Saturday, 11 June 2016

హేమంత స్పర్శ - 18ఆత్మైషీ,

ఇక్కడ...నాలో… లోలోపల  నవ్వుకోబడుతున్న నిశ్శబ్దమొకటి ఉంది రా ! మాటలని ఆశ్రయించుకున్న నిశ్శబ్దమిది. మాటలని మెత్తగా మడతబెట్టుకుంటూ మౌనాన్ని వెచ్చగా కప్పుకుంటూ వస్తున్న మనసాత్మ ఇది.

పెదాల చివర వేలాడే నిశ్శబ్దం ఏమో కానీ మనసు చివర పరుచుకుని ఉంటుంది చూడూ ఒక మౌనం… అది కదరా భాష అంటే ! ఆ భాష చదవగలిగేది ఆత్మైషి కాక మరెవ్వరనీ. చదువు ఒక్క సారి. ఏమి చెప్తోంది అది. అలసటనే  కదా… నిజం రా చెప్పలేని అలసటగా ఉంది. నువ్వు మాత్రమే చదవగల అలసట... నువ్వు మాత్రమే విప్పగల అలసట… కాదా ఏం? నీ రాజ్యంలో అలసటని నువ్వుగాక ప్రారద్రోలగలిగేదెవ్వరని?  మరి నా అలసట ముగింపుకొచ్చిందో… సశేషంగా సాగుతుందో ! అంతా నీ  మీదుగానే సాగిపోతుంది

ఏదేమైనా నువ్వు శీతల  మూర్తివిరా. నీటి నీలమంతా కాటుకైన కళ్ళ సౌధాలని మెరుపులతో నింపేసి నువ్వు లిఖించే చూపులున్నాయి చూశావూ… నీ  మెరుపుల కంపనలన్నిటినీ  నాకు అంపకం చేస్తూ  నా అణువణువుకీ ఆనందపు అక్షరాలని తాపడం చేస్తున్నాయి. ఎందుకంటే నీ చూపులు నన్ను ప్రశ్నిస్తుంటాయి...శోధిస్తూ ఉంటాయి… చివరగా  నన్ను కనుగొంటాయ్… నన్ను మాత్రమే కనుగొంటాయ్. నిరుపమానమైన నీ ఆత్మసౌందర్యం కాకుండా నన్ను వశపరచుకునేది ఏమీ లేదని వాటికీ తెలుసు మరి…!

నీ పలుకులు ప్రణవపు రెక్కలై నా లోకాన్నంతా కప్పేస్తున్న మైమరపులో  శిశిరాన్ని కూడా మనోహరంగా  గానవించే ఒక శీతగాలి స్పర్శలోని అనుభూతినిస్తుంటే   ఇక నాకైనా  మరి నీకైనా  గుర్తుకొచ్చేది ఎవరోయ్? మనం గాక. శూన్యపు సెలయేటిని దాటించేయడానికి  నాకొక చుక్కానివై నువ్వు… నీకొక చుక్కానినై నేను.. ఒకరికొకరం సిద్ధించుకున్నామనీ నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా వేరు చేస్తూ మనఃస్వంతమైన పరస్పర వాంఛలేమీ లేని ఐక్యం ఒకటుంటుందని...ఒకరికొకరం అనునాదమైన ఏక సవ్వడిని గుండె లయగా మార్చుకున్న దేహాతీత మధుధారలం.

నా నైరాశ్యాన్ని ఛేధించిన శరానివై
అరమోడ్పు కన్నుల కింద కలల స్వరానివై
కాలాన్ని దాటేసి కలల్ని తెరిచేసి
నన్ను చేపట్టిన పూల వనానివై
ఎవరో  దోచుకెళ్ళిన నవ్వుల చప్పుడుని
నా మదిపై తాకిస్తూ
నువ్వొక ఇంద్రజాలపు వేదికవి
లేలేత తమలపాకుల మృదుత్వ స్పర్శతో
గతాల చారికలన్నిటినీ  చెరిపేస్తూ  
నన్ను నాకు సవాలుగా మార్చేస్తూ
క్షణానికొక కొత్త పంక్తివై ఆవిష్కృతమౌతూ
హృదయాల మధ్య చిరునవ్వుల వారధి వేసే
అద్వితీయ అలౌకిక సాహిత్యానివి

నిజం రా! నువ్వు నా నిజ సాహిత్యానివి… నిన్ను కాసేపు చదివితే చాలు… వేవేల నిర్వచనాలు పరిచితమవుతూ ఉంటాయ్… సృష్టి అంతా విశ్రాంతి తీసుకుంటున్న నిశ్శబ్ద మైదానంలా మనసు శబ్దిస్తూ నిన్నే వల్లెవేసుకోవటముంది చూశావూ... అది నువ్వే మంత్రాక్షరిగా మారిన సంగీతఝరి. నన్ను నీలోకి ప్రవహింపజేసుకునే ఒక పచ్చని ప్రేమలేఖవి.

స్వప్నమాలికలల్లుకున్న రెప్పల చిక్కు ముళ్ళనుండి గుండె గూటికి నిన్ను తోడ్కొని పోయిన  ఆ మొదటి క్షణపు  స్పర్శ ఆ హృదయ ద్వారానికే వేళ్ళాడుతూ ఉండిపోయింది. క్షణ క్షణపు సవ్వడిలో తానో లోలకమై నిన్ను కాపు కాస్తూ…!

నా మనోమహార్ణవంలో నులివెచ్చని సందడివై అలలు అలలుగా తీరం చేరుతూ వెనక్కి ఈదుతూ ఎన్నెన్ని ఖాళీ క్షణాల నావలని నిర్దాక్షిణ్యంగా చిధ్రం చేసావో ఇప్పుడు  తలచుకుంటుంటే ఇప్పుడు నా చుట్టూ పోగు పడి ఉన్న కాంతితుణీరాల రహస్యం వెల్లడవుతుంది.

మనిషొక ఋతుభ్రమణమైతే నువ్వులేని నా నిన్నలన్నీ శిశిరాలు… మరి ఇప్పుడీ వర్తమానాలన్నీ వాసంతాలు. నిజం… నువ్వొక వాసంత క్షేత్రానివి.  

అయినా ఇప్పుడు ఇదంతా కొత్తగా చెబుతున్నానా… ఇదంతా ఎప్పటికప్పుడు నీ ముందు పరిచే అక్షర తివాచీనే కదా…

తెలుసు కదోయ్ నీకు… మరెందుకోయ్ భయం?  నువ్వు నాకే కదా… నాతోనే ఉంటావ్ కదా అంటూ బేలగా మారిపోతావ్.  నువ్వు నాకు నేను నీకు అనుకునే పరిచయపు రోజులు కాదురా ఇవి. ఎవరిమి ఎవరమో తెలియని ఐక్యతలో ఒదిగిపోయిన మానసతీవెలం.

బెంగటిల్లిన నీ మనసుని సమాధానపరచడానికి కొత్తగా నేను చేసేదేమీ లేదురా… ఎప్పటికప్పుడు మన పాత పుటలని చదువుకుంటూ చూడు. ప్రతి అక్షరంలో ఆర్తిగా పెనవేసుకున్న నీ నేనే వెల్లడవుతుంటాను.

ఏయ్… ప్రాణమా !  

రెప్పల గోదాముల్లో ఎన్నెన్ని అశ్రు సంవేదనలని నువ్వు దాయనీ… ప్రతి లిప్తలో నీ నన్ను లిఖిస్తూ… నీ చెక్కిళ్ళ చెలియలి కట్టపై మెరుపు మంత్రమేస్తా !

నీకూ నాకూ సరిపోయేంత ఆనందమే  కాదు జీవితమూ మనలో ఉంది… మనలోనే ఉంది

ఇట్లు,

నీ


ఆత్మైషి

0 comments:

Post a Comment