మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 15 June 2016

ప్రణయ గాంధర్వం - 1

ప్రేమైషీ,

తొలిపొద్దు రవి కిరణపు సొగసుని ఒద్దికగా ఒడిసిపట్టి విరిసిన కుసుమంలా
వెన్నెల జలపాతం నుండి జాలువారుతున్న కలువ నక్షత్రంలా
మువ్వల స్వరపాతాన్ని ప్రవహిస్తున్న పాద మయూఖంలా 
వెన్నల మృదుస్పర్శలో తన్మయమవుతున్న సన్నటి వెలుగు రేఖలా
చిన్న మబ్బుతునకని అల్లుకుని దిగంతాలని చుట్టేస్తున్న ప్రేమ గాలిలా
అమృత భాండం చేతబట్టి రాక్షసులని చూసి నవ్విన జగన్మోహినిలా
ఎడారి భూముల్లో వాన నీటిని వర్షించే తొలకరి మేఘంలా 
నిర్లిప్తాలని దాటేయిస్తూ  నవ్వుల నాట్లేసి నా పెదవులపై మెరుపుల పంటను పండిస్తున్నట్లుగా   
నీవు నవ్వి నా హృదయ పీఠికను అధిష్ఠించావు

వెండి వెన్నెల స్పర్శతో వికసిస్తున్న కలువమొగ్గల్లా ఉన్న నీ అధరాలు
నిర్మల యామినీ వదనంపై ముత్యాలై మధురంగా మెరుస్తున్న తారకలు  
కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తున్న నీ నీలాల నయనాలు
ఆకాశ నీలాలని తాపడం చేసుకున్న కాంతి సింధువులు  
గులాబీల కాంతులతో జాబిల్లికే వెన్నెల పంచుతున్న నీ అందమైన చెక్కిళ్ళు
వానవెలసిన తరువాత కనిపించే ఇంధ్రధనుస్సులో మిళితమైన సప్తవర్ణాల వాకిళ్ళు 
సాగరతీరాన వెండి వెన్నెల రజను లా ఉన్న ఇసుకలో దొరకిన శంఖంలాంటి నీ కంఠం
మధురాలని ఘనీభవించి సజీవంగా పోతపోసిన దివ్య గాంధర్వం  

లేత గులాబీ ఛాయతో మెరుస్తున్న నీ అందాల మేనిపై అరుణోదయాన పడిన మంచు తొలి కిరణం వేడికి కరిగి నీ శరీరంపై పడి వెన్నెల రజనులా మెరుస్తుంటే  ఓ అరుదైన హేమంత కన్యవై నువ్వు శిల్పించబడ్డట్లు... 
అజ్ఞాత కార్మికుల ఊపిరితో రూపం దాల్చి శతాబ్దాలుగా వెండికొండలా ఉన్న తాజ్‌మహల్ అందమైన పడతిగా మారి కాశ్మీరపు కుంకుమాన్ని అద్దుకుని ఆప్తంగా విరిసిన నందివర్ధనాల స్పర్శతో నా ఎదలో వగలు రేపినట్లు...
యుగాల దూర పథాలని దాటేసుకొచ్చి, తొలకరిజడిలా చినుకులని స్వరిస్తూ   నీవు నా చెంతన తిరుగుతూ ఉంటే, 

"రవివర్మ కుంచెకందని లావణ్యం... 
కాళిదాసు గీతికకందని స్నిగ్ధత్వం
కమలకుట్మలపు సౌందర్యం 
కనకాంబర పూపుటపు సున్నితత్వం "

కలబోసుకొని ఉన్న నిన్ను చూసి గంధర్వకన్యలూ, దేవతమూర్తులూ, అప్సరాంగనలూ, యక్షిణీకన్యలూ అసూయతో దహించుకుపోతూ ఉంటారేమో. మణిదీపశిఖలా, విద్యుల్లతలా, హంపీ కన్యలా, అజంతా చిత్రంలా, ఎల్లోరా శిల్పంలా, బాపు బొమ్మలా, కాంతి తీరాన గంధర్వ బాలలా నిలుచున్న నీ తలనుండి రాలి పడే మల్లెలు చీకటిలో మెరుస్తున్న మంచులా ఉన్నాయి. 

ప్రథమచరుని కదిలించిన మన్మథ సుమ బాణమై... పారిజాతపాతమై... వెన్నెల తోటలో విరబూసిన తారకలా, మణిమయ భవనాన నిలచిన వరూధినిలా, ప్రాణం పోసుకొని వచ్చిన మొనాలిసా చిత్రంలా, కాళిదాసు తలపుల్లోని కావ్యనాయికలా, రవివర్మ కుంచెనుండి జాలువారిన ఊహాసుందరిలా, ఓ జత అడుగులు తపన పడే చల్లని సాయంత్రంలా  ఉన్న నీ ముగ్ధమనోహర రూపం...




ఓహ్! 

మండు వేసవిలో నీడలేక తిరుగుతున్న పాంధుడికి వటవృక్షం నీడ చూపినట్లుంది. నీవు నన్ను చూసి చిరునవ్వుల బాణాలు విసిరితే నీ సన్నిధే స్వర్గంలా, మధు స్రవంతిలా వుంటుంది. తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా నా హృదయంలో నీ రూపం ప్రతిఫలిస్తుంది. 

భిక్షపాత్ర పట్టుకొని ప్రేమార్ధినై నీ దగ్గరకు వస్తే నీవు చూపు ఆదరణ తలచుకుంటే ఓహ్! నా మనస్సు పులకరిస్తుంది.
నడి ఎడారిలో నీళ్ళు లేక దాహంతో అలమటిస్తున్న బాటసారికి అమృతంతో గొంతు తడిపినట్లుంది. ప్రపంచం - ప్రకృతి - సృష్ఠి - సూర్యచంద్రులు - ఆకాశం - మేఘాలు -వెన్నెల - నక్షత్రాలు - ఎండా వానా అన్నీ నీవే. నీవులేని ఊహను కూడా మరి నేను ఊహించలేను. 

మలయ మారుతానికి రూపం వస్తే నీ రూపే కావాలంటుందేమో.
మల్లెల పరిమళాలకు స్వరూపం వస్తే నీ రూపే కోరతాయేమో.
ధవళకాంతులీనుతున్న నీ మోము చూసి చంద్రుడైనా సిగ్గుతో తలవంచుకుంటాడేమో.
గులాబీల సున్నితత్వానికి ప్రాణంపోస్తే నీ రూపు దాల్చిందేమో.
పాడుతాతీయగా అంటూ పాడే కోయిల సైతం నీ గాన మాధుర్యానికి తన్మయం చెందుతుందేమో. 
స్వాతిచినుకు నీ మేనిపై పడితే వెన్నెల ముత్యంలా మెరుస్తుందేమో.

ఎన్నెన్ని పరిమళాలు పేలవంగా మారిపోయాయో నా నిన్నలకే తెలుసు. నువ్వేంటో మరి ఒక అనంత పరిమళానివై కొనసాగుతూ  ఉన్నావు. నా రోజులన్నిటికీ నువ్వొక అర్థింపుగా మారిన నిజమొక్కటున్నది చూశావూ... బహుశా దానికి వెలసిపోవటం  అన్నది తెలియదనుకుంటా... నువ్వు నా గాఢకాంక్షవి... నా ప్రణయ సాఫల్యపు జీవానివి...నా జీవితపు  అనంత ప్రణవానివి.. 

ఏయ్... ఒక్కటి చెప్పనా  తేనియలు స్రవించే సుమ గంగోత్రి నువ్వు.   

నీ,

ప్రేమైషి 

Saturday, 11 June 2016

హేమంత స్పర్శ - 18



ఆత్మైషీ,

ఇక్కడ...నాలో… లోలోపల  నవ్వుకోబడుతున్న నిశ్శబ్దమొకటి ఉంది రా ! మాటలని ఆశ్రయించుకున్న నిశ్శబ్దమిది. మాటలని మెత్తగా మడతబెట్టుకుంటూ మౌనాన్ని వెచ్చగా కప్పుకుంటూ వస్తున్న మనసాత్మ ఇది.

పెదాల చివర వేలాడే నిశ్శబ్దం ఏమో కానీ మనసు చివర పరుచుకుని ఉంటుంది చూడూ ఒక మౌనం… అది కదరా భాష అంటే ! ఆ భాష చదవగలిగేది ఆత్మైషి కాక మరెవ్వరనీ. చదువు ఒక్క సారి. ఏమి చెప్తోంది అది. అలసటనే  కదా… నిజం రా చెప్పలేని అలసటగా ఉంది. నువ్వు మాత్రమే చదవగల అలసట... నువ్వు మాత్రమే విప్పగల అలసట… కాదా ఏం? నీ రాజ్యంలో అలసటని నువ్వుగాక ప్రారద్రోలగలిగేదెవ్వరని?  మరి నా అలసట ముగింపుకొచ్చిందో… సశేషంగా సాగుతుందో ! అంతా నీ  మీదుగానే సాగిపోతుంది

ఏదేమైనా నువ్వు శీతల  మూర్తివిరా. నీటి నీలమంతా కాటుకైన కళ్ళ సౌధాలని మెరుపులతో నింపేసి నువ్వు లిఖించే చూపులున్నాయి చూశావూ… నీ  మెరుపుల కంపనలన్నిటినీ  నాకు అంపకం చేస్తూ  నా అణువణువుకీ ఆనందపు అక్షరాలని తాపడం చేస్తున్నాయి. ఎందుకంటే నీ చూపులు నన్ను ప్రశ్నిస్తుంటాయి...శోధిస్తూ ఉంటాయి… చివరగా  నన్ను కనుగొంటాయ్… నన్ను మాత్రమే కనుగొంటాయ్. నిరుపమానమైన నీ ఆత్మసౌందర్యం కాకుండా నన్ను వశపరచుకునేది ఏమీ లేదని వాటికీ తెలుసు మరి…!

నీ పలుకులు ప్రణవపు రెక్కలై నా లోకాన్నంతా కప్పేస్తున్న మైమరపులో  శిశిరాన్ని కూడా మనోహరంగా  గానవించే ఒక శీతగాలి స్పర్శలోని అనుభూతినిస్తుంటే   ఇక నాకైనా  మరి నీకైనా  గుర్తుకొచ్చేది ఎవరోయ్? మనం గాక. శూన్యపు సెలయేటిని దాటించేయడానికి  నాకొక చుక్కానివై నువ్వు… నీకొక చుక్కానినై నేను.. ఒకరికొకరం సిద్ధించుకున్నామనీ నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా వేరు చేస్తూ మనఃస్వంతమైన పరస్పర వాంఛలేమీ లేని ఐక్యం ఒకటుంటుందని...ఒకరికొకరం అనునాదమైన ఏక సవ్వడిని గుండె లయగా మార్చుకున్న దేహాతీత మధుధారలం.

నా నైరాశ్యాన్ని ఛేధించిన శరానివై
అరమోడ్పు కన్నుల కింద కలల స్వరానివై
కాలాన్ని దాటేసి కలల్ని తెరిచేసి
నన్ను చేపట్టిన పూల వనానివై
ఎవరో  దోచుకెళ్ళిన నవ్వుల చప్పుడుని
నా మదిపై తాకిస్తూ
నువ్వొక ఇంద్రజాలపు వేదికవి
లేలేత తమలపాకుల మృదుత్వ స్పర్శతో
గతాల చారికలన్నిటినీ  చెరిపేస్తూ  
నన్ను నాకు సవాలుగా మార్చేస్తూ
క్షణానికొక కొత్త పంక్తివై ఆవిష్కృతమౌతూ
హృదయాల మధ్య చిరునవ్వుల వారధి వేసే
అద్వితీయ అలౌకిక సాహిత్యానివి

నిజం రా! నువ్వు నా నిజ సాహిత్యానివి… నిన్ను కాసేపు చదివితే చాలు… వేవేల నిర్వచనాలు పరిచితమవుతూ ఉంటాయ్… సృష్టి అంతా విశ్రాంతి తీసుకుంటున్న నిశ్శబ్ద మైదానంలా మనసు శబ్దిస్తూ నిన్నే వల్లెవేసుకోవటముంది చూశావూ... అది నువ్వే మంత్రాక్షరిగా మారిన సంగీతఝరి. నన్ను నీలోకి ప్రవహింపజేసుకునే ఒక పచ్చని ప్రేమలేఖవి.

స్వప్నమాలికలల్లుకున్న రెప్పల చిక్కు ముళ్ళనుండి గుండె గూటికి నిన్ను తోడ్కొని పోయిన  ఆ మొదటి క్షణపు  స్పర్శ ఆ హృదయ ద్వారానికే వేళ్ళాడుతూ ఉండిపోయింది. క్షణ క్షణపు సవ్వడిలో తానో లోలకమై నిన్ను కాపు కాస్తూ…!

నా మనోమహార్ణవంలో నులివెచ్చని సందడివై అలలు అలలుగా తీరం చేరుతూ వెనక్కి ఈదుతూ ఎన్నెన్ని ఖాళీ క్షణాల నావలని నిర్దాక్షిణ్యంగా చిధ్రం చేసావో ఇప్పుడు  తలచుకుంటుంటే ఇప్పుడు నా చుట్టూ పోగు పడి ఉన్న కాంతితుణీరాల రహస్యం వెల్లడవుతుంది.

మనిషొక ఋతుభ్రమణమైతే నువ్వులేని నా నిన్నలన్నీ శిశిరాలు… మరి ఇప్పుడీ వర్తమానాలన్నీ వాసంతాలు. నిజం… నువ్వొక వాసంత క్షేత్రానివి.  

అయినా ఇప్పుడు ఇదంతా కొత్తగా చెబుతున్నానా… ఇదంతా ఎప్పటికప్పుడు నీ ముందు పరిచే అక్షర తివాచీనే కదా…

తెలుసు కదోయ్ నీకు… మరెందుకోయ్ భయం?  నువ్వు నాకే కదా… నాతోనే ఉంటావ్ కదా అంటూ బేలగా మారిపోతావ్.  నువ్వు నాకు నేను నీకు అనుకునే పరిచయపు రోజులు కాదురా ఇవి. ఎవరిమి ఎవరమో తెలియని ఐక్యతలో ఒదిగిపోయిన మానసతీవెలం.

బెంగటిల్లిన నీ మనసుని సమాధానపరచడానికి కొత్తగా నేను చేసేదేమీ లేదురా… ఎప్పటికప్పుడు మన పాత పుటలని చదువుకుంటూ చూడు. ప్రతి అక్షరంలో ఆర్తిగా పెనవేసుకున్న నీ నేనే వెల్లడవుతుంటాను.

ఏయ్… ప్రాణమా !  

రెప్పల గోదాముల్లో ఎన్నెన్ని అశ్రు సంవేదనలని నువ్వు దాయనీ… ప్రతి లిప్తలో నీ నన్ను లిఖిస్తూ… నీ చెక్కిళ్ళ చెలియలి కట్టపై మెరుపు మంత్రమేస్తా !

నీకూ నాకూ సరిపోయేంత ఆనందమే  కాదు జీవితమూ మనలో ఉంది… మనలోనే ఉంది

ఇట్లు,

నీ


ఆత్మైషి

Friday, 10 June 2016

ఈసారికిలా



నలిగి పోయిన నిన్నటి వేళలని
పలకరించినప్పుడల్లా
అవి నీకోసం ఎంతగా నిరీక్షించాయో
లెక్కే కుదరలేదు

అనుక్షణం జీవితాన్నిఅల్లాడిస్తున్న
కొన్ని ఆగంతక శబ్దాలకి దూరంగా జరుగుతూ
మిణుగురంత ఆశని ఉగ్గబట్టుకుని
కాంతి సముద్రాన్ని కలగన్నానిన్నాళ్ళు

అలలు అలలుగా కలలని దాటేస్తూ
నువ్వు తడిమిన ప్రతి వాస్తవ క్షణం
పరాభవించబడ్డ పాత సందిగ్ధాలన్నీ
పురాతనపు పాతరలోకి ప్రవహించేసాయ్

ఓ అరచేతి స్పర్శగానో
వైద్యం తెలిసిన మాటగానో
నీ సవ్వడి మొత్తం మనసుకి తాకుతుంటే
చీకటంతా ఎక్కడికో అశాంతిగా పయనం కట్టింది

నువ్వు పరిచయమయ్యాకే తెలిసింది
గుండెలోనూ కొన్ని కపోతాలు ఉన్నాయని
నన్ను శాంతింపచేసే ఉపశాంతి కోసం అవి
ఎర్రగా తడుస్తూ వేచి ఉన్నాయని

నువ్వూ నేనూ కలివిడిగా
నిలువెత్తు నడకలమై
లోకం దారుల్లో ఓ జీవితాన్ని
ఈసారికిలా లాగించేద్దాం ధైర్యమా !!!




Monday, 6 June 2016

అప స్వరం



నన్నొక హృదయంగా చెక్కుకున్న ఒక శిల్పిత్వం
తన తడిదనాన్ని ఇక్కడే మరచిందనుకుంటా
పొడి పొడిగా మౌనం కురిసేస్తుంది

లోపలున్న  ఒకే ఒక్క ఊయలనూ
తను నాకోసమే  సిద్దం చేసిందనుకుంటా
తన మనసు గోడలన్నీ తడి తడిగా తగులుతూ ఉన్నాయ్

దూరపు కొండలు మీదుగా సాగిపోతున్న భావమొకటి
ఈ మైదానం నిండా పరచిన శూన్యం బహుచిక్కనైన దనుకుంటా
విపంచియై తిమిరనాదాలని వెల్లువెత్తుతుంది

అదంతే మరి… కరుకు కాలమేదో కాటేస్తే
ఇంద్రజాలాలేవో మనసుని కప్పేస్తే
బంధాలకు  బంధాలు పడిపోతుంటాయ్ చిత్ర విచిత్రంగా

అప్పుడప్పుడూ అపస్వరం పలికితేనేం
కోయిలకి గానం రాదంటామా ఏం
తానొక సుస్వరమై వెలుగును పాడే వేళ మృదువుగా పలకరిస్తుంటే
ఏ అర్థాలూ మొలకెత్తని శబ్దాలు
ఇప్పుడు కొత్త అర్థాలేవో చెప్తున్నాయనిపిస్తుంటే
పచ్చని గరిక లాంటి మెత్తని సవ్వడేదో ఎదను చేరిందన్న మాటే

Sunday, 5 June 2016

గది



విన్నావా ఎపుడైనా
ఒక గదిని… అది చెప్పే  నీ కథని

రోజంతా నీ కోసమే వేచి ఉండే గదిని
నీ అలసటని అలవోకగా తీసివేసే గదిని
నిలబడ్డ చోటునుండే  నీ రోజంతటినీ ఆలకించే గదిని
కదలకుండానే ప్రపంచపు కథలని వినే గదిని
ప్రపంచానికి తెలియని నీ రహస్యాలని  తన గుండెల్లో దాచుకునే గదిని

నీ వంశవృక్ష ఊపిర్లకి  సాక్షీభూతమైన గదిని
మూలమూలనా అమ్మానాన్నలని పోగేసుకున్న గదిని
నీ పసి పాదాన్ని ముద్దెట్టుకుని మురిసిపోయిన గదిని
పసి పాదాలకి నువ్వు  మెట్లయిన గదిని
నీ సగభాగంతో నువ్వు  జీవితమైన గదిని

నీ కన్నీటితో తేమబారిన గదిని
నీ నవ్వులతో త్రుళ్ళి పడిన గదిని
నిన్ను నిన్నుగా చూసే గదిని
ఒక చిరునామా పత్రమై
నీకంటూ ఒక అస్తిత్వమిచ్చిన గదిని

లోకప్రకోపాలనుండి  నిన్ను దాపెట్టే గదిని
ప్రళయం కలబడినా కదలని గదిని
జ్వలనం రగిలినా ఎగిరిపోని గదిని
చూడు చూడు విని చూడు  ఆ గదిని
ఒక్క ఆత్మీయ స్పర్శ కోసం తల్లడిల్లే ఆ గదిని

ఇకనైనా...
అప్పుడప్పుడూ ఆప్యాయంగా
తడిమి చూడు తన గోడ గోడని
నిశ్చలాత్మలేవో
నీకు చేరువైన చప్పుడు వినవస్తుంది

05.06.16

నమ్మకం


మూఢనమ్మకాన్ని దాటి చూస్తే
తెలియని దేవుళ్ళని
తెలిసిన రాళ్ళల్లో స్థిరీకరించుకోవటం 
మనిషిలో సానుకూలతని పెంచే
ఒక పురాతన ఆశావాద దృక్పధం
అది కొందరి అనంతానంత
మానసిక వ్యధకు ఊరడింపు
అస్వస్థమైన జీవన గతులలో
నమ్మకాన్ని మించిన మందేముంది మరి?

తేజం



ప్రతి నేనుకూ ఒక్క నువ్వే
అయిన తన్మయత్వంలో
మేలి ముసుగుని
కప్పుకున్న నిత్యతేజస్సువి

నీ మాటనొక భగవద్గీతగా
మలచుకున్న దారిలో
నిత్య పారాయణమైన
సంకల్పపు కొనసాగింపువి

ప్రతి ఒక్కరికీ ఒక్కరే స్వార్ధమవుతారు
అందరి స్వార్ధమూ
ఒకరే అయితే అది దైవత్వమేగా
మరి అది  నీ సొంతమేగా

నువ్వు పరిచయమైన కాలపు అణువే
ఇప్పుడీ మనసున ఒక బ్రహ్మాండమై
ఒక చిన్న చిరునవ్వుని
నా పెదవులపై శాశ్వతాభరణం చేసేసింది

ఈ చిన్ని గుండెచప్పుడొకటి చాలు కదూ
నువ్వొక లోలకమై
నా లోకాన్ని సుగంధించడానికి
విశ్వమోహనమై హత్తుకుపోవడానికి

- 04.06.16

Friday, 3 June 2016

మొదలవుదాం



హృదయాలని హృద్యంగా చెక్కగలిగే శిల్పిత్వం
బ్రహ్మకి పట్టుబడే అవకాశం లేదని
యుగాల యుద్ధగాథలు తరతరాలుగా
మన చెవులకి చేరుతూనే ఉన్న ఈ కాలాన
తడిదనమంటే రక్తానిదేలేయని
శతాబ్దాలుగా సమాధాన పడుతున్న
పుడమి తల్లిని నీరడిగితే
మరేమీ చెయ్యలేదు
పొడి శ్లోకమై నెర్రెలిడటమో  
ముక్కలుగా చీలిపోయి ఆత్మహత్యించుకోవడమో తప్ప

యుగాలుగా నడుస్తున్నా గమ్యమేమిటో
తెలుసుకున్న ఒక్క మనిషిని కనుగొనలేకపోయిన
పంచభూతాల సాక్షిగా
పువ్వులు పూయని మొక్క
అంతరాంతరాలలోకి తొంగి చూస్తే
కనిపించే భావాలని
అరవిరిసిన మొగ్గలతో
అలరారే పూల మొక్క భావాలతో
పోల్చి చూసే సమయాలు
పరిచయం చేసే క్లిష్టత
జీవితపు సంక్లిష్టతని స్పష్టం చేస్తుంది
మొక్కదే కాదు మనిషిది కూడా

దారి తప్పుతున్న ఋతువులని
సరి చెయ్యడానికి
మనిషితనాలు విరిగి పడుతున్న శబ్దాలకి
నిశ్శబ్దం అద్దటానికి
ఎంతని ప్రయాసపడగలం
కుదిరితే కొత్త ఊపిర్లుగా శ్వాసించటమో   
లేదంటే ధూళిగా దిగంతాలని చుట్టెయ్యడమో తప్ప

బాహ్యాంతరాలు ఒక్కటైన సరిహద్దుగా
మారటం గమ్యమయిన సమయాల్లో
సరళమైనవేవీ మనసుకు పట్టవన్న
వాస్తవాలు పరిచయమవుతున్నాయ్
అయితేనేం ముసుగులు మాయమవుతున్న
క్షణాల తొలిజననాన్ని అద్దుకునే దేహాత్మలుగా
మొదలవ్వటం మీకూ ఇష్టమే కదూ