గుండె ఎరిగిన పరిధుల్లో ప్రవహించే అనుభూతుల తడి అంతా
చారడేసి కళ్ళల్లో చెమ్మగింతలు పెడుతుంటే
రెక్కలు జాచుకుంటుందో వెన్నెల గవాక్షం
వెదురు వేణువుతో అలంకరించుకున్న నీ పాటని
చుక్కల ఆకాశపు కచేరీకి అతిధిని చేస్తూ
కాంతిని విప్పుకుందామనుకున్నప్పుడల్లా
చీకటిని కప్పుకునే రేరాజు వెంటబడి నడుస్తూ
నీ ద్వారాన్ని సమీపించినప్పుడు
అలలు అలలుగా శబ్దిస్తున్న నీ ఊపిరి సవ్వడి మేలిముసుగులన్నీ
నా శ్వాసల జలతారుగా అల్లుకుపోతున్నాయి
సంకేత స్థలాల తడబాటుని దాటలేని
ఎడతెరుగని వెదుకులాటలో
పచ్చికపై హేమంతపు ధ్వనితో
మత్తెక్కిన నగ్నపాదాల వైభవంలో
ఓ గర్వాన్ని మనసారా హత్తుకుంటాను
నువ్వే నా ‘ప్రకృతి’వైన పరవశాన్ని పరిమళిస్తూ







0 comments:
Post a Comment