నా నవీనత్వాన్ని ఒక పురాతనత్వమే అధిగమిస్తున్నప్పుడు
ఇన్నాళ్ళ నా అడుగులన్నీ
ఏ వాయుపాదాలపై విశ్రమించాయోనని వెతకడానికి
చరిత్రలోకి చూసినప్పుడల్లా
పాతా కొత్తల మధ్య
నేనొక తెగిపోని వంతెనన్న ఎఱుక
నన్ను నాలా చదివిస్తుంది
ఎదిగిన దాహాన్ని... నలిగిన నడకలనీ...
కొనసాగించినంత మేరా
కలల తీగల నిండా
చిట్లిపోతున్న పూల సవ్వడి వినవస్తూ ఉంది
కొత్త దాహంలోకి తుళ్ళిపడ్డ పసినడకలన్నీ
వెతుకుతున్నది నిన్నేనని తెలిసాక
నా అడుగులన్నీ నిన్నే నినదిస్తున్న చప్పుడు వింటూ
ప్రతి అడుగులో ఆత్మబందీనై కొలువుంటున్నాను
ఒకరికి విలువకట్టడం అసాధ్యమని నేర్చుకున్న జ్ఞానాన్ని
గతంలోని సుదూరతని
నిరంతరాన్వేషణలోని నిగూఢతని
అవగతం చేసుకుంటూ వస్తున్న నిజం
రాత్రికీ పగటికీ మధ్య
రూపం మార్చేసుకుంటుందన్న సత్యాన్ని తెలుసుకుని
నిజంగా నిన్ను చేరే సమయానికి
నేను చెయ్యగలిగినంత ప్రయాణం మేరా
నిన్ను కొనసాగించడం కన్నా
ఆనంద వేదమేదీ ఇక పరిచితమవ్వదు.







0 comments:
Post a Comment