Friday, 17 April 2015

ఇట్లు, నా... నువ్వు

హాయ్ రా....

ఎలా ఉన్నావ్ రా…?  
ఏమి చేస్తున్నావురా…? 
ఈ ప్రశ్నలు అడగాలా నేను నిన్ను? 
ఈ ప్రశ్నలకు జవాబే నేను కదా… 

నేను  బాగుంటే నువ్వు బాగుండటం.... నేను చేసే పనిలో నీ సంతోషాన్ని వెదుక్కోవటం… ఏమంటార్రా దీనిని?  స్నేహమా? ప్రేమా?

‘మరదే... కొన్ని కొన్ని ప్రశ్నలకి జవాబులు ఊహారూపంలో వదిలేస్తేనే బాగుంటాయ్ కదా…’ అని అంటావని నాకు తెలుసులేవోయ్...

అసలేంట్రా... అందరూ స్నేహం అనగానే బాల్యంలోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళ తప్పు కాదు కదూ... చాలా మందికి స్నేహపు పునాది అక్కడే పడుతుంది అన్నది అక్షర సత్యం.  నా చిన్న నాటి నేస్తాల ( అలా అనకూడదేమో  మరి…)  స్నేహితాన్ని చూసి ఏ ఒక్కరికి దగ్గరకాలేనీ నా అసహాయత మీద నాకు పుట్టిన రోత ఏమని చెప్పాలిరా?  అలవిమాలిన మొహమాటం స్నేహానికి ప్రధాన అడ్డంకి అని తెలిసినా దాన్ని వదుల్చుకోలేని తనం… అత్యంత ఇష్టమైన మనిషితోనూ మామూలుగా మాట్లాడలేని బెరుకు. ఇలాంటి వ్యక్తిత్వంతో అసలు ఏ  స్నేహం అయినా ఎలా కుదురుతుంది? చాలా కష్టం కదూ… మరి ఇన్ని సంవత్సరాలుగా నాది అదే బ్రతుకు...

వత్సరాలుగా అన్ని పరిచయాలు ఆ పరిచయ క్షణాలకే అంటుకట్టబడ్డ బంధాలుగా మిగిలి పోయాయి కానీ ఏ ఒక్క బంధమూ స్నేహంగా మారలేదే. మంచి వ్యక్తిత్వం ఉన్నంత మాత్రాన మంచి స్నేహం దొరుకుతుంది అని ఎవరైనా అనుకుంటే అది పిచ్చి భ్రమ అని నిస్సందేహంగా చెప్పెయ్యవచ్చు.  అసలైన మైత్రీ విలువల ముందు  భౌతికంగా పెంచుకున్న విలువలు ఏ మాత్రం సాటి రావు కదా రా… 

నేను రాసుకునే కొన్ని అక్షరాలు ఓ అపురూపమైన స్నేహాన్ని వెంటబెట్టుకుని వస్తాయని ముందుగా తెలిసి ఉంటే ఊహ తెలిసిన మొదటి క్షణమే నా పిచ్చి రాతలు మొదలెట్టే వాడిని కదా… అక్షరాల వెంట కళ్ళు  పరిగెట్టించటమే అలవాటు అయిన నాకు కొద్దో గొప్పో అక్షరాలని పరుగెత్తించటం అలవాటు చేసావ్… 

నేను రాసే ప్రతి అక్షరంలో నిన్ను వెదుక్కుంటూ ఉంటావని చెప్పావ్… అక్షరాల్లో ఎందుకోయ్… నా అంతరాంతాల ఆత్మీయతవే నువ్వయ్యాక? 

ఏ శబ్దమూ … మరే నిశ్శబ్దమూ కూడా కదిలించలేనంత శిలాసదృశ్యమైన మనసుతో జీవితాన్ని ఒక స్తబ్ధతలోకి నెట్టి వేసుకుంటున్న తరుణాన నీవో  స్నేహవీచికవై నాలో ఆవరించుకుని ఉన్న శూన్యాన్ని సమూలంగా ఆవిరి చేసేసాక నాకు అనిపించిందేమిటో తెలుసా…?

ఏది ఎక్కడ ఎప్పుడు దక్కాలో అప్పుడే దక్కుతుంది… ఎప్పుడు ఎవ్వరు జీవితంగా మారాలో  అప్పుడే వారి అడుగులు తోడుగా జతకలుస్తాయని అర్ధం అయ్యిందిరా. అందరిలా బాల్యంలోనో, కౌమారంలోనో నువ్వు నా నేస్తానివి అయి ఉంటే చిన్ననాటి విశేషాల పునశ్చరణల వరకే మన స్నేహం నడిచేదేమో. 

జీవితాన్ని అవగాహన చేసుకుంటున్న / చేసుకున్న దశలో మానసికంగా సమస్థాయిలో  ఉన్న ఒక్క స్నేహ స్పర్శ  జీవితానికి ఇచ్చే భరోసా ఏమిటి అన్నది నాకు అవగతమయ్యింది. అలాంటి  ఆ స్నేహ స్పర్శ కొందరికి చిన్నప్పుడే కలిగి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు కదూ.

మామూలుగా రోజూ వారీగా కలిసే సన్నిహితుల్లో… లేదా అలా అని అనుకునే వాళ్ళలో ఎవరు నిజమైన స్నేహితులో  తెలియాలి అంటే ఒక్క సారైనా మనసుకో గాయమో లేదా మనిషికో కోలుకోలేని ఎదురుదెబ్బో  తగలాలేమోరా. లేకపోతే కాస్త కలుపుగోలుతనం ఉన్న ప్రతిమనిషీ తనకు పదుల సంఖ్యలో స్నేహితులు ఉన్నారనుకునే అవకాశం ఉంటుంది కదూ… అలా అనుకోవటం వల్ల తన అవసరంలో నిజమైన స్నేహితుడెవరో గుర్తించడం ఎంత ఆలస్యం అవుతుంది? 

సమస్యల ఊబిలో కూరుకుపోతూనో ఆశల పందిళ్ళ ఆకులు ఊడదీసుకుంటున్నప్పుడో… 
శిఖరాన నిలవలేక కిందకి జారిపడుతున్న దురదృష్ట క్షణంలో దేహం మీద విరక్తి కలిగినప్పుడో...  

రెండో స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకొన్న క్షణంలో  పరాజితుల అసహాయ అసూయా వీక్షణలు  మనసుని చివుక్కుమనిపించినప్పుడో...    అలా ఎప్పుడో ఒక్కసారి దగ్గరగా ఉండి భుజం తడితేనో… అది కుదరనంత దూరంగా  ఉన్నప్పుడు అనునయంగా నువ్వు పంపే ధైర్యంతోనో మళ్ళీ నాలోకి నేను వచ్చేస్తాను. 

ఏదైనా వేదన నన్ను తడిపేస్తున్నప్పుడు దాన్ని నీతో పంచుకున్నాక నాలో కలిగే ఊరట చెపుతుంది స్నేహానికి అసలైన నిర్వచనం. నా చెలిమి తడి నీ చెక్కిలిని తడిపే ఆ క్షణాల చెమరింతలు    పాతరోజుల్లో కూడా ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు హితులనుకున్న వారి దగ్గర చెప్పుకున్న రోజులున్నాయి కానీ… ఇప్పుడు నేనన్నానే ఊరట అని… అదెప్పుడూ కలగలేదురా నా మనసుకి.  ముఖ పరిచయాలకీ… మనఃస్నేహాలకీ ఉన్న తేడా ఇదే కదా మరి. 

నేను ఆగే  ప్రతి మజిలీలో సేద తీర్చే ఆహ్లాదమై నువ్వు తడుముతుంటే చాలదూ మనసు ఆనందం ఏక మొత్తంగా  పెదాలని శాశ్వతంగా అద్దెకి తీసుకోవటానికి?  నీ స్నేహం లేని గతం మొత్తాన్ని గోనెసంచిలో భద్రంగా మూటకట్టేసి అనంతంలోకి జార విడి చేసా పొరపాటున ఏ తలపున కూడా పాత అభావాలు నన్ను పలకరించకూడదని. 

ఒక్కటి మాత్రం నిజంరా… స్నేహం కోసం ఎదురు చూడటం కాదు చెయ్యాల్సింది… నాకు నేను స్నేహితుడిగా మారటం మొదలు పెట్టాలి అని తెలిపింది నీ స్నేహం.  ఈ రోజు నుండి మనమిద్దరం స్నేహితులం రా అని ఎవరైనా స్నేహం మొదలు పెట్టారు అనుకో… అందులో ఉన్న స్నేహ గాఢత ఎంత?  ఉదయం నుండి మధ్యాహ్నం లోకి నడిచే ఛాయా మాత్రమే కదూ. మధ్యాహ్నం నుండి సాయంత్రానికి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగే నీడ పయనాన్ని చూడు. నిజమైన స్నేహం కూడా అంతేరా... మనకి తెలియకుండానే ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటూ మనలోని  మంచినీ చెడునీ సమానంగా చూస్తూ అల్లుకునే మానసిక బంధం అది.  

నువ్వూ నేను ప్రాణ స్నేహితులం అంటూ కాగితాల మీద లేఖలు రాసేస్తే నిజంగా ప్రాణ స్నేహితులం అయిపోతామా?  ఆ మునివేళ్ళకేం ఆ క్షణంలో ఒకరినొకరు మభ్య పెట్టుకోవటానికి ఎన్నో అక్షరాలని అలవోకగా రాసేస్తూ ఉంటాయ్… ఇలా అన్నంత మాత్రాన అవన్నీ అసత్యపు రాతలు అని కాదు సుమా… రాతల కన్నా ముఖ్యమైనది ఒక అనుబంధం.  మనుషులు ఎంత దూరాన ఉన్నా ధృఢమైన బంధం ఒక్కటి చాలు  ప్రతి ఆలోచనల చివరా జీవమై తళుక్కున మెరవటానికి… అవతలి వాళ్ళని మురిపించటానికీ…  

జీవితపు ఆటుపోట్లని  చిరునవ్వుతో దాటెయ్యటానికి మనిషికీ మనిషికీ మధ్య మనసుల్ని కలుపుతూ ఒక్క స్నేహ వారధి చాలదూ...  అచ్చు మన మధ్య వెల్లివిరిసిన స్నేహ సుగంధంలా…!

అవునూ చివరిగా ఓ చిన్ని సందేహం రా… స్నేహం ఒక్కటే మనం ఎంపిక చేసుకోగల బంధం కదా…  ఏరి కోరి మౌనమునిగా పేరుబడ్డ ఈ నిశ్శబ్ద శిలని ఏమి చూసి నీ స్నేహితుడిగా ఎంచుకున్నావ్ రా….?  

సమాధానం చెప్పవూ... వినాలని ఆశగా ఉంది….!

ఇట్లు,

నా...
నువ్వు 1 comments:

స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వితం

Post a Comment