Tuesday, 3 May 2016

వానలెలా కురుస్తాయి మహాశయా?‘ఏంటి సుబ్బారావ్. పని మొదలు పెట్టి 15 రోజులయ్యింది. ఇంతవరకూ పునాదుల కోసం మొదలు పెట్టిన గుంటలే అవ్వలేదు. ఇట్లయితే పని ఎప్పటికి పూర్తి అవుతుంది?’ అడిగాడు రాజేంద్ర, భగభగమంటూ మండుతున్న ఎండలో నిలబడలేక అక్కడే ఉన్న ఓ చెట్టుకింద చేరి.

‘లేదు స్వామీ... ఊళ్ళో జాతర అని మా వాళ్ళంతా ఒంగోలు పోయారు. వాళ్ళు రాగానే పని ఊపందుకుంటుంది.’

‘ఏమి చేస్తావో ఏమిటో ఏదో తెలిసిన వాడివి కదా నిన్ను నమ్ముకుని ఇల్లు మొదలు పెట్టా... పని గబా గబా అయితే తక్కువ ఖర్చు తో బయటపడవచ్చు’

‘అదేంది స్వామీ... నీ ఇల్లయితే ఒకటి నా ఇల్లయితే ఒకటీనా. ఇంకో పదిరోజుల తరువాత చూడు. నువ్వీ మాట అనవు. అసలీ చెట్టును కొట్టేస్తే ఇంకో రూం వెయ్యొచ్చు’

‘నేనూ అదే అనుకుంటున్నాను కానీ మునిసిపల్ పర్మిషన్ తీసుకోలేదు. తీసుకున్నాక చూద్దాం లే అని ఆలోచిస్తున్నా’

‘మీరా పర్మిషన్ పని లో ఉండండి మా కుర్రోళ్ళు రాగానే ఆ చెట్టుని కొట్టేసి అక్కడ కూడా పునాదులు తీసి రెడీ గా ఉంటా... పనిలో పని గా ఒకేసారి లాగించెయ్యాలి కానీ మళ్ళీ అదెప్పుడో అంటే అయ్యే పని కాదు’

‘సరేలే నువ్వా పనిలో ఉండు’ అంటూ ఏదో ఆలోచనలో పడిపోయాడు రాజేంద్ర.

ఇంతలో ఎవరో పిలిచినట్లు అనిపించింది రాజేంద్ర కి. చుట్టూ చూసాడు ఎవరూ కనిపించలేదు.

‘నేనే పిలిచింది. నువ్వు నిలబడింది నా నీడలోనే’ అంది ఆ చెట్టు.

‘ఏమిటి?’ అన్నాడు రాజేంద్ర.

‘నన్ను కొట్టేస్తున్నారా?’

‘అవును’

‘నన్ను కొట్టేస్తే ఏమొస్తుంది?’

‘నిన్ను కొట్టేస్తే ఇంకో రూం వేసుకోవచ్చు’

‘ఇప్పుడు కట్టే ఇల్లు సరిపోదా?’

‘భలేదానివే... ఇల్లు సరిపోతుందా లేదా అని కాదు.’

‘మరి?’

‘ఎన్ని రూం లు పెరిగితే అంత అద్దె పెరుగుతుంది.’

‘అద్దె పెరుగుతుంది అనా...’

‘అవును. ఎంత అద్దె ఎక్కువ ఉంటే అంత ఆదాయం. డబ్బుంటే నా పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఏ లోటూ లేకుండా గడచిపోతుంది’

‘డబ్బుంటే ఏ లోటూ ఉండదా?’

‘డబ్బుంటే ఇక దేనికైనా లోటేముంటుంది? కాలు మీద కాలు వేసుకుని దర్జాగా గడిపెయ్యవచ్చు.’

‘బతకటానికి తిండి గింజలు అవసరం లేదా?’

‘కావాలి. కానీ డబ్బుతో తిండి గింజలు కొనుక్కోవచ్చు.’

‘కొనటానికి అసలు తిండి గింజలు ఉండాలి కదా?’

‘తిండిగింజలు ఎందుకు ఉండవు. రైతులు పండిస్తారు కదా?’

‘రైతు ఆహార ధాన్యం పండించాలంటే వ్యవసాయానికి నీళ్ళు ఉండాలి కదా.’

‘మా ప్రభుత్వం రైతులకి ఉచిత విద్యుత్తు ఇస్తుంది తెలుసా?’

‘ఇస్తే...?’

‘పొలాల్లో బోర్లు వేస్తే నీళ్ళు వస్తాయి. వాటితో పంటలు పండుతాయి’

‘బోర్లు వేసేస్తే నీళ్ళు రావటానికి అసలు భూమి పొరల్లో నీళ్ళు ఉండాలి కదా?’

‘ఎందుకు ఉండవు? ప్రతేడాది వానలు కురుస్తూ ఉంటాయి కదా’

‘వానలెలా కురుస్తాయి మహాశయా?’

‘ఆవిరి మేఘాలు చెట్లను తాకితే వానలు కురుస్తాయి’

‘ఆవిరి మేఘాలుంటాయి సరే? మరి చెట్టు ఎక్కడ?’

‘నేనో చెట్టు కొట్టేస్తే వృక్ష జాతే అంతం అవుతుందా?’

‘నువ్వో చెట్టు, నీ మిత్రుడో చెట్టూ, నీ శత్రువో చెట్టూ.... మనుషులందరూ మీలాంటి వాళ్ళే కదా? అందరూ తలో చెట్టూ నరికేస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి?

అసలు మేమంటూ లేకపోతే స్వచ్చ మైన గాలి పీల్చగలవా?

మీరు మీ వారసుల కిచ్చే సంపద అనుభవించటానికి అసలు మానవ జాతి మిగలాలి కదా?

మానవ జాతి అని ఏముంది. అసలు ప్రాణికోటి మిగలాలి కదా ఈ భూమాతపై.

ఎప్పుడో 2500 ఏళ్ళ క్రితం భారత దేశాన్ని పరిపాలించిన అశోకుడు ని ‘అశోకుడు చెట్లు నాటించెను’ అని ఈ నాటికీ తలచుకుంటారు కదా.

2500 ఏళ్ళ క్రితమే మీ పూర్వీకులు గుర్తించిన దాన్ని మీరెందుకు విస్మరిస్తూ మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటూ మీతో పాటు అన్ని జాతులని నాశనం చేస్తున్నారు?’ పెద్దగా అరుస్తున్నట్లు అంది చెట్టు.

‘లేదు లేదు నేను నిన్ను కొట్టెయ్యను కొట్టెయ్యను’ పెద్దగా కలవరిస్తున్నాడు రాజేంద్ర.

అతని కలవరింతలు విని అక్కడికి వచ్చిన తాపీ మేస్త్రీ సుబ్బారావు ‘సార్... సార్’ అంటూ రాజేంద్ర ని చేత్తో తట్టాడు.

రాజేంద్ర ఉలిక్కి పడి లేచాడు. చుట్టూ చూసాక తను ఇప్పటిదాక కల కన్నాడు అని అర్ధం చేసుకున్నాడు.

‘ఏమిటి సార్ ఏదో కలవరిస్తున్నారు’ అన్నాడు సుబ్బారావు.

‘ఏమీలేదు కానీ. పునాదులు అయినంత వరకూ ఆపెయ్యి. ఇంటి ప్లాన్ మార్చేయ్యాలి. ఇంటిచుట్టూ మొక్కలు నాటాలి. అన్నట్టు ఈ చెట్టు కూడా కొట్టొద్దు’ అంటూ వడి వడిగా కారెక్కాడు రాజేంద్ర, ఆర్కిటెక్ట్ దగ్గరకు వెళ్ళటానికి.

1 comments:

Worship the Nature: Message well conveyed....

Post a Comment