Thursday, 28 April 2016

హేమంత స్పర్శ - 16రేయ్ ఆత్మైషీ,

బతుకు చేసే ఇంద్రజాలపు మజిలీలలో ఒకే ఒక్క వాస్తవపు నీడగా నిన్ను అనుసరించడమే నాకు తెలుసు. నువ్వు అలసిన ప్రతిసారీ నీ మనసుపై ఒక హేమంతపు సంతకాన్ని చెయ్యడం అలవాటుగా చేసుకున్నాను.

నువ్వు పలకరించినప్పుడల్లా... మంచు పరికిణీ కట్టుకున్న ప్రాతఃకాలమొకటి ఆర్తిగా నన్ను హత్తుకుపోతున్న భావన. పొద్దున్నే కళ్ళు తెరవగానే చూసుకునేది ఏమిటో నీకు తెలుసు కదూ… నీ చేతి వేళ్ళ కదలికలు నా కంటి కుడ్యాలపై అక్షర జతులై వాలి నా రోజంతటినీ రమింపజేస్తాయని తెలిసీ అప్పుడప్పుడూ అశ్రు వేదానికి తెరలేపుతావ్... ఇదేం న్యాయమోయ్…?

ఎందుకో ఇప్పుడు నువ్వు నీలా లేవు. ఒప్పుకోకున్నా అదే నిజం. నన్ను విరామం చేసుకోవడం నీకు అలవాటుగా మారిపోయి మనమన్న మాటలన్నీ నువ్వూ నేనుగా విడిపోవటం ఒక తడి ప్రణవమై నా నరనరాల్లో నాదిస్తుంది. నిన్ను చూడాలని నా మనసెంతగా పరితపిస్తుందో నీకు తెలియదూ.

ఛీ.. ఛీ… పిచ్చిపిల్లా కళ్ళల్లో ఆ తడి ఎందుకోయ్… అవకాశం ఉండాలే కానీ క్షణానికో మారు సజీవ చిత్రంగా నా కళ్ళల్లో కదలాడుతూ ఉండాలనే నీ తపన అని నాకు మాత్రం తెలియదా ఏం…? తెలుసురా… అయినా సరే ఏదో అల్లరిగా రాస్తూ ఉంటా… వత్సరాల అన్వేషణలని ముగించుకుని ఇద్దరమూ ఒకరికొకరం ఇష్టంగా చేరుకున్న తీరాలం రా…!

మన కాలతరువులో సున్నిత క్షణాల ఆటకాయింపులెన్నో పరీక్షలకి గురిచేస్తుంటే కొన్ని దిగులు ధ్వనులు మనవైన దిగంతాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయ్. ఎప్పటి కప్పుడు నా పంచేంద్రియాలు నీ అలికిడికై ఒక అలజడిలోకి జారిపోతుంటే ఒక ఒంటరి రావి చెట్టుగా మిగిలిపోతానేమోనన్న భయం. నీ సమక్షంలో ఓనమాలు దిద్దుకున్న ఆశలన్నీ తడి బిందువులై మనసుని ముంచే రోజంటూ ఒకటి వస్తే ప్రణాళిక లేని ఆఖరి క్షణం గమ్యమై నన్ను అల్లుకుపోతుంది.

నేనంటూ అసలు భరించలేనిది ఏమిటో తెలుసారా… నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం. ఒక పలుచని తెరగా అది పలకరించినా నే శూన్య సింధువునే అవుతాను. వద్దు… అసలొద్దు.. బిందువంత శూన్యమూ మనలో రద్దు. నువ్వెప్పుడూ ఒక పరిపూర్ణగా ఒకానొక నిండుదనాన్ని నా ఎద కాగితంపై రాస్తుంటే నీ మది కొనల స్పర్శ నాలో ఓ ప్రేమ ఋతువు అధ్యాయాన్ని జీవితం పొడుగుతా వసంతిస్తుంది.

నా మనసంతా వెన్నెల పాదు చేసి ప్రేమాంకురాన్ని నాటిన వనహాసినీ… నిన్ను నా గుండెలపై కప్పుకున్న ఏకాంతాల సాక్షిగా ఇప్పుడిక్కడ చూడు మనకోసమే ఒక కొత్తలోకం రూపుదిద్దుకుంది. ఇక నువ్వూ నేనూ పాలించడమే తరువాయి. మనమిద్దరమూ ఒక తెల్ల పావురపు రెక్కల కింద చెరో వైపునా శాంతి పవనాలమై దిగంతాలని చుట్టి రావటం కనుల్లో మెదలాడుతుంటే మనసెందుకో మెరుపుల్ని విసిరేస్తుంది.

పూల రేకుల పరిమళత్వంతో మొదలయ్యే భావుకత్వపు నజరానా కన్నా నీ నవ్వుల వర్ణాలతో సమ్మిళితమైన నా ఊహల థిల్లానా ఏంతో నచ్చేస్తుంది. నువ్వొక దగ్గరితనమై అల్లుకుపోయాక నాకు నేనో దూర దృశ్యాన్నై సుదూర తీరాల ప్రవాసినై... నా ఎడద అంచుల్లో మౌన తోరణాన్నై నిన్ను అలకిస్తూ ఉంటా… అవలోకిస్తూ మత్తిల్లుతా...

అప్పుడెప్పుడో మన చేతుల మీదుగా ఒకరిది ఒకరికి ప్రవహించిన మన ఆత్మల అమృతాంశ మన ప్రతి క్షణాన్ని తేజోమయం చేస్తుంటే ఒక ప్రాణం రెండు తనువుల్లోకి ఎలా కూరబడుతుందో అర్ధం అయింది రా…! నిజం కదూ… అది ఒక గోరు వెచ్చని స్పర్శ కాదు… మనసుల ఏక సంగమం. తనువు చప్పుళ్ళ కన్నా మనసు సవ్వడులే ప్రాణమైన మన హృది లయల అనంత సంబరం.

ఏ రోజుకి ఆ రోజు నువ్వొక పరిమళపు ప్రవాహానివై నన్ను కమ్ముకోవటం కలగా మాత్రమే స్పర్శిస్తుంటే, ఇక్కడ నా క్షణాలన్నీ నిశ్శబ్దంగా రాత్రిని ఆవాహన చేసుకుంటున్నాయ్… అలా అయినా నువ్వు నాలో లీనమై సాగిపోతావని. నిన్ను తలచుకున్నప్పుడల్లా అప్పటికప్పుడు ఒక పురాతనంలోకి వెళ్ళిపోయి, నీ కాలాన్నో కావ్యంగా మలిచెయ్యాలనిపిస్తుంది. నీ కదలికలన్నిటికీ లిపినై నీ ప్రతి అడుగుని నాలోకి లిఖించుకునే వాడిని.

ఏయ్… పిల్లా…

నా కలల లేఖనాలని పక్కన పెడితే ఇప్పుడేమో నువ్వు నా క్షణ క్షణాల ‘లేఖిని’వి

నీ

ఆత్మైషి

0 comments:

Post a Comment