రేయ్...
నేనెవరినిరా?
నీకు నేనేమిట్రా?
నీడను కాదూ...
నీ నిజాన్ని కదూ
రెప్పల్ని
దాటేసుకుంటూ వచ్చే ఏకైక స్వప్నాన్ని కాదూ?
గుండెని అంటిపెట్టుకుని ఉండే శాశ్వత వాస్తవాన్ని కాదూ…
పోనీ నువ్వెవరో
తెలుసా
నువ్వు నాకేమిటో
తెలుసా
నువ్వొక నిర్వచనం...
నా జీవనపర్యంతం...!
చీకటిని చిద్రం
చేస్తూ
కదిలే చిత్తరువులా
నిన్ను వెన్నెలని
చేస్తూ
నింగి నాలో
కురుస్తుంటే
నా కొనసాగింపంతా
అనంత ఏకాంతమే
ఎప్పటికప్పుడు పాత
సందర్భాలు కొత్తగా గుర్తొస్తున్నాయి
ప్రతిదానిలోనూ
నువ్వే
నిను దాటి చూడటానికి
ఇంకేమీ లేదక్కడ
నువ్వంటూ నన్ను
హత్తుకున్నాక
నీకూ నాకూ మధ్య
లోలకంగా మారిన క్షణాల సవ్వడి
తన మునివేళ్ళ
స్పర్శతో ఎన్ని శూన్యాలని
అలవోకగా పక్కకి
నెట్టెయ్యలేదూ
మరేమయ్యిందిరా
ఇప్పుడు
నన్ను నీ నీడగా
కట్టేసుకున్నావని మరచావా ఏం
ఒంటరిగా
తడిబారిపోతున్నావ్
చీకటించిన లోకానికి
నీడల జాడ కానరాకపోవచ్చుగానీ
జీవిత పథమంతా ఏకాంత
ఆవాసంలో
మనవైన క్షణాలకి
మాత్రం
మనమే పాలకులం మనమే
పాలితులం
ఒకరిలో ఒకరిమై
ఒదిగిన జనితులం
ఒక్కటి చెప్పనా
నీ కంటికి తేమ
తగలకముందే
మెదలాలి
ఏ తడి చిహ్నాలనీ
సహించలేని స్వార్ధమంత నేనే
నిన్ను నిలువెత్తు
స్వార్ధంగా చేసుకున్న నేనే
నీ నిశ్చింతలో
విశ్రాంతి వెదుక్కునే నేనే
నేనే నేనే
ప్రతిసారీ నేనే







0 comments:
Post a Comment