Friday, 13 March 2015

అసమర్ధుని ప్రేమలేఖ

రేయ్…

గుండెల్లో పుట్టిన  జలపాతాలని కంట్లో  నవ్వులుగా కురిపిస్తూ నీ వియోగ జీవితాన్ని మొదలు పెట్టిన మహానటుడిని రా నేను…! 

కాదన గలవా ? 

అయినా కాదనటానికీ అవుననటానికీ ఇప్పుడు నేను నీకేం అవుతానని? 

నేను నీకు ఏమీ అవ్వనా? నీ వాడిని కాదా?

అసలు ఆలోచనల్లో నిన్ను అనంతాన్ని చేసిన నాకన్నా దగ్గరి వాడెవడట నీకు? నీ భౌతిక రూపాన్ని చూస్తూ… అను క్షణం అర్థశాస్త్రపు లెక్కలు పంచుకుంటూ ఉండే మరో బౌతిక పదార్థమా?  

ఒక్క సారి నా మనసులోకి వచ్చి చూడు.  నువ్వేంటో నీకే అర్ధం అవుతావు… నాదీ హామీ…! కానీ నువ్వు రావు. నాకు తెలుసు నువ్వు రావు. ఎందుకంటే రాయి పొర కప్పుకున్న ఈ గుండె తడి నిన్ను చేరే దారి నేనే శాశ్వతం గా మూసేశాను. ఇది తప్పో ఒప్పు నాకు తెలియదు. నాలో తడి ప్రతి నిత్యం నీకు అభిషేకం చేస్తూ నిన్నో పవిత్ర మూర్తిగా లోకానికి చూపిస్తూనే ఉంది. ఇది నా ఆఖరి శ్వాస ప్రకృతిని తాకేవరకూ ఆగని అసిధారావ్రతం.

నన్ను నేను నీకు ఇచ్చేసుకుని… నేను ఆరాధిస్తున్న నీ ఆలోచనల వలయం దాటి ఏ క్షణమైనా బయటకువచ్చినట్లు అనిపిస్తే చెప్పు. మరుక్షణం నాకు నేనుగా పంచభూతాల్లో లయం అయిపోతాను.

నా ప్రతి తలపులో ఎన్ని అవ్యక్తానుభూతులో… జత తనువుల సంగమంలో కాదు...ఒక మనసు మరో మనసుని తన ఆలోచనల్లోకి ఆవాహన చేసుకుని తనకిచ్చే గాఢపరిష్వంగంలో వచ్చే అనుభూతిని చవి చూడగలిగితే విశ్వ సంబరాలన్నీ మదిలోనే తాండవిస్తాయి.  ఇక ఒక మనసే ఇంకో మనసుగా రూపాంతరం చెందినతనపు ఆనందాన్ని ఊహించు. ఆగాగు… అంత శ్రమ ఎందుకు అలా మారిపోయిన నా మనసు ఉందిగా నువ్వు అనుభూతించటానికి. 

ఏయ్… జాలి వద్దురా… నువ్వు దూరమైన దుఃఖం నన్ను తట్టలేదు అని నేను అనను. కానీ ఆ దుఃఖాన్నంతా హృదయాంతరాలలో దాచేసి అన్ని ఏకాంతాలలో నువ్వే తోడుగా జీవిత విహారం చేస్తున్నాను. అసలీ జీవితం ఎంత బాగుందో నీకు తెలుసా? ఏ ఒక్క మానవ పదార్ధామూ తను పుట్టాక ఇంతగా జీవితాన్ని ఆస్వాదించి ఉండదు.  

ఆ నాడు శూన్యం అనుకున్న  నా ఈ జీవన గమనంలో నాకు అర్ధం అయ్యింది ఒక్కటే...  ప్రేమంటే రెండు భౌతికాల మోహాల ఆరాటం కాదు. మనసొక ప్రకృతిగా మారి మరో మనసుకి  అలౌకిక స్పర్శానుభూతిని అందిచటం. ఇప్పుడు నా మనసొక ప్రకృతి.  నా నీ అలోచాల్లో ప్రతి క్షణం వసంతం ఒంపగలిగినంత శక్తివంతమైనది.

క్షణానికి ఒక్కటిగా వస్తున్న నీ తలపు ఒక్కటి చాలు ఆ క్షణం పునీతమవుతూ ప్రకృతిలో అనంతమైన ఆనందశక్తిని  ప్రోది చెయ్యటానికి. 

అనంతమైన మానసిక శక్తిని నాకందించిన నా జీవన వరమా… 

పొంగి పొర్లే ఓ నిశ్శబ్దంలో ఒక్క సారి మనసారా నన్ను చదువు…  

బహుశా అప్పుడో… మరెప్పుడో ఒక్కసారి… గుండె కన్నీరుగా కారిపోతుంది నీ కళ్ళనుండి  చెలమగా  బయటకి రావటానికి.  ఆ ఒకే ఒక్క క్షణం చాలురా నా ఈ జీవితం పునీతం అవ్వటానికి… ఈ అసమర్థుని ప్రేమ శక్తి లోకానికి  తెలియటానికి.

అసమర్ధ ప్రేమికుడు 
సురేష్ రావి

3 comments:

ఇదివరలో భావుకత్వం బాగా నచ్చేది. ఇప్పుడు ఎక్కడంలా. టపా పేరు మాత్రం బావుంది.

మీరు నిజంగానే అంతగా జీవితాన్ని ఆస్వాదించి ఉంటే అదెలాగో మాకూ చెప్పండి మరో పోస్టులో. మేమూ ఆస్వాదిస్తాము.

Post a Comment