విన్నావా ఎపుడైనా
ఒక గదిని… అది చెప్పే నీ కథని
రోజంతా నీ కోసమే వేచి ఉండే గదిని
నీ అలసటని అలవోకగా తీసివేసే గదిని
నిలబడ్డ చోటునుండే నీ రోజంతటినీ ఆలకించే గదిని
కదలకుండానే ప్రపంచపు కథలని వినే గదిని
ప్రపంచానికి తెలియని నీ రహస్యాలని తన గుండెల్లో దాచుకునే గదిని
నీ వంశవృక్ష ఊపిర్లకి సాక్షీభూతమైన గదిని
మూలమూలనా అమ్మానాన్నలని పోగేసుకున్న గదిని
నీ పసి పాదాన్ని ముద్దెట్టుకుని మురిసిపోయిన గదిని
పసి పాదాలకి నువ్వు మెట్లయిన గదిని
నీ సగభాగంతో నువ్వు జీవితమైన గదిని
నీ కన్నీటితో తేమబారిన గదిని
నీ నవ్వులతో త్రుళ్ళి పడిన గదిని
నిన్ను నిన్నుగా చూసే గదిని
ఒక చిరునామా పత్రమై
నీకంటూ ఒక అస్తిత్వమిచ్చిన గదిని
లోకప్రకోపాలనుండి నిన్ను దాపెట్టే గదిని
ప్రళయం కలబడినా కదలని గదిని
జ్వలనం రగిలినా ఎగిరిపోని గదిని
చూడు చూడు విని చూడు ఆ గదిని
ఒక్క ఆత్మీయ స్పర్శ కోసం తల్లడిల్లే ఆ గదిని
ఇకనైనా...
అప్పుడప్పుడూ ఆప్యాయంగా
తడిమి చూడు తన గోడ గోడని
నిశ్చలాత్మలేవో
నీకు చేరువైన చప్పుడు వినవస్తుంది
05.06.16







0 comments:
Post a Comment