్వంత దస్తూరీ

అన్ని పక్షాలూ అధోపక్షమైన రాజకీయంలో నువ్వొక పిపీలికం
ఈసారి... ఇంకోసారి... మరోసారి… గడచి పోతూనే ఉంటాయ్
ఎదురు చూడు... ఎదురు చూడు... ఎదురు చూస్తూనే ఉండు
వచ్చి పడేదేమీ ఉండదు అయిదేళ్ళ తరువాత ఓట్లాటలు తప్ప
అరచేతుల్లో కమలాలు తారుమారవుతాయేమోకానీ
నీ కలల కొనసాగింపుకి మాత్రం ఆకాశాన్ని నేలతో ముడివేసే చోటువరకూ అడ్డేలేదు

నాయకుల కేసుల చదరంగంలో ఆది పావువి నువ్వేనన్న నిజం
నువ్వెన్నటికీ పట్టించుకోవన్న సంగతి
కులంగానో, మతంగానో, ప్రాంతంగానో నువ్వొక స్వార్ధమైన నాడే రూడీ అయ్యింది
నిరంతరం నిన్ను నువ్వు కోల్పోతున్న జాడ
నమ్ముకున్న నాయకత్వం నిన్ను నిషేధిస్తున్న తీరు

పర్యాయాలుగా పదిలంగా దాచుకుంటూ వస్తున్న బానిసత్వం
ప్రతి విషయాన్నీ తీలికగా తీసుకునే నీ తత్వం
వేలకోట్ల లక్ష్యాలకి లక్షల విదిలింపులు చాటిచెప్పే సంగతొక్కటే
నిన్నో భిక్షకుడిగా చీదరించుకుంటున్న అహంకారం

ఒక్కసారి బయటకి చూడు
వత్సరాలుగా నువ్వు నమ్ముకున్న
నాయకులని దాటుతూ
పత్రికల్ని మడతబెట్టేస్తూ
నిన్ను నువ్వు తెలుసుకుంటావు
వాగ్ధానాలన్నీ
వాగాడాంబరాలనీ
నువ్వెప్పుడూ
నిన్ను ఆత్మహత్యించుకునే శలభానివని

మెత్తని రాజ్య హింసలో నువ్వెప్పుడూ క్షతగాత్రుడివే
ఇప్పుడు నువ్వొక శిధిలానివి
చిగురు తొడిగాల్సిన పోరాటాన్ని
ఆరాటంగా మార్చుకోవాల్సిన రణరంగానివి

ఎంత ఇష్టమైతేనేం
నిన్ను పట్టించుకోని నాయకమన్యుల మోహంలో నిన్ను కట్టేసుకున్నంత సేపూ
నీదొక అస్తిత్వం లేని బతుకన్న నిజం లోకం సమస్తం విదితం
నీ అస్తిత్వానికి విలువ తెచ్చుకునే వ్యక్తిత్వం నీ సొంతం చేసుకుని చూడు
ప్రతీసారీ నువ్వే గెలుస్తావ్

ఆత్మగౌరమంటూ కావాలనుకున్నాక
ఢిల్లీ నీ కాళ్ళ బేరానికి రావాలి కానీ
నువ్వు కన్నీటి చుక్కగా కురవటం కాదు
కళ్ళల్లో నిప్పులూ... మాటల్లో పిడుగులూ కురియాలి సోదరా
విరామ చిహ్నాల్లో నువ్వు దాచుకున్న యుద్ధతంత్రాలని
అవిశ్రాంత పోరాటాలతో మెరుగు పరచుకో
ఒక నువ్వూ... ఒక నేనూ... ఒక తనూ...
చేయీ చేయీ కలిపితే
నరం నరం రగిలితే నెత్తుటి జ్వలనం రేగదా
గల్లీగల్లీలో గళాలన్నీ ఏకమైతే ఢిల్లీ కర్ణభేరి పగలదా

ఈ సమాజానికి నువ్వే ఇరుసువి
నువ్వంటూ విరిగిపోతే జాతి గౌరవానికి సమాధే
గద్దె నెక్కించటమే కాదు
నిలదీసి కడిగెయ్యటమూ నీ భాధ్యతే
అందుకే
ఒక్క సారి మళ్ళీ ఒక్కసారి
అన్నగారి ఆత్మగౌరవ నినాదం చెయ్యి

0 comments:

Post a Comment