Monday, 6 April 2015

ప్రతి రేణువూ నేత్రమై...

ఏయ్…

నీ తలపొక వేదమంత్రంగా మనసుని మౌనంగా పఠిస్తున్నప్పుడల్లా నువ్వు పంచభూతాలసారమై నన్ను ఆవరించుకున్న అలికిడి. కోట్ల క్షణాలుగా రాలిపోయిన గతంలో నేను వేరు చేసి దాచుకున్న ఒకే ఒక్క క్షణం నీ పరిచయక్షణం.  అటుపై ఏ ఒక్క క్షణానికీ గతమంటలేదు సరి కొత్త పరిచయంగా నిన్ను చదువుకోవటం తప్ప. 

ప్రతి క్షణమొక సుప్రభాతమై నిన్ను మరింత కొత్తగా పరిచయిస్తుంటే నిశ్శబ్దానికి నిరీక్షణా పాఠం చెప్పి అదే పనిగా ఊసుల సడి చేస్తున్నాను. ఎక్కడ తప్పిపోయాయో అర్ధం కాని నా కలలన్నీ నీ కంటి మెరుపులనంటి పరిమళ ధూపాలనద్దుకుని నాకో సరి కొత్త శ్వాసగా మారుతున్నాయి.

ఇంతకూ మన మధ్య దూరాన్ని ఏ దగ్గరితనంతో కొలవాలి? భౌతికానికీ మానసికానికీ తేడా తెలియని అలౌకికతనంలో మనమున్నప్పుడు ఏ కొలతలకి అందుతాం మనం? అసలు నీకంటూ నిన్ను మిగలనివ్వనంత స్వార్ధం నాలో నిండి పోయాక ఆ స్వార్ధాన్ని నిజం చేసే నా యత్నాలకి ఇంధనమవ్వాల్సింది నువ్వే కదా…  

నాలో మొలకెత్తిన చిన్ని తలపొకటి నీలో మహావృక్షంగా మారటం కంటే దగ్గరితనం వేరే ఏముంటుంది. 

ఈ తలపులు మరి ఏ ఇతర కొలతల్లో ఇముడుతాయో ఎవరైనా చెప్పగలరా? ఉహూ… చెప్పలేరు… ఎందుకంటే అసలు దగ్గరితనం అంటే ఏమిటో కూడా తెలియని మానసిక నిరక్ష్యరాసులే కదా లోకం నిండా కుప్పలు కుప్పలుగా…  

నన్ను ఒంటరితనంలోకి వెలివేసి వెళ్ళిపోయిన ప్రతిక్షణం మన జంటతనాన్ని తాకి వెళుతున్న క్షణాలకేసి అసూయగా చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంది తెలుసా? వెలిసి పోయిన జీవితానికి సప్తవర్ణాలద్దుతున్న నీ సాన్నిహిత్యపు పరిమళం ఏ ప్రకృతి సుమాలకీ లేనట్లుగా ఉంది. ఎడారికీ  పచ్చదనం  అద్దవచ్చని నిరూపించేసావ్ లేరా నువ్వు. నిజంరా…

ఎడారితనానికి వసంతమద్దిన మన తొలిక్షణాలు గుర్తు వచ్చినప్పుడల్లా  కళ్ళు ఎందుకో సాగరాలౌతున్నాయి. మరి కళ్ళకన్నా  జీవిత సంవేదనల వాహకాలు ఏమున్నాయని? 

నువ్వు మాట్లాడినప్పుడల్లా నాకో అద్భుతం పలుకులకూ ఒంపుసొంపులుంటాయని తెలిసే సమయమదేగా మరి. 

ఇంకోసంగతి చెప్పనా…

చిన్నప్పుడు భూమి ఎప్పుడూ సూర్యుని చుట్టూ ఒక స్థిర కక్ష్యలో తిరుగుతుంది అంటే అర్థంకాలేదు. అప్పటి సాంఘిక శాస్త్రపు పాఠం ఇప్పుడు అర్ధం అయ్యింది. ఎలాగంటావా? నువ్వే కేంద్రకంగా అలసటలేకుండా స్థిర కక్ష్యలో తిరుగుతున్న నా ఆలోచనలని చూసాక అర్ధం అయ్యింది. ఆ కక్ష్య దాటితే భూమికైనా ఇక్కడ నాకైనా ప్రళయమేనని. 

ఏయ్… నవ్వొస్తుంది కదూ నీకు… ఏమిటి వీడి పిచ్చి రాతలూ వీడూనూ అని… నవ్వుకో నవ్వుకో… నీ నవ్వుల ఏరువాకతో ‘మన’లోకమంతా ఆనందమే పండుతుందిలే…

ఏదో అనుకుంటాం కానీ కాలం చాలా మంచిదిరా… ఎప్పుడు ఏది ఇవ్వాలో దానికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. జీవితపు చిక్కుముళ్ళలో గజిబిజిగా ఉన్నప్పుడు ఎవరం ఏ దారిలో ఉన్నామో తెలియనివ్వలేదు. ఒక్కొక్క ముడినీ విప్పుకుని తేలిక పడ్డాక  జీవితపు సారాన్ని మనసు దాహానికి దప్పిక తీర్చేలా ఎక్కడో ఉన్న  రెండు బాటలనీ ఒక్క దారిగా మార్చింది చూడూ… అంతకన్నా ఇంకేం కావలి మన జీవితానికి? 

ఇప్పుడిక వేరు చెయ్యగలదా ఏ కాలమైనా మన జీవాత్మని? 

నేను  నడిచే  దారిలో ప్రతి రేణువూ నేత్రమై నీ పాద ముద్రలను గుర్తించుకున్నాక ఏ దారైనా నన్ను నీ దరికే చేర్చదూ.

అయినా మనసుకీ మనసుకీ మధ్య దారిలో ప్రయాణానికి చూపుల సహాయం కావాలా? ఎక్కడెక్కడి ద్వారబంధాలన్నిటినీ విప్పి ఉంచాలా?  ఒక్క ఊపిరిగా పెనవేసుకున్న మనోబంధమొక్కటి చాలదూ…! 

ఒంటరితనపు నా హృదయవాకిలిలో పారిజాతమై సుమించి అమరావతీ వనవిలాసినివై నువ్వు పలుకరించిన ఆ మొదటి క్షణం ఇక ఎన్నటికీ సజీవ శబ్దమే... 

ఏమిటోరా ప్రతిసారీ ఏదో రాద్దాం అని మొదలు పెడతా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు ఈ అక్షరాలకి కుదురు కాస్త తక్కువలా ఉంది. మనసులో వచ్చేవాటన్నిటినీ నువ్వు రాయమన్నట్లు రాయాలా ఏమిటి… మా వ్యాకరణం మాకుంది... నీ ఆలోచనల్లో నువ్వుండు… మేమెలా ఒదగాలో అలా ఒదిగిపోతాం  అన్నట్లుగా నావైపు గుడ్లు మిటకరించి చూస్తున్నాయ్… 

పాపం వాటి బాధ వాటిది మునివేళ్ళ నుండి కాగితానికి అద్దుకునే లోగానే మనసు మరిన్ని భావాల్ని ఒంపేస్తుంటే ముందు  ఏ భావంగా భౌతికానికి జాలువారాలో తెలియని తికమకలో పడిపోతున్న ఉక్రోషం.   

నా సునితత్వం నన్ను పలుకరించినప్పుడల్లా ఈ అక్షరాలు నిన్ను పలకరిస్తాయి… 

అందాకా ఓ చిన్ని విరామం…

నీ 

నేను...

April 06, 2015


0 comments:

Post a Comment