‘కన్నా… నేను చేసిన పెద్ద
తప్పేంటో తెలుసా… నీకా
చిత్రం గురించి చెప్పక పోవటమే’
‘ఏ
చిత్రం నాన్నా?’
‘అదిగో
అదే… నువ్వు
చిన్నప్పటి నుండి మన హాల్లో చూస్తున్న అదే చిత్రం’
‘అందులో
విశేషం ఏముంది? మామూలుగానే
ఉందిగా’
‘నిజమే
చూసే వారికి మామూలుగా అనిపించవచ్చు… కానీ అదే మన కుటుంబ
జీవన చిత్రం’ అని
చెప్తుంటే కావ్య ట్రే లో కాఫీ కప్స్ తో వచ్చింది. తన కళ్ళతో ఒక్క సారి మాట్లాడుతూ
కప్ అందుకున్నాను.
‘నువ్వూ
తీసుకో కన్నా’ చెప్పింది
కావ్య కాఫీ కప్ వాడి చేతికందిస్తూ…
వాడు
వాళ్ళ అమ్మ కళ్ళలోకి సూటిగా చూడలేక తలవంచుకుని కప్ అందుకున్నాడు. కావ్య అనునయంగా
వాడి భుజం మీద చెయ్యి వేసి వాడి పక్కనే కూర్చుంది.
కప్
తీసుకున్నాడే కానీ కాఫీ తాగకుండా కప్ లోకి అలాగే చూస్తూ కూర్చున్నాడు మానస్.
ప్రస్తుతం వాడి మనస్థితి అంచనా వేస్తూ నేనూ కూడా మౌనంగా కాఫీ సిప్ చేస్తూ
వాడివైపే చూస్తున్నాం.
వంచిన
తల ఎత్తకుండానే కళ్ళు పైకెత్తి చూశాడు. ఒక్క క్షణం మా ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయ్.
‘నన్ను
క్షమించండి నాన్నా' నీళ్ళు
నిండిన కళ్ళతో చెప్పాడు.
‘ఆలోచనలన్నీ
పక్కకి నెట్టేసి కాఫీ తాగు. కాస్త తెరిపిన పడతావ్'
ఏమనుకున్నాడో
ఏమో నెమ్మదిగా కాఫీ తాగటం మొదలు పెట్టాడు.
***
పావుగంట
క్రితం…
పాదాల
మీద ఏదో తడిగా తగిలితే చటుక్కున మెలకువ వచ్చింది. తలుపుని దాటుతూ కనిపించాడు
మానస్. ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు. ఈ టైంలో వాడు మా బెడ్రూమ్ లోకి వచ్చి
వెళ్ళటం… నా
కాళ్ళ మీద తడి… చూస్తుంటే
నా మనసులో ఒక చిన్న ఆందోళన. నన్ను నేను సంభాళించుకుని బెడ్ మీద నుండి లేచి గబగబా
వాడి వెనకే వెళ్లాను.
‘కన్నా… ఏమైందిరా… ఆగు… ఎక్కడికి అలా
వెళ్ళిపోతున్నావ్?” నా మాటలు వినపడగానే వాడు వేగంగా బయటకి నడవబోయాడు. నేను
మరింత వేగంగా వాడిని చేరుకొని వాడి జబ్బ పట్టుకుని ఆపేసాను.
‘నన్ను
క్షమించండి నాన్నా… నన్ను
వెళ్లిపోనివ్వండి.. ప్లీజ్' అంటూ
వాడు పెద్దగా ఏడుస్తూ నా కాళ్ళ దగ్గర కుప్ప కూలిపోయాడు.
నేను
వాడిని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి కాసిని మంచి నీళ్ళు తాగించి ‘ప్లీజ్ రిలాక్స్ మై
బోయ్… ఏమైనా
ఉంటే నిదానంగా మాట్లాడుకుందాం… ఈ తెల్లవారు ఝామున అమ్మ చేతి కాఫీ
రుచి చూడు. మనసులోని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కకు వెళ్లి కాస్తంత ప్రశాంతంగా
ఉంటుంది' అంటూ
కావ్యని పిలుద్దాం అనుకుంటూ బెడ్ రూమ్ వైపు వెళదాం అనుకునే లోపుగా తనే చేతిలో ఏదో
లెటర్ తో ముఖంలో ఆందోళనతో బయటకి వస్తూ కనిపించింది.
అది
చూడగానే అర్ధం అయ్యింది వీడేదో లెటర్ రాసి మా దగ్గర పెట్టి బయటకి వెళ్ళిపోవటానికి
సిద్ధం అయ్యాడని.
‘ఏంట్రా
కన్నా… ఈ
పిచ్చి పని… నువ్వు
వెళ్ళిపోతే మేము ఉంటాం అనుకున్నావా…” అడిగింది కావ్య చెంపల
నిండా కారుతున్న కన్నీళ్ళతో తన చేతిలోని కాగితాన్ని నాకు అందిస్తూ…
'వీడితో
నేను మాట్లాడుతూ ఉంటానుగానీ కొంచెం కాఫీ పెట్టరా…’ అంటూ వాడు రాసిన దాన్ని
చదవటం మొదలు పెట్టాను.
‘అమ్మా
నాన్నా…
ఇలాంటి
ఉత్తరం ఒకటి రాయాల్సి వస్తుందని నేను ఏనాడూ అనుకోలేదు.
ఏదో
సాధిద్దాం అని సొంతకాళ్ళతో నడక మొదలు పెట్టాను. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న నా
ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ప్రాణ స్నేహితుడనుకున్నవాడే మరొకళ్ళకి అమ్మేసి నన్ను
నట్టేట ముంచేసాడు. ఒక్క ఫెయిల్యూర్ తో ప్రాణంగా ప్రేమించాను అన్న అమ్మాయే మరొకళ్ల
చెయ్యి అందుకుంది…
ఇవన్నీ
చూస్తుంటే లోకమంతా ద్వంద ప్రవృత్తితో నడుస్తున్నట్లుంది. మీరు తప్ప నాకీ లోకం అసలు
నచ్చలేదమ్మా. అన్నీ ఓటములే… ఎటు
చూసినా అవమానాలే…
అయినా
నిజంగా ఇది ఫెయిల్యూర్ అంటారా అమ్మా… ఇలాంటి నయవంచనలు నాలాంటి
ఎందరినో బలి తీసుకుంటూ ఉండి ఉంటాయ్ కదూ?
నాన్నా… మీరు చిన్నప్పటి నుండి
నన్ను చాలా ధైర్య వంతుడిగా పెంచారు. అయినా సరే చీకటి కమ్ముకొస్తున్నప్పుడు నాలోని
ధైర్యం ఎటుపోయిందో తెలియదు. మాటల్లో… ఊహల్లో ముందుకు వచ్చే
ధైర్యం ఆచరణకి వచ్చే సరికి ముఖం చాటేసిందెందుకో!
మీ
చాటు బిడ్డగా కాకుండా మీరు గర్వించే బిడ్డగా ఎదగాలనుకున్నా… ఇప్పుడు అత్మవంచన
చేసుకుని మీ వారసుడిగా భోగభాగ్యాలు అనుభవించటానికి నాకు మనస్కరించటం లేదు నాన్నా…
అందుకే...
మీరు నా మీద పెట్టుకున్న ఆశలని వమ్ము చేస్తూ శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుండీ… ఈ లోకం నుండీ.
నన్ను
క్షమించరూ!
మీ
కన్నా…’
చదవటం
పూర్తి చేసిన నాకు వాడి బాధ అర్ధం అయ్యింది.
***
ప్రస్తుతానికీ
వస్తే
వాడి
మనసులో సవాలక్ష సందేహాలు ఉంది ఉంటాయని నాకు తెలుసు. ఏదో ఒక వాల్ పోస్టర్ ని
చూపించి ఇది మన కుటుంబ జీవన చిత్రం అంటే ఎవరికైనా అంతే కదా మరి.
‘నాన్న
చెప్పింది నిజమే కన్నా… ఆ
చిత్రం వెనుక మా ఇద్దరి కథ ఉంది. అది నీకు అర్ధం కావాలంటే మా కథ పూర్తిగా నీకు
చెప్పాలి' అంటూ
మా గతాన్ని చెప్పటం మొదలు పెట్టింది కావ్య.
***
‘సూర్యా… అమ్మా నాన్నకి మన సంగతి
చెప్పాను. వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోవటం లేదు… అంతే కాదు నేను మన
ప్రేమ విషయం చెప్పగానే నాకు వేరే అతనితో పెళ్లి ఫిక్స్ చేసారు. నాకు నువ్వు
కావాలిరా… నువ్వు
కావాలి… నువ్వు
లేకుండా బతకలేను' మాటలు
వినవస్తుంది ఫోన్ నుండి అయినా కావ్య గొంతులోని బాధ సూర్య గుండెని తాకింది
‘ఏయ్..
పిచ్చీ… నాకు
మాత్రం నువ్వు కావొద్దా ఏమిటి? నిన్ను వదులుకుని నేను మాత్రం
ఉండగలనా? నేను
వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతానుగా’
‘ఏమోరా… ఏమి మాట్లాడతావో ఏమిటో!
మా వాళ్లకి ప్రేమ అంటే అసలు పడదు. అందులోనూ నేను ప్రేమించింది ఒక అనాధని అని
తెలిసాక ఇంకా మండి పడుతున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. నువ్వు త్వరగా వచ్చేయ్… నన్ను తీసుకుని
వెళ్ళిపో’
‘వచ్చేస్తారా
బంగారూ… ఒక్క
ఇంటర్వ్యూ ఉంది. అది అవ్వగానే వచ్చేస్తాను. ఒక్క రెండు రోజులు ఓపిక పట్టు’
‘ఊ… సరే’
మాట్లాడటం
అయిపోయాక సూర్య తీవ్రమైన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.
‘తానేమో
ఒక అనాధ. అటు కావ్య చూస్తే కలవారి అమ్మాయి.
కావ్య, తను గత నాలుగేళ్ళుగా
ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ విశాఖపట్టణమే. కష్టపడి డిగ్రీ వరకూ చదవగలిగినా
ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చాడు.
ప్రేమలో
పడ్డప్పుడు భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అలోచించి పడటం అంటూ ఉండదు. అలా
ఆలోచించగలిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఏదోలా
కావ్య పేరెంట్స్ ని ఒప్పించి ఆమెని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోయినా
కావ్య తనూ పెళ్లి చేసుకోవటం ఖాయమే. కానీ పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకుంటే
భవిష్యత్తులో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా బతకవచ్చు. ముందుగా రేపు ఇంటర్వ్యూ
పూర్తి చేసుకుని వైజాగ్ వెళ్లి కావ్య పేరెంట్స్ తో మాట్లాడాలి’ ఆలోచనలు అలా
సాగిపోతున్నాయ్.
మరునాడు
ఇంటర్వ్యూ పూర్తి అయ్యింది. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ పద్ధతి చూస్తే ఈ జాబ్ కూడా ఎవరి
కోసమో రిజర్వ్ చేయబడిందేమో అని అనిపిస్తుంది సూర్యకి. మరునాడు బయలు దేరి వైజాగ్
వెళ్లి కావ్య పేరెంట్స్ తో మాట్లాడాడు. వాళ్ళు చాలా అవమానకరంగా… హీనంగా మాట్లాడారు.
దాదాపుగా మెడపట్టి బయటకి గెంతినంత పని చేసారు.
ఇలాంటి
సమయాల్లో స్నేహితుల తోడు చాలా ధైర్యాన్ని ఇస్తుంది కానీ సూర్యకు అండగా నిలిచేటంత
స్నేహితులంటూ ఎవరూ లేరు.
ఏమి
చెయ్యాలో తెలియని అయోమయంలో ఉండగా కావ్య సూర్య గదికి వచ్చింది.
‘సూర్యా… ఇంట్లోనుండి వచ్చేశాను’
‘ఎందుకు
వచ్చేసావ్ రా… నిన్ను
పోషించటానికి ఉద్యోగమూ లేదు… వెనకటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులూ
లేవు. కనీసం నువ్వైనా మీ పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండవచ్చురా'
‘ఏం
మాట్లాడుతున్నావ్ సూర్యా… నిన్ను
కాకుండా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలను అని ఎలా అనుకున్నావ్. కలసి
బతకలేనప్పుడు… ప్రేమికులుగా
కలసి చచ్చిపోదాం. చావైనా… బతుకైనా
నీ తోడుగానే'
కాసేపు
వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బతకటానికి దారి కనపడక ఇద్దరూ ఆత్మ హత్య
చేసుకోవటానికి నిర్ణయించుకుని బీచ్ వెంట ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న చోటకి
నడచారు.
సముద్రంలోకి
వాలిపోతున్న ఎర్రటి సూర్యుడిని కాసేపలా తేరిపార చూస్తూ రేపటి సూర్యోదయం మనం
లేకుండానే కదా అన్న భావనతో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ సముద్రానికి దగ్గరగా
వెళ్ళారు… సముద్ర
గర్భంలో లీనమై పోదామని…
సాగరం
మీదుగా ఎగురుతూ కనిపించాయి కొన్ని పక్షులు… అందులో ఒక పక్షి
వాళ్లకి మరింత దగ్గరగా రెక్కలని టపటపలాడించుకుంటూ ఎగురుతుంది.
దాన్ని
అలా చూస్తుంటే అకస్మాత్తుగా సూర్యలో ఏదో ఆలోచన.
‘ఒక
చిన్న పక్షి, తన
రెక్కలతో సాగారాన్నే దాటెయ్యగలననే నమ్మకంతో ఆ అనంత సాగరం మీదుగా ఎగురుతూ ఉంటే
మనిషిగా నా మీద నాకెంత నమ్మకం ఉండాలి.
ఏ
సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఇద్దరమూ చదువుకున్నాం. ఇప్పటికిప్పుడు
ఉద్యోగాలు లేనంత మాత్రాన అవి దొరకవు అని కాదుగా… అలాగే పెద్దవాళ్ళు కూడా
ఇప్పుడు ఒప్పుకోకపోయినంత మాత్రాన పిల్లలకి శత్రువులేం కాదుగా.
ఇప్పుడిక్కడ
జీవితాలని ముగించేసుకుంటే ఎవరి మీద గెలచినట్లు?
మహా
అయితే పేపర్లో జిల్లా ఎడిషన్లో ఏదో మూల వార్తగా మారతాం…
కానీ
కావ్య పేరెంట్స్ ఏమవుతారు? ఊపిరాగిపోయే
ఆఖరి క్షణాలలో మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టి మళ్ళీ మొదలవ్వాలంటే సాధ్యపడుతుందా?
ఇది
కరెక్ట్ కాదు… పిరికి
వాళ్ళలా జీవితాన్ని ముగించటం సరి కాదు. మరణాన్ని కూడా విజేతలుగానే ఆహ్వానించాలి.
అంటే
ఇప్పుడు చావకూడదు… బతకాలి… గెలవాలి…’ అనుకుంటూ అలలకి ఎదురుగా
నడుస్తున్న కావ్య చేతిని గట్టిగా పట్టుకుని ‘కావ్యా… మనం బతుకుతున్నాం… పెళ్లి చేసుకుంటున్నాం… జంటగా జీవితాన్ని
గెలవబోతున్నాం’ అని
అన్నాడు సూర్య.
ఆ
మాట విన్న కావ్య కళ్ళలో మెరుపుల తడి… సూర్యకి అభిముఖంగా
తిరిగి గుండెల మీద తల వాల్చి అతన్ని గట్టిగా హత్తుకుపోయింది.
***
‘ఆ
మర్నాడే గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. రాదేమో అనుకున్న ఉద్యోగం మీ నాన్నకి వచ్చింది.
నువ్వు పుట్టాక తాతయ్య అమ్మమ్మ కూడా మమ్మల్ని అర్ధం చేసుకుని దగ్గరకు
తీసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకి నాన్న జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేసి
సక్సెస్ అయ్యారు.
ఆరోజు
అలా మా జీవితాలని ఆఖరు చేసుకుని ఉంటే ఈ రోజు మేమూ ఉండేవాళ్ళం కాదు నువ్వూ
ఉండేవాడివి కాదు.
పొద్దువాలే
సంధ్యా సమయపు ఆ పడమటి చూపే ఆఖరవ్వాలనుకున్నాం…
కానీ
ఆ పడమటనే ఒక నవోదయపు పొద్దు పొడిచేలా చేసిందో పక్షి.
ఒక్క
సారి గమనించి చూడరా… గాలినే
ఇంధనంగా తన రెక్కల శక్తితో సాగరాలనీ దిగంతాలనీ దాటేస్తూ ఉంటాయ్ పక్షులు.
తరచి
చూడాలే కానీ నీ విజయాలకి ప్రకృతిని మించిన ఇంధనం ఏముంది?
ఎన్నో
సార్లు చూసి ఉంటాం ఆకాశంలో పక్షులు అలా ఎగరటాన్ని… కానీ జీవితాన్ని మలుపు
తిప్పే క్షణం ఒకటి వాటివల్లే వస్తుందని అనుకోలేదు. జీవితంలో ఇన్స్పిరేషన్ అనేది
ఎక్కడినుండైనా రావచ్చు… వస్తుంది
కూడా…
అందుకే
మా జీవితంలో మేము నేర్చుకున్న పాఠాన్ని శాశ్వతం చేసుకోవాలని మీ నాన్న ఈ పెయింటింగ్
వేయించారు...
నువ్వాపితే
ఆగిపోతుంది జీవితం… కానీ
ఆపాక మళ్ళీ మొదలవ్వాలంటే వీలవుతుందా?
ఓటములు
ఉంటాయ్… వాటి
వెనకాలే విజయాలూ వస్తాయ్… కావాల్సింది
కాస్తంత సహనం.
నిజానికి
నువ్వు ఓడి పోలేదు. ఒక పాఠం నేర్చుకున్నావ్. లోకంలో ఎలాంటి వాళ్ళున్నారో
తెలుసుకున్నావ్. ఈ సారి పొరపాటు చెయ్యవ్. నీ అనుభవం నిన్ను పొరపాటు చెయ్యనివ్వదు
మా
కన్నా సత్తా మాకు తెలుసు. నేలకి కొట్టిన బంతిలా పైకి ఎగురుతాడు… మోసం చేసిన వాళ్ళ
కన్నుకుట్టేలా… తననా
వదులుకుంది అని వాళ్ళు ఏడ్చేలా…
అయినా
నీకేంట్రా? నీ
పక్కన మేమున్నాం… అన్నిటికీ
సమాధానంగా… అది
చాలదూ!
నీ
కాళ్ళ మీద నువ్వు నిలబడటం అంటే మాట సహాయం కూడా తీసుకోక పోవటం కాదురా… మా అనుభవాల్లో నువ్వు
మొదలవ్వాలి… నీ
విజయాలతో పరిపూర్ణం అవ్వాలి.’ మంద్రమైన స్వరంతో మనసుకి
నాటుకునేలా చెప్పి ముగించింది కావ్య.
మానస్
ముఖంలో ఓ కొత్త వెలుగు…
కొత్త
ప్రభాతం మొదలైన గుర్తుగా గుళ్ళో నుండి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సుప్రభాతం అలలు
అలలుగా మమ్మల్ని తాకుతూ…
జీవితమొకటి
ప్రభవించింది.







2 comments:
బాగా వ్రాస్తున్నారు...
Nice narration on 'Self-confidence...makes a man great'
Post a Comment