అశోకుని కాలం నుండి సజీవమైన ‘సత్యమేవజయతే’ నినాదాలన్నీ
గొంతు నుండి మొదలయ్యాయి కానీ ఏ గుండెనూ ఇంకా చేరలేదు
దేశద్రోహులని కీర్తించే విశ్వవిద్యాలయాల ప్రాంగణాల సహనాలకూ
సరిహద్దుల్లో నేలరాలే సైనికుల జీతభత్యాల లెక్కలేసే అప్రజల త్యాగాలకూ
మానవహక్కులన్నీ ఒకే కంటితో చూసే చూపులకూ
అధికారం కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయులకూ
నిజంగా ఇది అసహన భారతమే
కోట్లకు పడగలెత్తిన మీకు
అవార్డుల పేరిట లక్షలు గుమ్మరిస్తుంటే
గంజి దొరకని చెల్లిని చూసి అసహనం
రైతన్నల దగ్గర గుంజిన నేల తివాచీని
అకాడమీల పేరిట మీరు పరుచుకుంటున్నప్పుడు
కూలీ చేసుకోవడానికీ నేల మిగలని అసహనం
నూరు కోట్లకో వేయి కోట్లకో
మీ నటన విలువని తూకమేస్తుంటే
మా కన్నీళ్ళని తూయడానికీ మనిషి మిగలని అసహనం
మీ బొమ్మల మీద పాలాభిషేకాలు మొదలై మీరు దేవతలైన చోట
పసిబిడ్డల ఆకలి తీర్చటానికి మాలో చేవలేని అసహనం
అత్యాధికాదాయవర్గాలకూ పన్ను మాఫీ చేసే దేశభక్త అధికారం మాటున
పొలం శిస్తుకూ పైసా లేని రైతు స్వేదపు అసహనం
వర్ణాల లెక్కల్లో వర్గాల ఖాతాల్లో మనిషితనపు తూనికలేసేచోట
మానవత్వపు శిధిలాలకై వెదుకులాడే అసహనం
మా అసహనాలన్నీ కొన్ని కొవ్వొత్తుల ఖర్చో
గాలిలోకి విసురుతున్న కొన్ని పిడికిళ్ల సవ్వడో
అయినంతకాలం మీ వేషాలన్నీ చెల్లిపోతుంటాయ్
బ్రతుకంటే వీయైపీలు చెప్పే దేశభక్తి కథలు కాదని
పోరాటాలన్నీ ఎర్రఝండాల్లో ఎగిరే చారిత్రిక తప్పిదాలు కాదనీ
సమాజమంటే సామాన్యుల సమాన హక్కనీ
తెలిసొచ్చిన ఘడియల్లో
నరాల నిండా కొన్ని అగ్నిశిఖలు ప్రజ్వరిల్లటం మొదలయ్యాకే తెలుస్తుంది మీకు
నిజమైన అసహనమంటే
ప్రతి మీకూ… ప్రతి నీకూ…
మా అసహనాలకూ ఓ లెక్కుంటుందిగా మరి!







0 comments:
Post a Comment