ఆమె ఎవరని మీరడుగుతుంటే నేనేం చెప్పాలి.
ఆమెకోసం నేను ఎక్కడ వెదకాలి?
అసలు వెదకాలా? తనెవ్వరో నాకు తెలియదూ...!
రాసే నిజాలు వేరు.
గుండెని తడిమే తడి వేరు.
కొన్ని అబద్ధాలని అక్షరాలుగా లోకానికి పరిచయం చేస్తున్న నేను కొన్ని నిజాలని మది మంజూషంలో పదిల పరచి కన్నీటి జల్లులతో నన్ను నేను స్వచ్ఛ పరచుకునే నిజమెప్పుడూ నాలోనే అత్యంత భద్రం.
ఆత్మ కథల్లోనే కాల్పానిక సాహిత్యం గుప్పించేసే ఈ రోజుల్లో అంతరాంతరాలలో అణువణువూ తనేనన్న నిజం నిర్భయంగా చెప్పగలుగుతున్న నేను తనెవ్వరో ఏమిటో ఎప్పటికీ లోకానికి తెలియని రహస్యంలో దాచేసుకుని ఆ నిజాన్ని ఎప్పటికీ లోకానికి చూపించలేనే అన్న ఒకే ఒక్క బాధా వీచికని ఎప్పటికీ నాలోనే అదిమి పెడుతున్నా.
నిజాలు రాయాల్సి వస్తే ప్రతి నిజమూ ఒక విషాద కావ్యమౌతుంది.
ఇంతకూ
ఆమె ఎవరంటే... నా ప్రతి క్షణానికి తానో అతిధి. నా విషాదానికి తానొక ప్రమోదం.
అంతకు మించి ఆమె ఎవరన్న ప్రశ్న... ప్రశ్నగానే ఉండి పోయే నిజమే ఈ లోకానికి.
ఆమె గురించిన ఆలోచనలే ఊపిరిగా సాగుతున్న నా ఈ జీవితం నాది కాదు ఆమెదే...







1 comments:
మీ బ్లాగ్ మొదటిసారి చుస్తున్నాను. బాగుందండి.
Post a Comment