మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 18 December 2015

హేమంతపు ధ్వని



గుండె ఎరిగిన పరిధుల్లో ప్రవహించే అనుభూతుల తడి అంతా
చారడేసి కళ్ళల్లో చెమ్మగింతలు పెడుతుంటే
రెక్కలు జాచుకుంటుందో వెన్నెల గవాక్షం
వెదురు వేణువుతో అలంకరించుకున్న నీ పాటని
చుక్కల ఆకాశపు కచేరీకి అతిధిని చేస్తూ

కాంతిని విప్పుకుందామనుకున్నప్పుడల్లా
చీకటిని కప్పుకునే రేరాజు వెంటబడి నడుస్తూ
నీ ద్వారాన్ని సమీపించినప్పుడు
అలలు అలలుగా శబ్దిస్తున్న నీ ఊపిరి సవ్వడి మేలిముసుగులన్నీ
నా శ్వాసల జలతారుగా అల్లుకుపోతున్నాయి

సంకేత స్థలాల తడబాటుని దాటలేని
ఎడతెరుగని వెదుకులాటలో
పచ్చికపై హేమంతపు ధ్వనితో
మత్తెక్కిన నగ్నపాదాల వైభవంలో
ఓ గర్వాన్ని మనసారా హత్తుకుంటాను
నువ్వే నా ‘ప్రకృతి’వైన పరవశాన్ని పరిమళిస్తూ

Thursday, 17 December 2015

గడ్డి పువ్వు


ఆలోచనింకా నేర్చుకోలేదా చిన్ని ప్రాణం
నేర్చుకుంటే
అది దేవతలనో...దేవదూతలనో
దేవుడి బిడ్డలనో కనిపెట్టదు
భూదేవీ.. ఆకాశరాజూ.. సూర్యభగవానుడూ కానరారు తనకి
భూమంటే ఒక ఆలంబన అనీ
ఆకాశమంటే రేయింబవళ్ళని కురిపించే
అనంతమైన నీలి వర్ణమని
సుదూర తీరాలకి వినిపించేంత మధురంగా నవ్వుతుందిగాని
తానెప్పటికీ దైవాన్ని తెలుసుకోలేదు
దేవుడెప్పుడో ఇంకెవ్వరికీ దొరకనంతగా
మనిషి మూర్ఖత్వంలో కొలువైపోయాడుగా మరి
తాను సృష్టించిన దేవుడి పేరుతో

ఏదైతేనేం
మతాన్ని మత్తుగా తాగేస్తూ
తమ అంతాన్నే పంతం పట్టిన మనిషి కన్నా
తానొక నిటారుగా నిలబడే ఆత్మవిశ్వాసాన్నని
అర్ధం చేసుకున్న ఆ చిన్నిగడ్డి పువ్వే మిన్న


Wednesday, 16 December 2015

పసిచినుకులు


రెండు చిక్కని బాల్యాల మధ్య
ఒక పసితనపు ప్రవాహం
ఎంతటి ఆనందాన్ని పారుతుందో
చూసినప్పుడల్లా
ఆ బురద మరకల్లోని
మెరుపుల్ని తాకుతూ
మళ్ళీ మొదలవ్వాలనిపిస్తుంది

పగటికి వయసుడిగినా
ఆటకి అలసట రానివ్వని
నవ్వుల కావలిలో
మురిసిపోయిన రాత్రి అడిగింది
‘ఏయ్! దేవుడూ
నువ్వా వెన్నెలనుంచుకుని
నాకీ పసితనాన్ని ఇచ్చెయ్యవూ’ అని
మరిప్పుడదేమో
నాకది ఓ నిత్య ప్రార్ధనగా మారిపోయింది
మరి పసి చినుకులంతే
మళ్ళీ మళ్ళీ మనసుని తడుముతూనే ఉంటాయ్

Tuesday, 15 December 2015

గుండెని తాకిన నవ్వొకటి


నిన్ననగా గుండెని తాకిన నవ్వొకటి 
ఇంకా నరాలనిండా పయనం చేస్తూనే ఉంది 
కనులు దాయలేని తడొకటి 
నన్నింకా  తడుముతూనే ఉంది 
ఒక నవ్వు
ఒక దుఃఖం
ఏకమైన ప్రతిక్షణం 
అచ్చంగా మనదే కదూ 
ఏయ్.. సహచరీ !
నా ఊపిరంతా నీలో నుండి కురుస్తున్న నిజం 
కొత్తదేం కాదు కానీ 
ఇప్పుడైతే 
కాలానికి కనికట్టు కట్టేసింది నీ సమక్షం 

Sunday, 13 December 2015

అనాగరికం



యుగాలుగా పేరుకుపోయిన ప్రశ్నలని
మార్మిక రహస్యాలుగా పురాతనీకరించిచటమే
పెద్దల మాట అయిన చోట
లోక సంస్కారాల పుట్టుకలో
నిజాయితీని వెదకటమన్నది ఓ నిషిద్ధ శాస్త్రమయ్యాక
శతాబ్దాలుగా మనిషి లిఖించుకుంటూ వస్తున్న
నియమాల విద్యాలయంలో పట్టభధ్రుడినై
ప్రపంచాన్ని గెలుపులతో ఆకట్టుకుంటున్న వేళ
కదలికలు మరచిన తడి ఒకటి
ఘనీభవించిన నిశ్శబ్దాల సాక్షిగా
శిఖరమెక్కిన అహాన నిలబడ్డ క్షణంలో
ఎలా మొదలయ్యానో గుర్తు రాలేదు నాకు
అప్పటి పసితనమది


అన్ని పసితనాలనూ కాలంతో కొలఛి చూస్తున్నచోట
అక్కడ కనిపించే అర్ధాలలో దొరకని నాలోన
ఇప్పుడొక తడి చదువు మొదలై
నాలోనే నేను అదృశ్యం దృశ్యం ఒకటి భయపెడుతుంటే
ఇప్పటి నాగరికాల కుబుసాలని ఇక్కడే విడిచేసి
నడక మొదలెడుతున్నా ఒక అడవితనంలోకి
మనిషినన్న స్పృహ పోయే అనాగరికంలోకి జారిపోవాలని

Saturday, 12 December 2015

ఇంధనం



హాయ్ కన్నా...

అమ్మపేగుతో నీ జీవబంధాన్ని ఎంతబాగా ముడి వేసుకున్నావ్ రా...!  అండం నుండి పిండంగా... ఆపై అమ్మ కడుపునే బ్రహ్మాండంగా భావిస్తూ ఎంతగా మురిసిపోతున్నావో కదా... అక్కడ ఉన్నన్నాళ్ళన్నా మురిసిపోరా… బయటకి వచ్చాక మురిసిపోతావో మరి ముగిసిపోతావో ఏదీ నీ చేతుల్లో లేదోయ్.

మరి బయటకి రావాలని ఎందుకురా తొందర? అమ్మకడుపు చెరసాల కాదురా… అవకాశం ఉంటే అక్కడే  ఉండిపో… ఒక్కటైతే చెప్పగలనురా… నువ్వు లోపలున్నా… బయటకి వచ్చినా అమ్మ ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైనదే.

నువ్వక్కడ చూస్తున్నది రక్త మాంసాల మైదానాలు, ఉమ్మనీటి సాగరాలు మాత్రమే. ఒక్కసారి లోకానికి వచ్చేసావా నీ విహార యాత్రలన్నీ కాలుష్య కాసారాలలోనే… కాలుష్యం అంటే గాలి కాలుష్యమో… నీటి కాలుష్యమో కాదురా చిన్నా… మానవ జాతి కాలుష్యం... మనిషితనపు కాలుష్యం…! ఇక్కడ పుడుతూనే నువ్వు ఏడవాలిరా… అది ఈ లోకపు నియమం. ఖర్మకాలి పుట్టగానే నువ్వు ఏడవ లేదా తొడపాశం పెట్టి మరీ ఏడిపిస్తుందిరా ఈ లోకం.

నువ్వే చూస్తున్నావ్ కదా ఇప్పటి నీలోకం… నువ్వే కాదు… నేను… ఇంకోడు మరొకడు అందరమూ చూసిన ప్రపంచం అదేరా… అక్కడ ఉన్నప్పుడు మనకి తేడాలేమీ తెలియదు. బయటకు వచ్చే సరికి నీ కోసం ఎన్ని గుర్తింపులు  సిద్ధంగా ఉంటాయో తెలుసా?

లోపల నువ్వు చూసిన ప్రపంచం చాలా చిన్నదిరా. లోపల నువ్వు చూసిన దానితో పోలిస్తే  బయట ఉన్నప్రపంచం అనంతం రా. ఇంతటి పృథ్విపై నువ్వు స్వేచ్ఛగా  మెసలటానికి లేకుండా నీకంటూ ఒక ప్రాంతం, ఆ ప్రాంతాన్ని బట్టి, నువ్వు పుట్టిన కడుపున బట్టి నీకంటూ ఒకవర్ణం, నీ అమ్మానాన్నల ఆచరణని బట్టి నీకంటూ ఒక మతం, దాన్ని ఇంకాస్త విస్తరిస్తే  మతాల్లోని శాఖలో… కులగోత్రాలో… ఇంకా… ఇంకా… ఎన్నిరా? చెప్తూ వెళితే  అంతే ఉండదు.

ఏదో చిన్నా.. కన్నా అంటున్నాను  కదా అని  ఇదంతా కేవలం మగశిశువుకి చెప్తున్నా మాటలు కాదురా… ఒక వేళ నువ్వు గనక ఆడ శిశువువి ఐతే  నువ్వసలు బయటకు వస్తావో… వచ్చినా బతుకుతావో.. లేదో , బతికినా అమ్మ వడిలో లాల పోసుకుంటావో... చెత్తకుప్పలో శిధిలమవుతావో ఆ దేవుడికీ ఎరుక అవ్వదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే  మా'నవ'జాతి తమలోని సగానికి ఇచ్చుకుంటున్న విలువరా అది. భూమికి భారం త్వరగా తగ్గిద్దామనే ప్రకృతి సేవలే అది అని చెప్పినా చెప్తారు మావాళ్ళు.

పుట్టకముందే మీకోసం… అంతే కాదురోయ్... మీ ఏడేడు  తరాల వారసుల కోసం రంగు కాగితాలనో, లోహ ధాతువులనో అలా అలా పేర్చుతూ  పోయేవారు కొందరైతే… గుక్కెడు పాలివ్వలేక… కంటికి ధారగా ఏడుస్తూ మిమ్మల్ని విడవలేక విడిచే వారు కొందరు. 

మరి ఇదొక రంగుల రాట్నం… మానవజాతి మాయాజాలం. అడుగు వేశావా వెనక్కి తీసుకోలేని మాయా చదరంగం. 
  
అప్పుడే అయిపోలేదు బంగారూ… ఎదిగేకొద్దీ పెరిగే సవాళ్ళూ… ఇప్పుడు నీకు తెలియటం లేదు కానీ, బయటి  లోకంలో   రూపంటూ ఆకలి  అనే రాకాసి ఒకటి  ఉంది. అది నిన్ను జీవితంలో ఏ తీరాలకి చేరుస్తుందో ఇప్పుడే చెప్పలేం. అదొక్కటి చాలు నీ కలలన్నిటినీ అస్తవ్యస్తం చెయ్యటానికి.

మీరు ఈ భూమ్మీదకి వచ్చాక అయినా, ఏ అజ్ఞానాన్నీ నేర్వకండి.  ఆనందానికి పనికిరాని అన్ని సిద్ధాంతాలనీ తెగనరకండి.  మనిషిని నుండి మనిషిని వేరు చేసే సమాజాన్ని చిధ్రం చెయ్యండి. భీరువుగా బతకొద్దురా ధీరుడివై ప్రకృతితో మిత్రత్వాన్ని కొనసాగించు. హక్కుల కోసం కాదురా ఆనందం కోసం పోరాడు.

ఇకపై విప్లవమంటే నెత్తుటి పోరాటం మాత్రమే కాదు మనిషిని మిగుల్చుకోవాలనే ఆరాటం కూడా. పవిత్ర యుద్ధాలు చెయ్యల్సింది మనుషుల్ని చంపుతూ కాదు... మనుసులోని  మమతలని  వెలికి తీస్తూ…

దిగంతాల్లో అనంతకాలం ప్రజ్వలిల్లాలి మీ తరమే  ‘ఇంధనమై’

ఇట్లు,

ఓ చేతకానివాడు

నీడ



ఓ అభిజ్ఞా...

ఈ పిలుపేంటి పిలగాడా అని మాత్రం అనుకోకేం.  నీడ నీడతో ఇలాగే మాట్లాడాలి. నిజం చెప్పు! నీకు నా  దగ్గరి తనపు  స్పర్శ  తెలియటం లేదూ.  నీ మనసులో గోరువెచ్చని మమతల్లో దాగున్న నన్ను దూరంగా ఉన్నానంటూ ఆక్షేపించటం నీకు మాత్రమే చెల్లింది. నీకు నాతో జగడాలు ఆడటం ఇష్టమని తెలుసు కానీ ఇన్ని అభాంఢాలా? అన్యాయం కదా. ఒక్కసారి లో లోపల తడుముకుని చూడు. ఆ మనసు పరిమళంలో అదే స్వచ్ఛత అదే సువాసన అదే పరవశం  మరి అది నేను కానా.

నువ్వంటున్నావే విసిరిన మాటలు అని… అవి విసిరిన మాటలు కాదోయ్... అరవిరిసిన హృదయ సుమాలు! కాబట్టే మౌనం కోటి రకాలుగా  మాటలాడుతుంది. నా నిశ్శబ్దపు హోరూ, నీ మౌనాల జోరూ… ఈ రెండూ మనల్ని  ఇంకా ఇంకా దగ్గరే చేస్తాయి కానీ  ఎప్పటికీ దూరాన్ని పెంచలేవులే. నీ ఏకాంతం నీకెలా ఉంటుందనుకున్నావ్ నన్ను ఊహలకి వెళ్లాడదీసాక?

ఎందుకీ విరామాలంటూ వగపులేల? కొన్ని విరామాలు… వరాల ఆరామాలు ! విరామంలో వరమేంటి అంటే ఏమని చెప్పను నేను? సమయం మొత్తాన్ని తలపులకి అల్లేసిన సడిలో మామూలుగా కన్నా ఇంకా దగ్గరైనతనం చెప్పటం లేదూ అదెంత వరమో..!

నువ్వనుకున్నట్లు మౌనమెప్పుడూ అందమైన  గాజు పువ్వు మాత్రమే కాదురా… అది ఘనీభవించిన సజీవ పరిమళం. స్థితి ఏదైతేనేం దాని అలజడి తీరు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది. నీకు తెలియనిది కాదనుకో… అయినా  సరే మరో సారి చదివి చూడు మౌనం రాస్తున్న మనఃప్రతిని. నల్లని నీడలో… రంగు రంగుల వర్ణాలో…  ఎలా అనిపించినా అవి పరిచయించేది  మాత్రం నిన్నుగా రాసుకున్న నా ఊసుల లిపినే.

నీడగా ఉండటం అంటే నిన్ను కాచుకోవటం అన్న మాటేగా… సమయాన్ని బట్టి తగ్గుతూ పెరుగుతూ రూపుని దాటేసిన రక్షా కవచమది. నీ  హృదయ స్పందనలు  వినిపించనంత  దూరం అంటే నాకు తెలిసింది ఒక్కటే… అదే  మరణం.

ఏదేదో ఊహించు కుంటున్నావ్ గానీ నిజంగా నీకు తెలియదా చెప్పు?  నిన్ను తలుచుకుంటే నా గుండె నిండుగా పరిమళించే తొలకరి చినుకు చీల్చే మట్టి వాసన, నీ  పిలుపు వింటే చాలు పిల్లగాలిపై మనసు పడ్డ  పైరులా పరవశం… ఒక్కొక్క అనుభూతీ ఒక్కోలా నిన్ను నాలో నింపేసాక  నాకు నేను అతిధినయ్యానని !

గెలిపించేదీ నువ్వే... ఓడించేది నువ్వే... దిగులు పెట్టించేది నువ్వు… ధైర్యమిచ్చేది నువ్వే… బెదిరించేది నువ్వే... ఆదరించేది నువ్వే...

ఎప్పటికీ నా నీడగా నన్నంటి ఉన్న నా తోడుగా నీకు నేనున్నానని తెలుపుకునే తలపుల తాయిలమిది.

అనుకోకుండా తారసపడ్డా… నిశ్శబ్దంగా చేరువైనా… జత కలసిన అడుగులు ఒకటికి ఒకటి రెండుగా… రెండిటి తపమూ ఒకటిగా...  బంధం అల్లుకుపోయాక జతలంటూ  ఏమీ ఉండవు ఏకమైన మనో శబ్దం తప్ప.

నీ
“తోడూ నీడ”

Friday, 11 December 2015

శయనం


హాయ్ బంగారూ

గుండె ఉన్నదే కొట్టుకోవటానికి. కాదంటావా? జీవాన్నే  శాసించే సజీవలోలకం ఒకటి నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది నిన్ను మోస్తూనే అని తెలియటం కంటే జీవితంలో ఆనందపు మొదలు ఎక్కడ ఉంది. తడబాట్లూ, తలపులూ, తపనలూ, పారవశ్యాలూ  అన్నీ అన్నీ కూడా ఆ అనుభూతి తరువాతే. ఆపై అవన్నీ తన సహజాతలే.

నిన్ను తెగ చదివేద్దాం అని నేను అనుకున్నప్పుడల్లా అక్కడ పరావర్తనమైన నేనే కనిపిస్తున్నాను. ఇంతకూ నువ్వు నాకు దర్పణమా? నేను నీకు రూపాన్నా? Feeling Confused 

సవ్వడెంత ఎక్కువైతే సందడంత ఎక్కువేమో కదా? సవ్వడీ  సందడీ ఒక్కరే అయిన చోట మైదానాన్ని సిద్ధం చేసి ఉంచానన్న నిజం నిన్ను దాటిపోయిందా?  కోవెల్లో హారతి ధూపపు పారవశ్యపు బరువులా నా నిండా నువ్వు నిండిపోయిన వాస్తవం నీకు తెలీదూ? నన్ను లోకానికి నిరూపణ చెయ్యాలన్న నీ తాపత్రయంలో  లోలోన  ఎన్ని గుసగుసలో కదా

కోట్ల తారలు వేలాడుతూ ఉన్నాయి కదా అని ఆకాశం ఏమైనా బరువెక్కిందా ఏమి? మన విషయంలోనూ అంతేనోయ్.. అంతులేని తలపుల బరువుతో సహా   నాలో నిండుగా నిన్ను నింపుకున్నాకే నేను తేలికపడ్డానన్న నిజం నీకూ తెలుసుగా.  కొన్ని కొన్ని అంతే లోక విరుద్ధంగా జరిగిపోతుంటాయ్.  

ఒకరికొకరంగా ధ్యానబద్ధులమై ఉన్నచోట దివారాత్రాల అలికిడి చేరని అలౌకితగా మనం కొనసాగుతున్న మౌనవచనంలో అక్షరబద్ధం అయ్యే  ఒకే ఒక్క నిజం మనప్రేమ’ .

తుంటరి ఊసుల థిల్లానాలో వేడుక్కుతున్న వెన్నల రాత్రులకి ఏమి తెలుసు? వేల వేకువలు పొద్దుపొడిచినా ఆ ఊసుల ఊపిరాగదని !  ఒంటరిది కదా అని జాలిపడతాం గానీ ఇద్దరి మధ్య  రాయబారిగా ఆ కృష్ణభగవానుడిని మించిన మాయాజాలంతో   ఈ చిరుగాలి చేసే చమక్కుల చూస్తే తెలుస్తుంది తానెంతటిఅభిజ్ఞయో.

నిదురనద్దుకోనంటున్న రాత్రిళ్ళకి నీ కలలనజరానాఆశ చూపించేసరికినా కనురెప్పలపై ఎంతటి భారమైన ముద్రలేస్తున్నాయో చూడు. అదీ సంగతి... ఇవి కూడా ఇలాతొండిఆటలు మొదలు పెడితే  ఎలాగోయ్ బతకటం?

ఛ...ఛా పాపంలేరా రాత్రుళ్ళది తప్పేం లేదు  ఎన్ని ఒంటరిక్షణాల నిరీక్షణలని నీకర్పించానో బాగా తెలిసిన నీడలు కదా అవి నీ కలల స్మరణలో పునీతమైన నా కళ్ళకి నిన్ను శాశ్వతరూపంగా అందించాలనే సదుద్దేశ్యమేలే
చివరిగా నీకొకటి చెప్పనా
నా అనేకానేక అనుభూతులకి ఒక ఒక్క కారణం నువ్వు.
అనేకానేకంగా నాలోకి ప్రవహించిన నా ఏకైకఅహంనువ్వు.  
నాదెప్పటికీ ఒకే ఒక్క కోరికతీరుస్తూనే ఉంటావ్ కదూ...
నా అధరలాస్యాలపై  అనంత శయనానివై ఊపిరిల్లవూ!

నీ

..