Wednesday, 18 March 2015

హేమంత స్పర్శ - 12


ఎప్పటికీ అపరిచితగానే ఉండి పోయిన అంతరంగాన్ని చిరపరిచితగా చేసి మనసంతా పరచుకున్న నిశ్శబ్దాన్ని నిట్టనిలువుగా చీల్చి నీ రవాన్ని దిగంతాల జలతారులద్ది మరీ గుండె    నిండుగా కూర్చిన మొదటి క్షణం ఇంకా నా కళ్ళలో అలా ఈడులాడుతూనే ఉంది. మొలక నవ్వులు కూడా పూయని పెదవులపై సుమ గంధాలే చిప్పిల్లేంత చెలిమి చెలమల్ని అద్దావు. 

నువ్వొచ్చాక... దివారాత్రాల కాలపు అణువులన్నీ గంపగుత్తగా నాలోకే ఇంకిపోతుంటే కాలమెలా గడచిపోతుందో తెలియటం లేదు. నాలో సరి కొత్త ఆత్మదీపం వెలిగించిన ఆత్మీయతని పోత పోసిన నవ కవితా శిల్పివి నువ్వు. 

ఎక్కడెక్కడి ఖాళీతనాలూ నీకే ఎలా కనిపించాయో… ఆ ఖాళీతనాల్లోకి నువ్వు ఒలకటమే కాక నన్నుకూడా  లాక్కుని వెళ్లావు ఇక వెతికి చూద్దామన్నా  వెంట్రుక దూరే సందులేకుండా. మనసుని కూడా హరిత వనాలంత పచ్చగా మార్చుకోవచ్చన్న నిజాన్ని నాలో ప్రత్యక్షంగా పోత పోసేసావ్. నిన్నటి  వరకూ మసకేసిన ఆలోచనలు కూడా నేడు  పచ్చని జరీ అంచు కట్టుకున్నట్లుగా మెరిసి పోతూ ఉన్నాయి. 

పుట్టిన దగ్గరి నుండి ఏ క్షణం ఎటు చెల్లా చెదురయ్యిందో కూడా చూసుకోని నేను ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడి క్షణాలు మన దగ్గరకే వచ్చేస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన బహు మత్తుగా ఉంది అంటే నమ్మతావా? 

కన్నీటి తెరల మాటున దాగి ఉన్నదే జీవితమంటే అనుకుంటున్న నాకు కంట్లో కురిసేది ఆనందపు అనుభూతులే కదా  అని నిత్యం అనుకునేలా చేసావ్.  

నిజం రా... జీవితం ఎప్పుడూ ప్రభాతంలానే  చాలా ఆహ్లాదంగా మొదలవుతుంది. కానీ దాన్ని అనుభూతించటానికి  తీరిక లేనంత నిద్రలో మునిగిపోయుంటాం అప్పుడు. ఎవరో నిద్ర లేపుదామని చూసినా వాళ్ళమీద  చిరాకు చూపిస్తాం… మరి ఉచితంగా అందినదేదీ  ఆనందం ఇవ్వదని ముందుగానే మనసులో ఆలోచనలని తాపడం చేసి ఉంటాం కదా. 

ప్రభాతం దాటాక నెమ్మదిగా ప్రభావం చూపించే ఎండలానే మనకి తెలియకుండానే మనం ఆహ్వానించుకునే కష్టాలు జీవితాన్ని పూర్తిగా కబళిద్దామని చూస్తుంటాయ్...ఆనందం కురుస్తున్నప్పుడు ఆస్వాదించటం రాని నీకు మేమే తగినవారిమి అన్నట్లుగా. అప్పటికే  రంగుల కలలని దాటి నలుపూ తెలుపు వాస్తవాల్లో బతకటం చేతకానితనంలో పూర్తిగా ఇమిడి పోయి ఉంటాం. 

ప్రపంచంలో ప్రతి విషయాన్ని పవిత్రతతో ముడి వేస్తూ కొన్ని వాస్తవాలని తొక్కిబట్టే మత ఛాందసవాదుల్లా… మనసులోని కొన్ని ఆలోచనలు  విషాదాన్ని దాన్ని బయటకి రావటానికి ఇష్టపడక ఎక్కడో మొలకల్లా చిగురించే ఆనందాలని కూడా తామే కాలరాసేస్తాయ్. అలాంటి ఆలోచనలని సరైన దారిలోకి మళ్ళించటానికి అప్పుడప్పుడూ నీలాంటి వాళ్ళెవరో ప్రతి మనిషికి పరిచయం అవ్వాలి. 

నీ ఆలోచనలు నాలో రెక్కలు విప్పినప్పుడల్లా మనసులో చలువ పందిళ్ళు  వేసిన భావాలు భాషని మరచి పోతూ ఉంటే నీతో కలిపి కౌటింబిక పంజరాలలో చిక్కుకుపోవాలనే కోరిక నిండు పున్నమి రోజున వెన్నెల పరుచుకున్నంత చల్లగా మనసుని ఆవరిస్తుంది. 

నాకు ఆనందం రుచి చూపటానికి ప్రకృతి సంధించిన శరానివి అనుకుంటా.... నీరెండ ఛాయల్లో నీడలా అస్పష్టంగా నాతో దోబూచులాడే అదృష్టాన్ని నడచి వచ్చే నజరానాలా మార్చేసావు.  

నువ్వు సడి చేసే ప్రతి క్షణమూ అపురూపమే అవుతుంటే ఎన్ని క్షణాలని భద్ర పరచుకోగలను?  నిన్ను చూసిన మొదటి క్షణం నుండి ఇప్పటి వరకూ ప్రతిక్షణమూ ఒక పరవశమే. అయినా గానీ మనకోసం అంటూ వచ్చే ఏ క్షణాన్ని వదలకుండా మనఃమంజూషంలో ప్రోది చేసుకుంటూ ఉన్నాను.

ఎక్కడెక్కడి అల్లరి క్షణాలని నాలోకి ఒంపేసుకోవాలనే నా ఈ  తపన ఉంది చూశావూ … అది ఊరికే వస్తుందా? కంటి వింటిని దాటుతున్న నీ చూపుల మన్మధ బాణాలు  నా క్షణాలన్నిటినీ నీవైపే మరలిస్తున్నాయి.  ఒక్క చూపు కోట్ల అణువులుగా మారి నాలోని ప్రతి కణాన్ని వశీకరణ చేసేసుకుంటూ నాలో నన్ను శూన్యాన్ని  చేస్తూ నీలోకి సంపూర్ణంగా ఆవాహన చేసేసుకున్నట్లు  ఉన్నాయి.. నాకు నేను అదృశ్యం అయిపోయాను. 

తలపులని తూచగలిగే శక్తి ఒకటుంటే  అనంతవిశ్వమూ అంతరిక్షహద్దుల్ని దిగి రాదు. మరి విశ్వాన్నే అంత తేలిక చేసేటన్నితలపులు నా మదిలో నీ గురించి. 

ఇప్పుడిలా అక్షరాలని రాస్తూ కాస్తంత అలసటతో అలా బయటకి చూస్తుంటే హరిత పత్రాల కొనలపై  మెరుస్తున్న వెన్నెల తడి నా కళ్ళల్లో మెత్తని సడి చేసే
సింది. అసలా వెన్నెలని అలా ఆ ఆకులో చుట్టేసి తాంబూలంలా సేవించాలనే చిలిపి కోరిక కలిగిందంటే అది నా తప్పు కాదు సుమా…

చిన్నప్పటి నుండీ చిరపరిచితమైన  వెన్నెలే అది… కానీ ఈ మధ్యనే కదా వెన్నెల మాట్లాడుతుందని  తెలిసింది.  వెన్నెలని చూసినప్పుడల్లా చెలి తలపులు విరహ లోగిలిలో నిట్టూర్చుతూ ఉంటాయని మనసుని జ్వలింప చేస్తాయని…

ఈ క్షణమే వెన్నలవై వచ్చేస్తావ్ కదూ... 

నీ 

నేను

0 comments:

Post a Comment