పంట పొలాల్లో నీరు లేక ఎండిపోతేనేం?
రైతు కంట్లో జీవనదిగా పారుతోందిగా
బహుళజాతి కంపెనీల బాటిల్స్ ఇన్ని ఉండగా
దాహార్తి తీర్చే బావులు ఎండిపోయి బండ పడితే బాధ ఎందుకోయ్
గొంతెండుతున్న లెక్కలు తీస్తావేమోయ్
క్రికెట్ పిచ్ ని తడపటానికి కాసిని నీళ్ళు వాడుకుంటుంటే
ప్రభుత్వ గోదాముల్లో ధాన్యం ముక్కి పోతుందంటావేం
పందికొక్కుల పాలిట ఏమాత్రం జాలి లేనట్లుంది నీకు
ధాన్యానికి మద్దతు ధర దొరక్కపోతేనేమోయ్
అభిమాన నాయకుడి సినిమా టిక్కెట్ ధర వేలరూపాయలు పలుకుతుంటే
నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయని బాధ ఎందుకోయ్
ఎం ఆర్ పి ధరలకే మద్యం దొరుకుతుంటే
కట్టుకోవడానికి ఒంటినిండా బట్ట లేకపోతేనేం
వెండితెర మీద తారలకు ఆ మాత్రం ఉందా ఏమిటి పాపం
అనారోగ్యానికి ఆదుకునే ఆసుపత్రి లేకపోతే పోయే
అవయవాలు అమ్ముకునే సౌకర్యం మనకుందిగా
బడాబాబులు బ్యాంకులోనులు ఎగ్గోడితేనేం
బక్కప్రాణుల తాటదీసి చిల్లర పైసలు జమ చేస్తున్నాం
పేదవాడు మరింత పేదవాడయితే అయితేనేం రా
ఎక్కడికి పోయిందా డబ్బు.. పనామా బాంక్ లో పదిలంగా ఉందిగా
ఇంకా 50 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉంటేనేం..
రోజుకి 32 రూ.. ల లెక్కతో ఈడ్చి అవతల పారేయలేమా ఏమిటి
కనిపెంచిన ముసల్లి తల్లి తండ్రులకు తిండి పెట్టకపోతేనేం
కనబడని దేముడికి ఎన్నెన్ని నైవేద్యాలు పెడుతున్నామో కదా
ఆకలి బాంబులతో ఎన్ని ప్రాణాలు పోతేనేమోయ్
సరిహద్దుల నిండా శాంతిని అణుబాంబులతోఎగరవేస్తున్నాం
విద్యరంగాన్ని రాజకీయ రహదారికి మళ్ళించేసాంగా
యువత భావితకింకేమి లోటట
కళ్ళముందు ఎన్నో కఠిన సంఘటనలు జరుగుతున్నాయి
ఇంకా నయం… మనకెందుకులే అని ఊరుకోకుండా మారిపోతామా ఏమిటి
ఇదేరా మన నవ జీవన తంత్రం
ఇదే ఇదే ఇప్పటి మన సహన భారతీయం 






0 comments:
Post a Comment