Sunday, 27 November 2016
ఆ రాత్రి
ఆ రాత్రి
ఒక పరిమళమేదో హత్య చేయబడింది
లోలోని పత్రహరితమేదో
అత్యాచారానికి గురయినట్లుగా
నవ్వులన్నీ నిర్జీవమై
నిండు శూన్యంలోకి ప్రవహిస్తున్నాయి
ఒక శిశిరాన్ని పోతపోసుకుని
ఇహం లో కూరబడ్డ చీకటంతా
మనసులోకి చేరుకోవాలని పడే తపనకు
కంటి తడేదో ఇంధనమైనట్లుంది
విశృంఖలంగా తిమిరాన్నిచేరవేస్తుంది
కళ్ళకి కాటుకలా
తనకి చీకటి ఆడంబరమనుకుందేమో
మనసు తనని ముచ్చటగా హత్తుకుంటుంది
తలుపు తడుతున్న వెలుగు సవ్వడిని
ఆలకించలేనంత మైమరపుతో
అప్పుడలిగి వెళ్లి పోయిందో దీపం
లోకాన్ని వెలుగుమయం చేస్తూ
Sunday, 20 November 2016
మనుషుల్ని రాసుకుందాం రా
కాసేపిలా కూర్చుని మనుషుల్ని రాసుకుందాం రా
మనుషులంటే?
ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక తమ్ముడు …
వాళ్ళు ఒక కుటుంబం రా
ఒక బాబాయ్, ఒక పిన్ని, ఒక మామయ్యా, ఒక అత్తయ్య…
వాళ్ళు బంధువులు రా
పాలవాడు , పూల వాడు, ఎదురింటాయన, పక్కింటాయన…
ఈ అందరినీ సమాజమంటారోయ్
ఒక నువ్వు, ఒక నేను, ఒక వాడు, ఒక తను…
మనం స్నేహితులం రా
అన్నిటికీ ఏదో చెప్తున్నావ్… మరి మనుషులంటే ఎవరు?
కుక్క, నక్క, పులి, పిల్లి, చెట్టూ చేమా
అంటూ కనిపించిన వాటన్నిటికీ నామకరణం చేసాడు చూడు
వాడికి పేరు పెట్టేవాడు లేక
తనకు తాను పెట్టుకున్న పేరు రా మనిషంటే
నువ్వు మరీ చెప్తావ్
మనమంతా మనుష్యులమే
ఓ.. నిజమా ! అలా అయితే
మరి నువ్వు పుట్టాక ఎవరినైనా మనిషీ అని పిలిచావా…
పోనీ ఇకపై పిలుస్తావా
‘-----’
‘మనిషంటే ఓ పవిత్ర భావం
మనిషంటే జగతికి కాపలా దారు
మనిషంటే సకల జీవకోటికీ రక్షకుడు
మనిషంటే ఎదిగే కొద్దీ ప్రకృతిగా మారే వాడు’
మరి ఇప్పుడు రాసి చూపించవూ ఒక్క మనిషిని
‘-----’
ఆ కాస్త నడిచాక
భూమ్యాకాశాలు కలిసినట్లుండే చోటే కానరాని
నగర స్పర్శలలో
ఆకాశ హర్మ్యాలు మొలిచిన చోట
చూపులకు సరిహద్దులు కట్టబడి
ప్రకృతి దృశ్యం చిన్నబోతుంది
కలల పరిధి పెరిగినప్పుడల్లా
కుంచించుకుపోతున్న హద్దుల్లో
ఇక్కడ జీవితం
చాలా చిన్నదన్న నిజం
తలపుకొచ్చాకే తెలుస్తుంది
విశాలాకాశపు హద్దులనీ
మా చూపులకి మాయం చేస్తూ
కళ్ళు చూడగలిగే అనంతాన్నీ దూరం చేసే
పేదరికమూ ఒకటుంటుందని
అది మనిషి దృశ్యాన్నే కొల్లగొడుతుందని
నాకు నేను చిన్నగా అయినప్పుడే తెలిసింది
***
శరీర పరిమాణమే ప్రమాణమై
కళ్ళకందినంత దూరమే
ముచ్చటైన చోటును దాటి నడిచాక
విశ్వపు కొలత మొత్తం
మనసు పరిభ్రమణంలో ఇమిడిపోతుంటే
Thursday, 17 November 2016
దేహం
లోపల ఏముందో
ఈ దేహానికి
ఎప్పటికీ తెలియదన్నది నిజమే కావచ్చు
నరాల అల్లికలో
కవాటాల బిగింపులో
అలుపెరుగని ఇంధనం
ఒక్క క్షణం గడ్డకడితే చాలు
మాయమయ్యే ఆత్మ తావేదో
ఎవరికీ తెలియదు
ఎంతటి సమున్నత ఆత్మ ఉంటేనేం
ఎంతటి పవిత్ర జ్యోతిగా అది వెలుగుతుంటేనేం
తన విలువంతా
దేహం క్షేత్రంగా ఉన్నంతవరకే
మరి వాహకం లేని చోట ఆత్మకి ఉనికి రాసేదెవరని
ఊపిరున్నంత వరకూ
దేహమే ఓ అహం…
ఆడంబరం
అనంతాన్ని స్పృశించే ఆత్మని
నిలుపుకున్నంత సేపూ
దేహమే దేవాలయం
Thursday, 6 October 2016
కర్బనం
1.
యుగ యుగాల భగభగలన్నీ
మంచు శిలల్లా ఘనీభవించాయని
చదివిన చరిత్ర పాఠాలన్నీ కంఠోపాఠమై
దాటి వచ్చిన దారుల్లోకే
తిరిగి వెళ్ళాలన్న మనిషి తపనంతా
నాగరికమై ప్రయాణం కట్టేసింది
2.
అసంకల్పిత విపత్తులంటూ లేవని
వచ్చేవన్నీ మానవ నిర్మిత ప్రళయాలంటూ
మనిషి చెవిలో పోరుపెట్టే ధైర్యం
ఇంకా ఏ నొసటన రాయబడినట్లు లేదు
3.
పంచ భూతాల ఓపికకూ
సరిహద్దుల లెక్కలుంటాయన్న
ఎరుకేలేని యుగాన
అన్ని ఊపిర్లకీ ఒకటే ముగింపుని
లిఖించుకోవడం
మనిషి స్వహస్తాలతో రాసుకున్న శాపవచనం
4.
నేడు వేడెక్కిన నేలనడిగితే చెప్తుంది
రేపటి రోజున విచ్ఛిన్నమయ్యే
మన అడుగుల జాడల ముద్రల భవితవ్యాన్ని
5.
జీవ విధ్వంసమెంత గుండె శోకమో
మనిషి సారాంశమంతా నింపుకున్న
మట్టి గర్భానికే తెలుసు
ప్రళయాలన్నిటిలో ముగిసిన ప్రాణాల లెక్క
తెలిసిన ఒకే ఒక్క సాక్షి తానేగా మరి
6.
ఎవరికి వారు
గంట కట్టుకోవాల్సిన సమయమిది
లేదంటే
ప్రళయాంతర జీవానికి
నేటి మనిషే కర్బనం
Wednesday, 5 October 2016
తను
ధ్వనిస్తుంది తను
సీతాకోకచిలుకల రెక్కల స్వరపాతపు ఝరిలో
మాతృ గర్భం నుండి మొదలైన ఇంద్రియాల కదలికలో
శ్వాసల పుప్పొడి చల్లుతున్న ఊపిరుల జీవంలో
ఆకు దాపెట్టుకున్న వాన చినుకు తడిదనంలో
మనసిల్లిన క్షణాల భావాక్షతల సొగసులలో
గడ్డ కట్టింది తను
సాయంత్రపు వ్యాహ్యాళి కనుగొన్న నిశ్శబ్దపు ప్రపాతంలో
హేమంతం చెక్కుకున్న తెలి మంచు శిలల్లో
జాబిల్లి జాలు వార్చిన వెన్నెల లతల లాలిత్యంలో
మైదానం రాసుకున్న ఆకుపచ్చని గరికపాతాల్లో
ఊపిరొచ్చింది మొదలు నా మనసు గేహంలో
నింపుకుంటుంది తను
ఉరుముల అల్లరిని జోకొట్టి వస్తున్న వానలిపిని
కాలం పొడుగూతా మౌనంగా ఘనీభవించిన నా ఎద సవ్వడిని
ఆనందానికై నేను రాసుకున్న అలుపెరుగని యుద్ధాన్ని
తన ఊపిరి పొలిమేరల్లోనే తచ్చాడుతున్న నా ఆత్మని
విశ్వ చైతన్యాన్ని పహారా కాస్తున్న ఆకాశపు అనంతాన్ని
శిక్షిస్తుంది తాను
భావ సౌధాన్ని అతాలాకుతలం చేసే అభావాన్ని
మనసు గదుల నిండా పేరుకుపోయిన చిమ్మ చీకటిని
గుండెకి చెమ్మ పట్టించే ఒంటరితనాన్ని
నా కంటి కొసన కదలాడే కృష్ణబిందువును
నా అణువణువునా అంతర్లీనమైన రహస్య శోకాన్ని
Tuesday, 4 October 2016
రహస్యం
విశృంఖలంగా పెరిగిపోతున్న
మోహకారణాల వశీకరణ మొలకల
క్రీనీడల రహస్యాలు బట్టబయలై
నివురుకప్పని నిప్పుకణికల్లాంటి
వ్యక్తిత్వాల అస్తిత్వం ప్రతిధ్వనించే
వేళల రాక ఎప్పుడన్నది
ఎన్నటికీ అంతుబట్టని రహస్యమే
రహస్యమన్నదేదీ రహస్యంగా
కొనసాగ కూడదన్న మనిషి పంతంలో
ఇక్కడే వీడిపోవాలీ రహస్యం
అనుకున్నంత సేపూ
అక్కడే తచ్చాడే
మాయా జాలమే ఈ విశ్వరహస్యం
ఎక్కడికక్కడ గడియ వేసేసుకున్న
ఆలోచనలతో ప్రతి తానూ ఒక తనకి
రహస్యమేనన్న నిజం
లోకం ఎన్నటికీ ఒప్పుకోని
నగ్నసత్యమైతేనేం, నీకు నిన్ను
ఒక అందమైన అబద్ధంగా అట్టిపెట్టుకోవటం
ఎంతో ఇష్టమైన వ్యాపకం కదా
అయినా… నీలోపలికి ఎవ్వరినీ రానివ్వని నీకు
ఏ లోపల ఏముంటే ఎందుకోయ్
యుగాలుగా మట్టి ముద్ద రహస్యమే
అవగతమవ్వని నీకు
రహస్యాల రహస్యం ఎప్పుడూ
మార్మిక కాసారమే


















