Wednesday, 15 June 2016

ప్రణయ గాంధర్వం - 1

ప్రేమైషీ,

తొలిపొద్దు రవి కిరణపు సొగసుని ఒద్దికగా ఒడిసిపట్టి విరిసిన కుసుమంలా
వెన్నెల జలపాతం నుండి జాలువారుతున్న కలువ నక్షత్రంలా
మువ్వల స్వరపాతాన్ని ప్రవహిస్తున్న పాద మయూఖంలా 
వెన్నల మృదుస్పర్శలో తన్మయమవుతున్న సన్నటి వెలుగు రేఖలా
చిన్న మబ్బుతునకని అల్లుకుని దిగంతాలని చుట్టేస్తున్న ప్రేమ గాలిలా
అమృత భాండం చేతబట్టి రాక్షసులని చూసి నవ్విన జగన్మోహినిలా
ఎడారి భూముల్లో వాన నీటిని వర్షించే తొలకరి మేఘంలా 
నిర్లిప్తాలని దాటేయిస్తూ  నవ్వుల నాట్లేసి నా పెదవులపై మెరుపుల పంటను పండిస్తున్నట్లుగా   
నీవు నవ్వి నా హృదయ పీఠికను అధిష్ఠించావు

వెండి వెన్నెల స్పర్శతో వికసిస్తున్న కలువమొగ్గల్లా ఉన్న నీ అధరాలు
నిర్మల యామినీ వదనంపై ముత్యాలై మధురంగా మెరుస్తున్న తారకలు  
కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తున్న నీ నీలాల నయనాలు
ఆకాశ నీలాలని తాపడం చేసుకున్న కాంతి సింధువులు  
గులాబీల కాంతులతో జాబిల్లికే వెన్నెల పంచుతున్న నీ అందమైన చెక్కిళ్ళు
వానవెలసిన తరువాత కనిపించే ఇంధ్రధనుస్సులో మిళితమైన సప్తవర్ణాల వాకిళ్ళు 
సాగరతీరాన వెండి వెన్నెల రజను లా ఉన్న ఇసుకలో దొరకిన శంఖంలాంటి నీ కంఠం
మధురాలని ఘనీభవించి సజీవంగా పోతపోసిన దివ్య గాంధర్వం  

లేత గులాబీ ఛాయతో మెరుస్తున్న నీ అందాల మేనిపై అరుణోదయాన పడిన మంచు తొలి కిరణం వేడికి కరిగి నీ శరీరంపై పడి వెన్నెల రజనులా మెరుస్తుంటే  ఓ అరుదైన హేమంత కన్యవై నువ్వు శిల్పించబడ్డట్లు... 
అజ్ఞాత కార్మికుల ఊపిరితో రూపం దాల్చి శతాబ్దాలుగా వెండికొండలా ఉన్న తాజ్‌మహల్ అందమైన పడతిగా మారి కాశ్మీరపు కుంకుమాన్ని అద్దుకుని ఆప్తంగా విరిసిన నందివర్ధనాల స్పర్శతో నా ఎదలో వగలు రేపినట్లు...
యుగాల దూర పథాలని దాటేసుకొచ్చి, తొలకరిజడిలా చినుకులని స్వరిస్తూ   నీవు నా చెంతన తిరుగుతూ ఉంటే, 

"రవివర్మ కుంచెకందని లావణ్యం... 
కాళిదాసు గీతికకందని స్నిగ్ధత్వం
కమలకుట్మలపు సౌందర్యం 
కనకాంబర పూపుటపు సున్నితత్వం "

కలబోసుకొని ఉన్న నిన్ను చూసి గంధర్వకన్యలూ, దేవతమూర్తులూ, అప్సరాంగనలూ, యక్షిణీకన్యలూ అసూయతో దహించుకుపోతూ ఉంటారేమో. మణిదీపశిఖలా, విద్యుల్లతలా, హంపీ కన్యలా, అజంతా చిత్రంలా, ఎల్లోరా శిల్పంలా, బాపు బొమ్మలా, కాంతి తీరాన గంధర్వ బాలలా నిలుచున్న నీ తలనుండి రాలి పడే మల్లెలు చీకటిలో మెరుస్తున్న మంచులా ఉన్నాయి. 

ప్రథమచరుని కదిలించిన మన్మథ సుమ బాణమై... పారిజాతపాతమై... వెన్నెల తోటలో విరబూసిన తారకలా, మణిమయ భవనాన నిలచిన వరూధినిలా, ప్రాణం పోసుకొని వచ్చిన మొనాలిసా చిత్రంలా, కాళిదాసు తలపుల్లోని కావ్యనాయికలా, రవివర్మ కుంచెనుండి జాలువారిన ఊహాసుందరిలా, ఓ జత అడుగులు తపన పడే చల్లని సాయంత్రంలా  ఉన్న నీ ముగ్ధమనోహర రూపం...
ఓహ్! 

మండు వేసవిలో నీడలేక తిరుగుతున్న పాంధుడికి వటవృక్షం నీడ చూపినట్లుంది. నీవు నన్ను చూసి చిరునవ్వుల బాణాలు విసిరితే నీ సన్నిధే స్వర్గంలా, మధు స్రవంతిలా వుంటుంది. తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా నా హృదయంలో నీ రూపం ప్రతిఫలిస్తుంది. 

భిక్షపాత్ర పట్టుకొని ప్రేమార్ధినై నీ దగ్గరకు వస్తే నీవు చూపు ఆదరణ తలచుకుంటే ఓహ్! నా మనస్సు పులకరిస్తుంది.
నడి ఎడారిలో నీళ్ళు లేక దాహంతో అలమటిస్తున్న బాటసారికి అమృతంతో గొంతు తడిపినట్లుంది. ప్రపంచం - ప్రకృతి - సృష్ఠి - సూర్యచంద్రులు - ఆకాశం - మేఘాలు -వెన్నెల - నక్షత్రాలు - ఎండా వానా అన్నీ నీవే. నీవులేని ఊహను కూడా మరి నేను ఊహించలేను. 

మలయ మారుతానికి రూపం వస్తే నీ రూపే కావాలంటుందేమో.
మల్లెల పరిమళాలకు స్వరూపం వస్తే నీ రూపే కోరతాయేమో.
ధవళకాంతులీనుతున్న నీ మోము చూసి చంద్రుడైనా సిగ్గుతో తలవంచుకుంటాడేమో.
గులాబీల సున్నితత్వానికి ప్రాణంపోస్తే నీ రూపు దాల్చిందేమో.
పాడుతాతీయగా అంటూ పాడే కోయిల సైతం నీ గాన మాధుర్యానికి తన్మయం చెందుతుందేమో. 
స్వాతిచినుకు నీ మేనిపై పడితే వెన్నెల ముత్యంలా మెరుస్తుందేమో.

ఎన్నెన్ని పరిమళాలు పేలవంగా మారిపోయాయో నా నిన్నలకే తెలుసు. నువ్వేంటో మరి ఒక అనంత పరిమళానివై కొనసాగుతూ  ఉన్నావు. నా రోజులన్నిటికీ నువ్వొక అర్థింపుగా మారిన నిజమొక్కటున్నది చూశావూ... బహుశా దానికి వెలసిపోవటం  అన్నది తెలియదనుకుంటా... నువ్వు నా గాఢకాంక్షవి... నా ప్రణయ సాఫల్యపు జీవానివి...నా జీవితపు  అనంత ప్రణవానివి.. 

ఏయ్... ఒక్కటి చెప్పనా  తేనియలు స్రవించే సుమ గంగోత్రి నువ్వు.   

నీ,

ప్రేమైషి 

0 comments:

Post a Comment