Thursday, 17 December 2015

గడ్డి పువ్వు


ఆలోచనింకా నేర్చుకోలేదా చిన్ని ప్రాణం
నేర్చుకుంటే
అది దేవతలనో...దేవదూతలనో
దేవుడి బిడ్డలనో కనిపెట్టదు
భూదేవీ.. ఆకాశరాజూ.. సూర్యభగవానుడూ కానరారు తనకి
భూమంటే ఒక ఆలంబన అనీ
ఆకాశమంటే రేయింబవళ్ళని కురిపించే
అనంతమైన నీలి వర్ణమని
సుదూర తీరాలకి వినిపించేంత మధురంగా నవ్వుతుందిగాని
తానెప్పటికీ దైవాన్ని తెలుసుకోలేదు
దేవుడెప్పుడో ఇంకెవ్వరికీ దొరకనంతగా
మనిషి మూర్ఖత్వంలో కొలువైపోయాడుగా మరి
తాను సృష్టించిన దేవుడి పేరుతో

ఏదైతేనేం
మతాన్ని మత్తుగా తాగేస్తూ
తమ అంతాన్నే పంతం పట్టిన మనిషి కన్నా
తానొక నిటారుగా నిలబడే ఆత్మవిశ్వాసాన్నని
అర్ధం చేసుకున్న ఆ చిన్నిగడ్డి పువ్వే మిన్న


0 comments:

Post a Comment