హృదయాలని హృద్యంగా చెక్కగలిగే శిల్పిత్వం
బ్రహ్మకి పట్టుబడే అవకాశం లేదని
యుగాల యుద్ధగాథలు తరతరాలుగా
మన చెవులకి చేరుతూనే ఉన్న ఈ కాలాన
తడిదనమంటే రక్తానిదేలేయని
శతాబ్దాలుగా సమాధాన పడుతున్న
పుడమి తల్లిని నీరడిగితే
మరేమీ చెయ్యలేదు
పొడి శ్లోకమై నెర్రెలిడటమో
ముక్కలుగా చీలిపోయి ఆత్మహత్యించుకోవడమో తప్ప
యుగాలుగా నడుస్తున్నా గమ్యమేమిటో
తెలుసుకున్న ఒక్క మనిషిని కనుగొనలేకపోయిన
పంచభూతాల సాక్షిగా
పువ్వులు పూయని మొక్క
అంతరాంతరాలలోకి తొంగి చూస్తే
కనిపించే భావాలని
అరవిరిసిన మొగ్గలతో
అలరారే పూల మొక్క భావాలతో
పోల్చి చూసే సమయాలు
పరిచయం చేసే క్లిష్టత
జీవితపు సంక్లిష్టతని స్పష్టం చేస్తుంది
మొక్కదే కాదు మనిషిది కూడా
దారి తప్పుతున్న ఋతువులని
సరి చెయ్యడానికి
మనిషితనాలు విరిగి పడుతున్న శబ్దాలకి
నిశ్శబ్దం అద్దటానికి
ఎంతని ప్రయాసపడగలం
కుదిరితే కొత్త ఊపిర్లుగా శ్వాసించటమో
లేదంటే ధూళిగా దిగంతాలని చుట్టెయ్యడమో తప్ప
బాహ్యాంతరాలు ఒక్కటైన సరిహద్దుగా
మారటం గమ్యమయిన సమయాల్లో
సరళమైనవేవీ మనసుకు పట్టవన్న
వాస్తవాలు పరిచయమవుతున్నాయ్
అయితేనేం ముసుగులు మాయమవుతున్న
క్షణాల తొలిజననాన్ని అద్దుకునే దేహాత్మలుగా
మొదలవ్వటం మీకూ ఇష్టమే కదూ 






0 comments:
Post a Comment