ఏ పరిచయానికి ఆ పరిచయం ఎప్పుడూ కొత్త ప్రారంభమే... చాలా పరిచయాల్లో బహుశా ముగింపు కూడా అదే క్షణం.
కొన్ని పరిచయాలు చెవులకి, మరి కొన్ని పరిచయాలు కలలకి, ఇంకొన్ని పరిచయాలు కళ్ళకి... అప్పుడప్పుడూ ఏ ఒక్క పరిచయమో మనసుకి. మిగిలిన పరిచయాలు నన్ను నన్నుగా ఉండనివ్వకుండా కదిలించలేవు కానీ మనసుకైన పరిచయం జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందో ఊహించటం దుర్లభం. అయినా సరే కొంగ్రొత్త పరిచయాల కోసం నిరంతర యాత్రికునిలా తిరుగుతూనే ఉంటుంది మనసు. ఎన్ని దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోని జ్ఞానమంజూషమే కదా మరి మనసంటే.
ఒక గాయాన్ని మాన్పుతుందేమో అని ఒక వీడ్కోలు నుండి మరో పరిచయానికి ఎడ తెగని ప్రయాణం చేస్తూనే ఉంటుంది కాని మూల కారణం ఏమిటా అని తనను తాను అవలోకన చేసుకోవటానికి సమయమే దొరకని అవిశ్రాంత యంత్రమీ మనసు.
ఏ విశ్రాంత క్షణంలోనో తనని తనకి పరిచయం చేసి నన్ను నేను సరికొత్తగా లోకానికి పరిచయించుకోవాలనే తపనే తోడుగా నిరంతరంగా దాహపడుతూనే ఉన్నాను నాలో నేను పరదేశిలా గడిపేస్తున్న క్షణాలని అంతం చెయ్యాలనే ఆశతో...







0 comments:
Post a Comment