బాహ్యాంతరాల మధ్య సరిహద్దు రేఖపై
కాసేపలా నిలబడి చూడు మిత్రమా
జీవితం ఎలాంటి సున్నితమైన త్రాసుపై నిలబడి ఉందో
కులమతాలో ప్రాంతీయవాదాలో గీసే సరిహద్దు కంచెలలో
మనిషి ప్రస్థానం అలవోకగా సాగుతుంటే
తరువు తలలు తెగనరికిన పాపపు ప్రాయశ్చిత్తం
వర్షాభావమై నేలని పగలగొడుతున్న దృశ్యం
ఏ తలపు తలుపునూ ఇంకా తట్టటం లేదు
సజీవ శిలల నర్తనంతో
కుండపోతగా కురుస్తున్న లోకం
గజిబిజి చినుకుల్లా ఎగిరిపడుతూ ఉంటే
బెరుకు బెరుకుగా రాలి పడుతున్న
అక్షరాల ఆత్మలన్నీ నీళ్ళు కురుస్తున్నాయి
రాబోయే ప్రళయానికి ఇంధనమౌతూ
ఒక నాగరికత్వపు విశృంఖలత్వంలో
కొట్టుకుపోతున్న కాలం
ఏ ప్రశ్నకూ సమాధానం ఇచ్చే స్థితిలో లేదన్న నిజం
కొన్ని చట్టబద్ధమైన చీకట్లని
మనకి పరిచయిస్తే
మనసారా హత్తుకోవటం తప్ప ఇంకో దారేమీ లేదు
కనీసం అదృశ్యం అయ్యేటప్పుడైనా
దోషిత్వం ఒప్పుకున్న సంతృప్తితో
వీడ్కోలు పుచ్చుకోవటం
చారిత్రిక అవసరమేమీ కాకపోవచ్చు కానీ
మనిషిగా ముగిసిపోవటమెప్పుడూ
ప్రకృతిలో స్వచ్ఛంగా కరిగిపోవటమే…!






0 comments:
Post a Comment