1.
ఊపిరెంత సవ్వడి చేస్తుందో
నిశ్శబ్దం ఒకటి అనర్గళంగా మాట్లాడేస్తున్నప్పుడు తెలుస్తుంది
నువ్వెప్పుడు మొదలయ్యావ్ అంటే చెప్పటానికి ఏమీ లేదిక్కడ
వలస పోయిన నిద్రని తలచుకుంటూ గాయపడిన రాత్రి తప్ప
2.
మరణం వెనకాలా ప్రేమని దాచుకున్న గుండె సవ్వడొక్కటి
ఆఖరి శబ్దం చేసినప్పుడు తెలిసింది
వేదనలు కొన్ని ఆకాశంలో కట్టివేయబడి ఉంటాయని
మింటిధారలంటే నిర్వచనం చెప్తాయని
3.
ఖాళీ అయిన పంజరంలో ఎవరిని నింపుదామా అనుకున్నంత సేపూ
నువ్వొక స్వార్ధంలో బందీ అయిన విషయం తలపుకు రాకపోవటం
‘బావిలో కప్ప’ సామెతకేమీ తీసి పోదనుకుంటా
నువ్వూ... నీ పంజరమూ ఎప్పటికీ తనను కాపు కాచుకోవాల్సిందే
తను మాత్రం స్వేచ్ఛనే గానవించుకుంటుంది
4.
కాంతి సంద్రాన్నే పొదుపుకున్న నిండైనతనం తన సొంతమైనా
రేయంతా చీకటిలో సేద తీరేంత నిరాడంబరత్వమద్దుకున్న సూరీడు చీకటోడేనా?
నిజానికీ నీడలకీ మధ్య లోలకంలా తిరుగుతున్న
రహస్య క్షణాల చీకటిని ప్రేమించటం మొదలు పెట్టాకే
వెలుగొకటి ప్రభవిస్తుందన్న నిజం తీరాలన్నిటినీ చుట్టి వస్తుంది







0 comments:
Post a Comment